Unlock: కరోనా మూడో వేవ్ ముప్పు గమనిస్తూ.. లాక్ డౌన్ ఎత్తివేత విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి ఐసీఎంఆర్
Unlock: కరోనా మూడో వేవ్ ముప్పును జాగ్రత్తగా అంచానా వేయాలి. లాక్ డౌన్ ఎత్తివేత విషయంలో అత్యంత జాగురూకతతో వ్యవహరించాలి అని ఐసీఎంఆర్ సూచిస్తోంది.
Unlock: కరోనా మూడో వేవ్ ముప్పును జాగ్రత్తగా అంచానా వేయాలి. లాక్ డౌన్ ఎత్తివేత విషయంలో అత్యంత జాగురూకతతో వ్యవహరించాలి అని ఐసీఎంఆర్ సూచిస్తోంది. మూడోవేవ్ ముంచుకొచ్చే అవకాశం ఉన్నందున వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ప్రభుత్వాలకు ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ చెబుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేతకోసం ఆయన మూడు అంశాలతో కూడిన ప్రణాళిక పాటించవచ్చని సూచించారు. తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక మందికి టీకాలు, కొవిడ్ నిబంధనలతో కూడిన ప్రవర్తన వంటి అంశాలను రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకొని లాక్‌డౌన్ల సడలింపులపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
ప్రతివారం పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువగా ఉండాలి. కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నవర్గాలకు 70శాతం టీకాలు వేయాలి. సామాజిక బాధ్యతగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తుండాలి. ఇలా ఈ మూడు అంశాలు సరిగ్గా ఉన్న ప్రాంతాల్లోనే లాక్ డౌన్ తొలగించవచ్చని చెప్పారు. పరీక్షలను పెంచి.. జిల్లా స్థాయిలో కంటైన్మెంట్‌లను ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ ప్రభావం చూపించాడని అన్నారు. లాక్‌డౌన్‌లను అత్యంత నెమ్మదిగా సడలించాలని అభిప్రాయపడ్డారు. భార్గవ చెప్పిన సలహాలను ఇప్పటి వరకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారిక మార్గదర్శకాల్లో చేర్చలేదు.
జులై మధ్య నాటికి లేదా ఆగస్టు మొదటి వారం నాటికి దేశంలో రోజుకు కోటి మందికి టీకాలు అందించే అవకాశం ఉందని వ్యాక్సినేషన్‌పై బలరామ్ భార్గవ మాట్లాడుతూ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘టీకాలకు కొరత లేదు. ప్రస్తుతం దేశంలో అందరు టీకాలు వేయించుకోవాలనుకుంటున్నారు. దేశం మొత్తానికి ఒక్క నెలలో టీకాలు వేయలేము కదా. మన జనాభా అమెరికా జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కొంత ఓపిక పట్టాలి. జులై మధ్య నాటికి, లేదా ఆగస్టు నాటికి రోజుకు కోటిమందికి టీకాలు వేసే అవకాశం ఉంది’’ అని ఆయన తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న 21.39శాతం పాజిటివిటీ రేటు ప్రస్తుతం 8.3 శాతానికి తగ్గింది. మే31 నాటికి దేశవ్యాప్తంగా 344 జిల్లాల్లో 5శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదువుతోంది. మే మొదటి వారంలో ఈ స్థాయి పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య 92 మాత్రమే కావడం విశేషం. దేశ వ్యాప్తంగా మే7న నాలుగు లక్షలకుపైగా కేసులు నమోదు కాగా.. బుధవారం వాటి సంఖ్య 1.32 లక్షలకు తగ్గింది.