Haryana CM Khattar: ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన ప్రకటన చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయడం అనేది సహించరానిది అంటూ వ్యాఖ్యానించారు. గుర్గావ్‌లో బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు ప్రార్థనలు చేయడంపై అనేక హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం సరికాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు నిర్వహించడానికి కొన్ని స్థలాలను రిజర్వ్ చేయాలనే జిల్లా యంత్రాంగం నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం చూపుతుందని సీఎం పేర్కొన్నారు.
సీఎం ఖట్టర్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా పలువురు మీడియా ప్రతినిథులు.. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు నిర్వహించడంపై వస్తున్న ఫిర్యాదులపై ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన.. ‘‘బహిరంగ ప్రదేశాలలో(గుర్గావ్) నమాజ్ చేసే పద్ధతిని సహించబోము. అయితే సామరస్యపూర్వకమైన పరిష్కారం కోసం కూర్చిని చర్చిస్తాం. ప్రతీ ఒక్కరూ తమ తమ విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ ఇతరుల హక్కులు ఉల్లంఘించడం సరికాదు. దానిని ఊపేక్షించబోము కూడా.’’ అని ఖట్టర్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో.. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేసేందుకు కొన్ని స్థలాలను కేటాయించాలన్న జిల్లా యంత్రాంగం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంపైనా ఆయన స్పందించారు. ‘‘ఈ సమస్యను పరిష్కరించాలని పోలీసులకు, డిప్యూటీ కమిషనర్‌కు చెప్పాం. ఎవరైనా ఒకే చోట నమాజ్ చేస్తే అభ్యంతరం లేదన్నారు. ప్రార్థనలు చేసేందుకు మత పరమైన ప్రార్థనా స్థలాలు నిర్మించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయడం ద్వారా ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంది. అలాంటి ఘర్షణలను మేం అస్సలు ఉపేక్షించబోము.’’ అని ఖట్టర్ స్పష్టం చేశారు.
కాగా, గుర్గావ్‌లో ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడాన్ని హిందూ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేసుకునే ప్రాంతాలలో ‘భారత్ మాతా కి జై’, ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేస్తు్న్నారు. ఇకపోతే మూడు సంవత్సరాల క్రితం జిల్లా యంత్రాంగం గుర్గావ్ నగరంలో ముస్లింలు శుక్రవారం నాడు నమాజ్ చేయడానికి 37 ప్రత్యేక స్థలాలను కేటాయించింది. దానిపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో మరో వర్గం వారు బహిరంగంగా చేసే ప్రార్థనలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. ఆ నిరసనలు మరింత తీవ్రమవడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also read:
Wonderful Nest: పురుగు పెట్టిన అద్భుతమైన గూడు.. చూస్తే ఔరా అనక మానరు..!
Juice Benefits: ఆరోగ్యం కోసం జ్యూస్ తాగుతున్నారా?.. ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!