అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడమంటే ఇదే.. భారతీయులు వెళ్తున్న బస్సుపై బంగ్లాదేశ్‌లో దాడి.. ఈశాన్య రాష్ట్రం రిటర్న్ గిఫ్ట్ ఏమిటంటే..
బంగ్లాదేశ్‌లో హసీనా గద్దె దిగి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాతా హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందువు నేతల అరెస్ట్ పర్వం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో మన దేశంలో బంగ్లా హిందువులకు అండగా తమ గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో బంగ్లదేశీయులకు చికిత్స నిలిపివేసినట్లు ప్రకటించగా.. తాజాగా ఈశాన్య భారతంలోని ఓ చిన్న రాష్ట్రము కూడా బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన జరుగుతున్న అకృత్యాల లెక్క తేల్చడంలో బిజీగా ఉంది.
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత హిందువులపై మారణహోమం జరుగుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగిన తరువాత.. బంగ్లాదేశ్‌లో హిందువులను క్రూరంగా అణిచివేస్తున్నారు. మైనారిటీ హిందూ సమాజంపై పెద్ద ఎత్తున దోపిడీలు, విధ్వంసాలు జరుగుతున్నాయి. హిందూ సంస్థలు, ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మన దేశంలో ఇస్కాన్ సంస్థతో పాటు పలువురు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసపై తమ నిరసన గళం విప్పుతున్నారు. తాజాగా మన దేశంలోని ఓ చిన్న రాష్ట్రం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అకృత్యాలకు సంబంధించి ఓ పెద్ద అడుగు వేసింది. ఇది ప్రస్తుతం ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు కొంచెం కష్టతరమే అని అంటున్నారు. ఈశాన్య రాష్ట్రము త్రిపుర సంచలన నిర్ణయం తీసుకుంది.
నిజానికి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అకృత్యాల లెక్క తేల్చడంలో త్రిపుర బిజీగా ఉంది. 135 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని బంగ్లాదేశ్‌ను త్రిపుర కోరింది. అంతేకాదు త్రిపుర ఆసుపత్రి కూడా బంగ్లాదేశ్ కు చెందినా రోగులకు చికిత్సను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పొరుగు దేశంలో హిందువులపై జరిగిన అఘాయిత్యాలు, బంగ్లాదేశ్‌లో భారతీయుల బస్సుపై దాడి తర్వాత త్రిపుర ఈ నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్ తక్షణమే రూ.135 కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్
బంగ్లాదేశ్ రూ.135 కోట్లు బకాయి పడిందని త్రిపుర విద్యుత్ శాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ ఆదివారం తెలిపారు. డొమెస్టిక్ కనెక్షన్ల ద్వారా ఇచ్చే విద్యుత్ తో పోల్చితే ఒక్కో యూనిట్ కరెంటుకు రూ.6.65 వసూలు చేస్తున్నామని అయితే ఇప్పటి వరకూ ఉన్న విద్యుత్ బకాయిలను తక్షణమే చెల్లించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాదు త్రిపుర రాజధాని అగర్తలలోని ILS హాస్పిటల్ లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోగులకు చికిత్స చేయమని ప్రకటించింది.
అగర్తల ఐఎల్‌ఎస్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌతమ్ హజారికా మాట్లాడుతూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోగులకు చికిత్స చేయకూడదనే డిమాండ్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. బంగ్లా దేశాలోని రోగుల కోసం తెరచి ఉండే అఖౌరా చెక్ పోస్ట్ తో పాటు.. ILS ఆసుపత్రుల వద్ద తమ హెల్ప్ డెస్క్‌లు ఈ రోజు నుంచి మూసివేస్తున్నామని వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రజలు భారత దేశ త్రివర్ణ పతాకాన్ని అవమానించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు హింసకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే కోల్‌కతాలోని జేఎన్ రాయ్ హాస్పిటల్ కూడా బంగ్లాదేశ్ రోగులకు చికిత్స నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా అదే బాటలో త్రిపురలోని ఐఎల్‌ఎస్ హాస్పిటల్ కూడా నడుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
త్రిపుర మూడు వైపులా బంగ్లాదేశ్ సరిహద్దు
బంగ్లాదేశ్ అంశంపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో పరిస్థితి బాగా లేదని అన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు హింసకు గురవుతున్నారు. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు జైల్లో ఉన్న ఉగ్రవాదులు ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చారని అన్నారు. త్రిపుర బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకున్నందున ఇది ఆందోళన కలిగించే విషయం. భారత ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలియదా? త్రిపుర మూడు వైపులా బంగ్లాదేశ్‌తో చుట్టుముట్టింది, అందుకే నిఘా కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్‌ను తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధ సమయంలో భారతదేశం, ముఖ్యంగా త్రిపుర అందించిన సహకారాన్ని వారు మరచిపోకూడదని.. ఇటువంటి చర్యలు అన్ని నిబంధనలను, చారిత్రక బంధాలను ఉల్లంఘిస్తాయని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో భారతీయ బస్సుపై దాడి
బంగ్లాదేశ్‌లోని బ్రాహ్మణబారియా జిల్లాలో అగర్తల నుంచి కోల్‌కతా వెళ్తున్న బస్సుపై దాడి జరిగిందని త్రిపుర రవాణా శాఖ మంత్రి సుశాంత్ చౌదరి ఆరోపించారు. బ్రాహ్మణబారియా జిల్లాలోని విశ్వ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 17 మంది భారతీయులు, 11 మంది బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారు. ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు తన లేన్‌లో కదులుతున్న సమయంలో ఒక ట్రక్కు ఉద్దేశపూర్వకంగా బస్సుని ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సు ఎదురుగా ఆటోరిక్షా రావడంతో బస్సు-ఆటోరిక్షా ఢీకొన్నాయి.
ఈ ఘటన తర్వాత స్థానికులు బస్సులో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణికులను బెదిరించడం ప్రారంభించారు. వారు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతీయ ప్రయాణీకులతో దురుసుగా ప్రవర్తించారు. చంపేస్తామని బెదిరించారని.. రవాణా మంత్రి సుశాంత్ చౌదరి వెల్లడించారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని.. భారతీయ ప్రయాణీకుల భద్రతను నిర్ధారించాలని పొరుగు దేశ ప్రభుత్వాని కోరుతున్నట్లు చెప్పారు. కోల్‌కతా.. అగర్తల మధ్య బస్సులు ఢాకా మీదుగా నడపబడతాయి.. ఇలా ప్రయాణించడం వలన ఈ రెండు రాష్ట్రాల ప్రయాణ దూరం సగానికి పైగా తగ్గుతుంది. అంతేకాదు ఇలా బస్సులో ప్రయాణించడం విమాన ప్రయాణం కంటే చౌకగా ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..