జయలలిత జయంతి వేళ తమిళనాడులో వేడెక్కిన రాజకీయాలు,వేడుకల ఏర్పాట్లలో అన్నాడీఎంకే,కార్యరంగంలోకి దూకబోతున్న చిన్నమ్మ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి రాజకీయ వాతావరణం క్రమేపీ వేడేక్కుతోంది.. అసలు తమిళనాడులో ఏ ఎన్నికలైనా ఆసక్తిని కలిగిస్తాయి..
Jayalalitha Birth Anniversary Celebrations:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి రాజకీయ వాతావరణం క్రమేపీ వేడేక్కుతోంది.. అసలు తమిళనాడులో ఏ ఎన్నికలైనా ఆసక్తిని కలిగిస్తాయి.. అంత నాటకీయత ఉంటుందక్కడి పాలిటిక్స్‌లో! ఈసారి మరింత రంజుగా ఉండబోతున్నాయి.. అన్నాడీఎంకేలో జయలలిత, డీఎంకేలో కరుణానిధి లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఇద్దరు దిగ్గజాలు లేకుండా జరుగుతున్న ఎన్నికలు కాబట్టే చాలా మంది దృష్టి అటు పడుతున్నది.. పాలిటిక్స్‌లో దిగడం, పార్టీ పెట్టడం అంత ఆషామాషీ కాదనే విషయాన్ని చాలా లేటుగా తెలుసుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ లేటెస్ట్‌గా రాజకీయ పార్టీ పెట్టేది లేదు, రాజకీయాల్లోకి వచ్చేది లేదని నిర్మోహమాటంగా, నిష్కర్షగా చెప్పేశారు.. మరో నటుడు కమల్‌హాసన్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు.
రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉండటంతో రాజకీయపార్టీలన్నీ ఎత్తులు పొత్తులపై కసరత్తులు చేస్తున్నాయి.. కొన్ని పార్టీలేమో పొత్తుల జంజాటం ఎందుకనే నిర్ణయానికి వచ్చి ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నాయి.. మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసనేమో ఇంకా రజనీకాంత్‌ను రారమ్మని పిలుస్తున్నారు. మొన్న చెన్నై పోయెస్ గార్డెన్‌కు వెళ్లి మరీ రజనీకాంత్‌ను కలిశారు కూడా! పార్టీని ఏర్పాటు చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నిన్న చిన్నపాటి వేడుకను జరుపుకున్నారు కమల్‌హాసన్.. ఈ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడేటప్పుడు పరోక్షంగా రజనీకాంత్‌కు కలిసి పనిచేద్దామనే పిలుపిచ్చారు కమల్‌హాసన్. కమల్‌హాసన్ అయితే ఆహ్వానిస్తున్నారు కానీ రజనీకాంత్‌కు మాత్రం వచ్చే ఇష్టం లేదు.. సరే ఈ ఇద్దరు హీరోల విషయాన్ని పక్కన పెడితే మొన్నీమధ్యనే జైలు నుంచి విడుదలై వచ్చిన చిన్నమ్మ శశికళ కూడా రాజకీయ దూకుడు పెంచారు. కేడర్‌ను విస్తరించే పనిలో పడ్డారు. ఎల్లుండి, అంటే ఈ నెల 24న జయలలిత జయంతి రోజున కీలకమైన నేతలతో సమావేశమవుతున్నారు.. ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు ఇంటిపట్టునే ఉంటున్న శశికళ ఎల్లుండి నుంచి పూర్తిగా యాక్టివ్ అవుతారు. ఇంటిదగ్గరే జయలలిత చిత్రపటానికి నివాళులు అర్పించి కార్యరంగంలోకి దూకబోతున్నారు. అదే రోజు చెన్నైలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శశికళ.. ప్రస్తుతం కాసింత అసంతృప్తితో ఉన్న పన్నీరు సెల్వాన్ని తమవైపుకు లాగేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం నేత దినకరన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పన్నీరుసెల్వానికి ముఖ్యమంత్రిని చేయడంలో శశికళ పాత్ర ఎంతగానే ఉందని, ఆ విషయం పన్నీరుకు కూడా తెలుసని, ఆయన భరతుడే అయితే, చిన్నమ్మకు మద్దతుగా నిలబడతానంటే ఆయనను పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని దినకరన్ చేసిన వ్యాఖ్యలను చూస్తే పార్టీ బలోపేతంపై బాగానే దృష్టి పెట్టినట్టు అర్థమవుతున్నది. భారతీయ జనతాపార్టీతో మాటా ముచ్చట జరిపినట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని దినకరన్ అన్నారు.. డీఎంకే అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీజేపీతో చేతులు కలపాల్సి వస్తే అందుకు తాము సిద్ధమేనన్నారు దినకరన్.
మరోవైపు అధికార అన్నా డీఎంకే పార్టీ కూడా జయలలిత జయంతి వేడుకలను బ్రహ్మండంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.. ఈ రకంగా జయలలితకు నిజమైన వారసులం తామేనని ప్రజలకు తెలుస్తుందన్నది అన్నాడీఎంకే పార్టీ అధినేతల భావన. అమ్మ మక్కల మున్నేట్ర కజగం కంటే గొప్పగా, ఘనంగా వేడుకలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నది ప్రభుత్వం.. ఆ రోజు నుంచి పలు సేవా కార్యక్రమాలలతో ప్రజలకు చేరువ కావడానికి ప్లాన్ చేస్తోంది.. పలు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. చెన్నై ఆర్కేనగర్‌లో జరిగే సభలో ముఖ్యమంత్రి పళనిస్వామి పాల్గొంటుంటే, బోడినాయకనూర్‌లో జరిగే బహిరంగసభలో ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం పాల్గొననున్నారు. మరోవైపు డీఎంకే మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. ప్రజలలో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత తమకు కలిసిరావచ్చునని బలంగా నమ్ముతోంది.. ఎంజీఆర్ మరణం తర్వాత అటు అన్నాడీఎంకే కానీ, ఇటు డీఎంకే కానీ వరుసగా రెండుసార్లు గెలిచింది లేదు. అదేమిటో కానీ అనూహ్యంగా అన్నాడీఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే జయలలిత చనిపోవడం, చిన్నమ్మ శశికళ జైలుకు వెళ్లడంతో అన్నాడీఎంకేలో చీలికలు రావడం, ప్రభుత్వం కుప్పకూలడం గ్యారంటీ అనుకున్నవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ పళనిస్వామి ప్రభుత్వం ఇంతకాలం నెట్టుకొచ్చింది.. పన్నీరు సెల్వం కూడా తన అసంతృప్తిని లోలోపలే దాచేసుకుని ఉప ముఖ్యమంత్రి పదవితో రాజీపడిపోయారు. పన్నీరు సెల్వం అసంతృప్తి ఏమో కానీ ప్రజలలో మాత్రం ప్రస్తుత ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి ఏర్పడిన మాట మాత్రం నిజం! ఆ కొంచెమే తమను అధికారంలోకి తెస్తుందని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అభిప్రాయపడుతోంది..
Also Read:
Corona Virus: ఆ జిల్లాలో మార్చి 7వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్.. ప్రకటించిన మంత్రి..
Tomato Benefits : అందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే టమాటా.. దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో..!