AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడాబాబులపై బ్యాంకుల కరుణ.. విలువెంతో తెలిస్తే షాక్

అత్యంత క్లిష్టపరిస్థితుల్లో బ్యాంకుల్లో అప్పులు చేసే సాధారణ పౌరులు, మధ్యతరగతి జీవుల నుంచి ముక్కు పిండి మరి వడ్డీతో సహా రుణాలు వసూలు చేసే బ్యాంకులు.. ఉద్దేశ పూర్వకంగా అప్పులుచేసి ఆ తర్వాత బిచాణా ఎత్తేసే బడాబాబుల మీద మాత్ర కరుణ చూపిస్తున్నాయి. దీనికి తాజాగా వెల్లడైన గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏ దిక్కు లేక రుణం చేసి, బకాయి పడిన మధ్యతరగతి జీవుల ఇళ్లకు నోటీసులు అతికించి పరువు తీసే బ్యాంకర్లు.. వేలాది కోట్ల రుణం […]

బడాబాబులపై బ్యాంకుల కరుణ.. విలువెంతో తెలిస్తే షాక్
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 11, 2019 | 9:02 PM

Share

అత్యంత క్లిష్టపరిస్థితుల్లో బ్యాంకుల్లో అప్పులు చేసే సాధారణ పౌరులు, మధ్యతరగతి జీవుల నుంచి ముక్కు పిండి మరి వడ్డీతో సహా రుణాలు వసూలు చేసే బ్యాంకులు.. ఉద్దేశ పూర్వకంగా అప్పులుచేసి ఆ తర్వాత బిచాణా ఎత్తేసే బడాబాబుల మీద మాత్ర కరుణ చూపిస్తున్నాయి. దీనికి తాజాగా వెల్లడైన గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏ దిక్కు లేక రుణం చేసి, బకాయి పడిన మధ్యతరగతి జీవుల ఇళ్లకు నోటీసులు అతికించి పరువు తీసే బ్యాంకర్లు.. వేలాది కోట్ల రుణం తీసుకుని, ఆ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం బిచాణా ఎత్తేసి, ఏకంగా విదేశాలకు చెక్కేసే బడాబాబులపై మాత్రం చేతలుడిగి వుండిపోతున్నాయి. గత మూడేళ్ళలో ఇలా ఎగ్గొట్టిన రుణాల మొత్తం ఎంతో తెలిస్తే షాక్ గురికాక తప్పదు.

రూ.1.76 లక్షల కోట్ల బకాయిల కొట్టివేత

గత మూడేళ్లలో బ్యాంకుల్లోభారీగా బకాయిలను కొట్టివేసి, ఎగవేత దారుల నెత్తిన బ్యాంకులు పాలు పోశాయంటే నమ్మశక్యం కాకపోయినా అది నిజం. గత మూడేళ్లలో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ రూ.1.76 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను రైటాఫ్‌ (ఖాతాల్లోంచి కొట్టివేయడం) చేసింది. ఈ బకాయిలన్నీ రూ.100 కోట్లు లేదా అంతకు పైగా ఎగవేసిన 416 మంది రుణగ్రహీతలవే కావడం గమనార్హం. సగటున ఒక్కొక్కరూ ఎగవేసిన మొత్తం రూ.424 కోట్లు. సమాచార హక్కు చట్టానికి లోబడి ఆర్‌బీఐ నుంచి ఓ ఆంగ్ల చానెల్‌ పొందిన సమాచారం ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల కొట్టివేతలు బాగా పెరిగాయి. 2015-18 మధ్యకాలంలో షెడ్యూలు కమర్షియల్‌ బ్యాంకులు రూ.2.17 లక్షల బకాయిలను కొట్టివేశాయి. పెద్ద నోట్ల రద్దు (2016 నవంబరు 8) తర్వాత రైట్‌ ఆఫ్‌లు శరవేగంగా పెరిగాయి. ప్రభుత్వ బ్యాంకులకు రూ.500 కోట్లకు పైగా ఎగవేసిన వారు 88 మందని, వీరంతా ఎగవేసిన మొత్తం రూ.1.07 లక్షల కోట్లని తెలిసింది. అంటే, సగటున ఒక్కో డిఫాల్టర్‌ ఎగవేసిన మొత్తం రూ.1,220 కోట్లు. ఎస్‌బీఐకి ఈ మార్చి 31 నాటికి 220 మంది రూ.100 కోట్లకు పైగా ఎగవేశారు. వీరు ఎగవేసిన మొత్తం రూ.76,600 కోట్లు. కనీసం రూ.500 కోట్లకు పైగా బకాయిపడ్డ 33 మంది ఎగవేసిన మొత్తం రూ.37,700 కోట్లు.

చిన్నా చితక మొత్తాలను ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు.. రుణాలెగ్గొట్టే పెద్దలపై మాత్రం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. వసూలు చేసేందుకు మొక్కుబడి ప్రయత్నాలు చేసి.. ఆ తర్వాత ఇక వాటిని వసూలు చేయలేమని చేతులెత్తేస్తున్నాయి. ఆ తర్వాత ఆర్బీఐని ఆశ్రయించి.. పెండింగ్ బకాయిలను రైటాఫ్ చేయించుకుని బ్యాంకులను నష్టాల బాట పట్టించి బ్యాంకు అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. బ్యాంకు అధికారుల పనితీరు.. బ్యాంకర్ల తీరు ప్రజాగ్రహానికి గురవడానికి ఇలాంటి గణాంకాలే కారణమన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన తరుణం ఆసన్నమైందని గుర్తు చేస్తున్నారు సామాన్య ప్రజలు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాలైన బ్యాంకులను విలీనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రుణాల ఎగవేతదారులపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.