Viral: 17 ఏళ్ల యువతికి తీవ్ర వాంతులు, విపరీతమైన కడుపునొప్పి.. ఆస్పత్రికిలో ఎక్స్ రే తీయగా
ఆ అమ్మాయికి వారం నుంచి అస్సలు ఆరోగ్యం బాగుండటం లేదు. అదే పనిగా వాంతులు అవుతున్నాయి. ఏం తిన్నా సహించడం లేదు. పైగా విపరీతమైన కడపునొప్పి. స్థానికంగా చూపించారు కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ...

ఇండోర్‌లో 17 ఏళ్ల యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దాదాపు వారం పాటు తీవ్రమైన కడుపునొప్పి, నిరంతర వాంతులు, అన్నం తినలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంది. స్థానిక ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఎలాంటి రిలీఫ్ దక్కలేదు. దీంతో ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అమిత్ అగర్వాల్ ఈ కేసును టేకప్ చేశారు. వెంటనే టెస్టులు చేయాలని సూచించారు. రిపోర్ట్స్ చూసి ఆ డాక్టర్ స్టన్ అయ్యారు. యువతి కడుపులో ఏకంగా 7 సెం.మీ పొడవైన పిన్ ఉండటం గుర్తించారు. వారం క్రితం పొరపాటున యువతి ఆ పిన్ మింగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఎక్స్-రే ద్వారా కడుపు దిగువ భాగం అయిన “అంట్రం” లో ఆ పిన్ ఇరుక్కుపోయినట్లు తేలింది.
పిన్ తల భాగం.. అంట్రంలో ఇరుక్కుపోవడం వల్ల.. ఈ కేసు చాలా క్రిటకల్‌గా మారిందని డాక్టర్ అమిత్ అగర్వాల్ చెప్పారు. తొలగించే ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోకపోతే అది కడుపు గోడ లేదా ఎసోఫాగస్ (ఆహార నాళం) కి గాయాలు కలిగించే ప్రమాదం ఉందన్నారు. ఎట్టకేలకు ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించి, అత్యంత జాగ్రత్తగా ఆ పిన్‌ను కడుపులో నుంచి తొలగించారు. ఈ శస్త్రచికిత్సకు సుమారు 90 నిమిషాలు పట్టింది. ఇతర ఆర్గాన్స్‌కు ఎలాంటి గాయాలు కాకుండా పిన్‌ను రిమూవ్ చేసినట్లు వివరించారు. ఆపరేషన్ తర్వాత బాధితురాలి పరిస్థితి స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆమె లిక్విడ్ ఫుడ్ తీసుకుంటోంది. రాబోయే రెండు రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ కేసు గురించి డాక్టర్ అగర్వాల్ మాట్లాడుతూ “సాధారణంగా మేము పిల్లలు మింగిన నాణేలు లేదా బ్యాటరీలు వంటి వస్తువులను తీస్తుంటాం. అవి ఎక్కువగా ఆహారనాళం లేదా కడుపు పైభాగంలో ఉంటాయి. కానీ కడుపు దిగువ భాగంలో ఏడు రోజుల పాటు ఇంత పొడవైన పిన్ ఉండడం చాలా అరుదు” అని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..