Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toll Gates: ఇక టోల్ గేట్లు ఉండవు.. వసూళ్లు మాత్రం ఆగవు.. త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ

Satellite-Based Toll Collection System: టోల్ గేట్ల యుగం ముగిసిందా? ఇకపై శాటిలైట్ ఆధారిత టోల్ వసూళ్ల యుగం రానుందా? అంటే అవుననే చెబుతోంది భారత ప్రభుత్వం. మారుతున్న కాలానికి తగ్గట్టే పన్నులు, సుంకాలు, టోల్ వసూళ్లలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఎంతో ఖర్చుతో నిర్మించే జాతీయ రహదారులు, 'ఎక్స్‌ప్రెస్ వే'ల మీద టోల్ గేట్లు ఏర్పాటు చేసి, వాహనదారుల నుంచి టోల్ వసూల్ చేయడం అందరికీ తెలిసిన విషయమే.

Toll Gates: ఇక టోల్ గేట్లు ఉండవు.. వసూళ్లు మాత్రం ఆగవు.. త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ
Satellite-Based Toll Collection System
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 29, 2024 | 6:36 AM

Satellite-Based Toll Collection System: టోల్ గేట్ల యుగం ముగిసిందా? ఇకపై శాటిలైట్ ఆధారిత టోల్ వసూళ్ల యుగం రానుందా? అంటే అవుననే చెబుతోంది భారత ప్రభుత్వం. మారుతున్న కాలానికి తగ్గట్టే పన్నులు, సుంకాలు, టోల్ వసూళ్లలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఎంతో ఖర్చుతో నిర్మించే జాతీయ రహదారులు, ‘ఎక్స్‌ప్రెస్ వే’ల మీద టోల్ గేట్లు ఏర్పాటు చేసి, వాహనదారుల నుంచి టోల్ వసూల్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. ప్రారంభంలో టోల్ గేట్ల వద్ద నగదు రూపేణా చెల్లింపులు జరిగేవి. అయితే ఆ నగదు చెల్లింపుల కారణంగా టోల్ గేట్ల వద్ద వాహనాలు ఎక్కువ సేపు నిలిపి ఉంచాల్సిన పరిస్థితులు తలెత్తేవి. మరోవైపు దొంగలు, దోపిడీ ముఠాలు టోల్ గేట్లను లక్ష్యంగా చేసుకుని వసూలు చేసిన టోల్ సొమ్మును దోచుకుపోయిన ఘటనలు చాలా నమోదయ్యాయి. కాలక్రమంలో క్రెడిట్ / డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. చిల్లర నగదు తిరిగిచ్చే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని కార్డుల ద్వారా చెల్లింపులు నివారించినప్పటికీ, ఇది కూడా వేగవంతమైన చెల్లింపుల విధానంగా నిలబడలేకపోయింది. అయితే కార్డు ద్వారా చెల్లించే సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చేరడంతో దోపిడీ ముఠాల బెడద కొంతమేర తగ్గింది. తాజాగా ప్రస్తుతం అమలవుతున్న ‘ఫాస్టాగ్’ విధానంతో చిల్లర నగదు, వసూలు చేసిన సొమ్ముకు భద్రత వంటి సమస్యలు పూర్తిగా పరిష్కారమవడంతో పాటు వాహనాలు వేగంగా టోల్ గేటు దాటుకుని ముందుకెళ్లేందుకు ఆస్కారం కలిగింది. ఉదాహరణకు ఒక టోల్ గేట్ వద్ద పాత విధానంతో సగటున ఒక వాహనం గేట్ దాటేందుకు 8 నిమిషాల సమయం పడితే, ఫాస్టాగ్ కారణంగా అది 47 సెకన్లకు పరిమితమైంది. ప్రతి వాహనానికి ‘ఫాస్ట్ ట్యాగ్’ తప్పనిసరి చేయడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం కొనసాగుతోంది.

అయితే టోల్ విధానంలో ప్రయాణించిన దూరానికి తగ్గట్టు సమంగా చెల్లింపులు జరగడం లేదు. టోల్ గేట్ దాటిన వెంటనే గమ్యం చేరేవారైనా, మరో టోల్ గేట్ కంటే ముందు గమ్యం చేరినవారైనా ఒకే మొత్తంలో టోల్ చెల్లించాల్సి వస్తోంది. జాతీయ రహదారులపై సగటున ప్రతి 60 కి.మీ దూరానికి ఒక టోల్ గేట్ ఉంటుంది. ప్రతి టోల్ గేట్ వద్ద నిర్ణీత సొమ్ము వసూల్ అవుతుంది. ఒక కారు 61కి.మీ ప్రయాణించినా, 119 కి.మీ ప్రయాణించినా ఒకే మొత్తంలో చెల్లింపులు జరపాల్సిన పరిస్థితి ఈ వ్యవస్థలో ఉంది. ఈ తారతమ్యాలను సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయాణించిన దూరానికి మాత్రమే చెల్లింపులు జరిపేలా సరికొత్తగా శాటిలైట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని చూస్తోంది.

జీపీఎస్ – శాటిలైట్ టోల్

ఈ సరికొత్త విధానాన్ని గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)గా వ్యవహరిస్తారు. త్వరలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ సరికొత్త టోల్ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు – మైసూర్ మధ్య ఉన్న నేషనల్ హైవే-275 తో పాటు హర్యానాలోని పానిపట్ – హిస్సార్ మధ్య ఉన్న నేషనల్ హైవే 709పై ప్రయోగాత్మకంగా అమలు చేసినట్టు వివరించారు. అలాగే ఈ మొత్త టోల్ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అందరికీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించేందుకు జూన్ 25న వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేశామని గడ్కరీ తెలిపారు. అలాగే గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EOI) కోసం జూన్ 7 నుంచే ఆహ్వానాలు స్వీకరించడం ప్రారంభించామని, జులై 22తో డెడ్‌లైన్ ముగిసిందని చెప్పారు. అంటే త్వరలో టోల్ గేట్ల వ్యవస్థ దేశంలో కనుమరుగు కానుంది. ప్రయాణించిన దూరానికి తగిన సొమ్ము వాహనదారుల ఖాతా నుంచి కట్ అవుతుంది.

ఇకపై జాతీయ రహదారులపై ప్రయాణించేవారు టోల్ గేట్ల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు. ఇంకా చెప్పాలంటే అసలు రహదారిపై టోల్ గేట్లే ఉండవు. వాహనం ప్రయాణించిన దూరం మొత్తం శాటిలైట్ జీపీఎస్ వ్యవస్థ లెక్కగడుతుంది. జాతీయ రహదారి నుంచి దిగగానే ఆ మేరకు ఖాతా నుంచి సొమ్ము చెల్లింపులు జరిగిపోతాయి. అయితే ఇదంతా జరగడానికి ప్రతి వాహనానికి సరికొత్త జీపీఎస్ నెంబర్ ప్లేట్లను అమర్చాల్సి ఉంటుంది. రహదారులపై ఏర్పాటు చేసే కెమేరాల్లో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్ (ANPR) వ్యవస్థ ఉంటుంది. వాహనం జాతీయ రహదారిపైకి చేరుకున్న వెంటనే ఈ కెమేరాలు స్కాన్ చేసి శాటిలైట్‌కు సమాచారం పంపిస్తాయి. తద్వారా వాహనం ప్రయాణించిన మొత్తం దూరం శాటిలైట్ – జీపీఎస్ వ్యవస్థ లెక్కించగల్గుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థలో ప్రతి వాహనానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కల్గిన ఫాస్టాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. వాహనం టోల్ గేట్ సమీపించగానే అక్కడున్న RFID రీడర్స్ వాహనంలో ఏర్పాటు చేసిన చిప్ నుంచి సమాచారాన్ని సేకరించి, ఫాస్టాగ్ వ్యాలెట్‌లో నింపిన ప్రీ-పెయిడ్ సొమ్ము నుంచి టోల్ వసూలు చేస్తాయి. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ గేట్ల వద్ద ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితులు లేకపోయాయి. క్షణాల వ్యవధిలోనే వాహనాలు టోల్ గేట్ దాటుకుని వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు అసలు టోల్ గేట్లే అవసరం లేని శాటిలైట్ వ్యవస్థ ద్వారా.. ప్రయాణ సమయం మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రయాణించిన దూరానికి తగ్గ సొమ్ము మాత్రమే చెల్లించే వెసులుబాటు కూడా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..