AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashwant Varma: జస్టిస్ వర్మ అభిశంసనకు రంగం సిద్ధం..! లోక్ సభ స్పీకర్‌ను కలిసిన హోంమంత్రి అమిత్ షా

లోక్‌సభలో న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అభిశంసనకు రంగం సిద్ధమైంది. ఆయన నివాసంలో దొరికిన అక్రమ నగదు నోట్ల వ్యవహారం కారణంగా 152 మంది ఎంపీలు అభిశంసన నోటీసు సమర్పించారు. బీజేపీ, కాంగ్రెస్, టిడిపి తో సహా అనేక పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.

Yashwant Varma: జస్టిస్ వర్మ అభిశంసనకు రంగం సిద్ధం..! లోక్ సభ స్పీకర్‌ను కలిసిన హోంమంత్రి అమిత్ షా
Yashwant Varma
SN Pasha
|

Updated on: Jul 23, 2025 | 7:56 AM

Share

పార్లమెంట్‌లోజస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రంగం సిద్ధమైంది. తన నివాసంలో దొరికిన అక్రమ నగదు నోట్ల కట్టల వ్యవహారం పై అభిశంసన ప్రక్రియ ప్రారంభం కానుంది. న్యాయమూర్తి దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా 152 మంది లోక్‌సభ ఎంపీలు అభిశంసన నోటీసు సమర్పించారు. ఈ తీర్మానానికి బిజెపి, కాంగ్రెస్, టిడిపి సహా పలు పార్టీలు ఇప్పటికే మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ పై అభిశంసన తీర్మానంపై లోక్ సభలో చర్చ జరిపే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

సోమవారం నాడు స్పీకర్ బిర్లాకు 152 మంది ఎంపీలు సంతకం చేసిన మెమోరాండం సమర్పించిన తర్వాత జస్టిస్ వర్మపై అభిశంసన ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. తన నివాసంలో లెక్కల్లో చూపని నగదు దొరికిన తర్వాత దుష్ప్రవర్తన ఆరోపణలపై హైకోర్టు న్యాయమూర్తి తొలగింపును ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217 , 218 కింద దాఖలు చేయబడిన ఈ తీర్మానానికి బిజెపి, కాంగ్రెస్, టిడిపి, జెడి (యు), సీపీఐ (ఎం) సహా పార్టీలకు అతీతంగా ఎంపీల మద్దతు లభించింది. అభిశంసన తీర్మానం పై సంతకం చేసిన వారిలో ఎంపీలు అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్, పీపీ చౌదరి ఉన్నారు.

రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడం అనేది రాష్ట్రపతి ఆదేశాన్ని అనుసరించి జరగాలి. దానికి ముందు కనీసం 100 మంది లోక్‌సభ లేదా 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేసిన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా వద్దా అని స్పీకర్ లేదా ఛైర్మన్ నిర్ణయిస్తారు. గత వారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. జస్టిస్ వర్మను అభిశంసించే చర్యకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని అన్నారు.

జస్టిస్ వర్మపై అభిశంసన ఎందుకు ?

జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో మార్చి 14న ఆయన నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో జస్టిస్ వర్మ ఇంట్లో లేరు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఆయన నివాసానికి చేరుకుని మంటలను అదుపుచేసే సందర్భంలో డబ్బుల కట్టలు సగం కాలిపోయిన నగదు భారీగా బయటపడింది. ఈ వ్యవహారం తరువాత జస్టిస్ వర్మ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు నేతృత్వంలోని సుప్రీం కోర్టు నియమించిన విచారణ కమిటీ ఈ సంఘటనపై 10 రోజులకు పైగా దర్యాప్తు చేసింది.

ఈ ప్యానెల్ 55 మంది సాక్షులను విచారించి, మార్చి 14న రాత్రి 11.35 గంటలకు అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది. నగదు దొరికిన స్టోర్ రూమ్‌పై జస్టిస్ వర్మ, అతని కుటుంబం రహస్యంగా లేదా క్రియాశీలంగా నియంత్రణ కలిగి ఉన్నారని దాని నివేదిక తేల్చింది. తదుపరి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ వర్మపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సిఫార్సు చేశారు. ఆ తర్వాత న్యాయమూర్తి ప్యానెల్ నివేదికను సవాలు చేస్తూ, మే 8 నాటి సిఫార్సును రద్దు చేయాలని కోరుతూ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి