Uttar Pradesh: పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. మరి ఆ డాక్టర్ ఏం చేశాడో తెలిస్తే ఉరికిచ్చి కొడతారు..!
వైద్యో నారాయణో హరి అని అంటారు. అంటే వైద్యుడు సాక్షాత్తు ఆ నారాయణడుతో సమానంగా భావిస్తారు. ఎందుకంటే దైవం తరువాత ప్రాణాలు కాపాడేవారు వైద్యులు.

వైద్యో నారాయణో హరి అని అంటారు. అంటే వైద్యుడు సాక్షాత్తు ఆ నారాయణడుతో సమానంగా భావిస్తారు. ఎందుకంటే దైవం తరువాత ప్రాణాలు కాపాడేవారు వైద్యులు. అందుకే వారిని దేవంతో కొలుస్తారు. కానీ, ఆ కొందరు మాత్రం ఆ వైద్య వృత్తికి కలంకం తీసుకువస్తున్నారు. తెలిసీ తెలియక, ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పురిటినొప్పులతో సైఫీ నర్సింగ్ హోమ్‌లో చేరిన మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్.. ఆమె కడుపులో టవల్ వదిలేసి కుట్లు వేశారు. అయితే, ఆపరేషన్ అయిన ఐదు రోజులకే మహిళ కడుపులో మరోసారి నొప్పి రావడంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరిశీలించిన వైద్యులు.. ఆస్పత్రిలో చేర్చుకున్నారు. చలి తీవ్రత కారణంగా కడుపు నొప్పి వస్తుందని, ఇది సాధారణమేనంటూ వారికి చెప్పి పంపారు డాక్టర్ మత్లుబ్ నజ్రానా.
ఇంటికి వచ్చిన తరువాత కూడా మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. దాంతో మహిళ భర్త షంషేర్ అలీ ఆమెను అమ్రోహాలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కడుపు నొప్పికి కారణం ఏంటా? అని స్కాన్ చేయగా.. కడుపులో టవల్ ఉండటాన్ని గుర్తించారు వైద్యులు. వెంటనే ఆపరేషన్ చేసి ఆ టవల్‌ను బయటకు తీశారు. ఇప్పుడు ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
కాగా, ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి.. చివరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ సింఘాల్ వరకు వెళ్లింది. మీడియాలోనూ ఈ విషయంపై వార్తలు వచ్చాయి. దాంతో సీరియస్‌గా స్పందించిన సీఎంవో రాజీవ్.. ఘటనపై విచారణకు ఆదేశించారు. నోడల్ అధికారి డాక్టర్ శరద్‌ను విచారణాధికారిగా నియమించారు. విచారణ అనంతరం అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎంవో. అయితే, దీనిపై మహిళ భర్త షంషేర్ అలీ ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు చేయలేదని తెలిపారు రాజీవ్ సింఘాల్. అయినప్పటికీ.. విచారణలో తప్పు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




