AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ తొలి ఫొటానిక్‌ రాడార్‌ సిద్ధం.. ఇక స్టెల్త్‌ విమానాలూ చిటికెలో దొరికిపోతాయ్‌!

తొలిసారిగా ఫొటానిక్‌ రాడార్‌ను భారత్ రూపొందించింది. తద్వారా.. అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది. రాడార్లను ఏమార్చే స్టెల్త్‌ యుద్ధవిమానాలనూ ఇది ఇట్టే పసిగడుతుంది. శత్రువుల ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ తంత్రాలకు ఇది లొంగదు. బెంగళూరులో డీఆర్‌డీవోకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ రాడార్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ల్యాబ్‌ దీన్ని

భారత్ తొలి ఫొటానిక్‌ రాడార్‌ సిద్ధం.. ఇక స్టెల్త్‌ విమానాలూ చిటికెలో దొరికిపోతాయ్‌!
Photonic Radar
Srilakshmi C
|

Updated on: Jul 08, 2025 | 7:39 AM

Share

రక్షణ పరిజ్ఞానంలో భారత్‌ కీలక మైలురాయిని సాధించింది. శత్రువుల గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా, విస్పష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని సమకూర్చుకుంది. తొలిసారిగా ఫొటానిక్‌ రాడార్‌ను రూపొందించింది. తద్వారా.. అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది. రాడార్లను ఏమార్చే స్టెల్త్‌ యుద్ధవిమానాలనూ ఇది ఇట్టే పసిగడుతుంది. శత్రువుల ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ తంత్రాలకు ఇది లొంగదు. బెంగళూరులో డీఆర్‌డీవోకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ రాడార్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ల్యాబ్‌ దీన్ని అభివృద్ధి చేసింది.

సంప్రదాయానికి భిన్నం

ప్రస్తుతం ఉపయోగిస్తున్న సైనిక రాడార్‌ వ్యవస్థలను 1940లలో అభివృద్ధి చేశారు. అవి రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్‌ఎఫ్‌) తరంగాల సాయంతో నింగిలోని లక్ష్యాలను గుర్తించడంతోపాటు ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత వేగంతో పయనిస్తున్నాయి.. వంటి వివరాలను సేకరిస్తాయి. వీటితో తక్కువ ఎత్తులో, తక్కువ వేగంతో ఎగిరే యుద్ధవిమానాలు, డ్రోన్లు, రాడార్లను ఏమార్చే స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌లను గుర్తించడం కష్టం. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఫొటానిక్‌ రాడార్‌ పరిజ్ఞానం తెరపైకి వచ్చింది. ఇది ఆర్‌ఎఫ్‌ తరంగాలకు బదులు ఫొటానిక్స్‌ను ఉపయోగిస్తుంది. అంటే కాంతి తరంగాలన్నమాట!

ఇది ప్రధానంగా కాంతిని రాడార్‌ తరంగాలుగా మారుస్తుంది. ఈ వ్యవస్థలో ప్రధానంగా లేజర్లు, ఆప్టికల్‌ ఫైబర్లను వినియోగిస్తారు. దీనివల్ల రాడార్‌ వేగవంతమైన, మరింత కచ్చితమైన పనితీరును కనబరుస్తుంది. సంప్రదాయ ఆర్‌ఎఫ్‌ రాడార్లకు బ్యాండ్‌విడ్త్‌ పరిమితులు ఉంటాయి. ఫొటానిక్‌ రాడార్లు స్పెక్ట్రమ్‌లోని అనేక తరంగ దైర్ఘ్యాల్లో పనిచేస్తాయి. అందువల్ల వాటికి విస్తృత బ్యాండ్‌విడ్త్‌ ఉంటుంది. అమెరికా, చైనా, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు ఫొటానిక్‌ ఆధారిత వ్యవస్థలపై విస్తృతంగా దృష్టిపెట్టాయి.

ఎన్నో ప్రయోజనాలు

అత్యంత ఎక్కువ స్పష్టతతో బహుళ లక్ష్యాలను ఏకకాలంలో త్రీడీలో పరిశీలించడానికి ఫొటానిక్‌ రాడార్లు వీలు కల్పిస్తాయి. వేగం, కచ్చితత్వం విషయంలో వీటికి తిరుగులేదు. సంప్రదాయ రాడార్లు గుర్తించలేని స్టెల్త్‌ యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్షిపణులను ఇవి పసిగట్టగలవు. ప్రత్యర్థులపై దాడులతోపాటు నిఘాకూ ఇవి ఉపయోగపడతాయి. రాడార్లను స్తంభింపచేయడానికి శత్రు దళాలు జామింగ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ కౌంటర్‌ మెజర్స్‌ను ప్రయోగిస్తుంటాయి. ఈ విధానాలేవీ ఫొటానిక్‌ రాడార్ల ముందు పనిచేయవు. ఫొటానిక్‌ రాడార్లు తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల సమర్థంగా పనిచేస్తాయి. ఈ రాడార్‌ ప్రధాన బలం.. ఫొటానిక్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు. ఇవి సంకేతాలను వేగంగా విశ్లేషిస్తాయి. ఈ క్రమంలో ఆ సంకేతానికి తక్కువగా నష్టం వాటిల్లుతుంది.

త్వరలో విస్తృత పరీక్షలు

ఫొటానిక్‌ రాడార్‌ పనితీరును విశ్లేషించడానికి డీఆర్‌డీవో ఈ ఏడాది చివరి నుంచి విస్తృతంగా పరీక్షలు నిర్వహించనుంది. పర్వత, తీర ప్రాంతాల్లోనూ ఇవి సాగనున్నాయి. ప్రస్తుతం భారత్‌వద్ద ఉన్న ఆకాశ్‌తీర్‌ వంటి గగనతల రక్షణ వ్యవస్థలతో ఈ రాడార్‌ అనుసంధానానికీ చర్యలు చేపట్టనున్నారు. దేశంలోని అగ్రశ్రేణి యుద్ధవిమానాలైన సుఖోయ్‌-30ఎంకేఐ, రఫేల్, తేజస్‌లలో దీన్ని అమర్చే వీలుంది. ఫొటానిక్‌ రాడార్‌ చిన్నగా ఉండటంతో సంచార వేదికలపైనా దాన్ని అమర్చడానికి వీలవుతుంది. అందువల్ల పాకిస్థాన్, చైనా సరిహద్దుల వెంబడి సులువుగా మోహరించొచ్చు.

చైనా, పాక్‌కు చిక్కులే!

స్టెల్త్‌ యుద్ధవిమానాలు, డ్రోన్‌ పరిజ్ఞానంపై చైనా, పాకిస్థాన్‌లు భారీగా పెట్టుబడి పెట్టాయి. చైనాకు చెందిన జె-20 స్టెల్త్‌ యుద్ధవిమానాలు, పాక్‌కు చెందిన డ్రోన్లు సాధారణ రాడార్లను ఏమార్చడంపై ప్రధానంగా దృష్టిపెడుతున్నాయి. ఈ వ్యూహాలను ఫొటానిక్‌ రాడార్లతో అడ్డుకోవచ్చు. శత్రువుల వైమానిక, క్షిపణి దాడుల గురించి ముందే సమాచారం ఇచ్చే గగనతల హెచ్చరిక వ్యవస్థల్లో ఈ రాడార్లను అమర్చవచ్చు. అందువల్ల ముప్పును త్వరగా గుర్తించొచ్చు. హైపర్‌సోనిక్‌ అస్త్రాలనూ పసిగట్టొచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.