ప్రభుత్వ అధికారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించకూడదు.. సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తున్నవారిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషనర్లుగా నియమించరాదని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది.
Supreme Court on SEC : ఎన్నికల కమిషనర్లు నియామకాలపై భారత అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తున్నవారిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషనర్లుగా నియమించరాదని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారికి ఎన్నికల కమిషనర్ బాధ్యతలను అదనంగా అప్పగించడం అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.
ఇటీవల గోవాలో న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తికి రాష్ట్ర ఎన్నికలకమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హృషికేష్‌రాయ్‌లతోకూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగబద్ధమై విధులు నిర్వహిస్తున్నవారు స్వచ్చంధంగా వ్యవహరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి నేతృత్వం వహించే వ్యక్తి స్వతంత్రుడై ఉండాలని పేర్కొంది. దీంతో ప్రభుత్వంలో అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించకూడదని స్పష్టంచేసింది.
గోవాలో న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తికి రాష్ట్ర ఎన్నికలకమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర మున్సిపల్ చట్టం ప్రకారం వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం కారణంగా అక్కడి మున్సిపల్ ఎన్నికలపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన నోటిఫికేషన్‌ను కొట్టేస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్‌చేస్తూ గోవా ప్రభుత్వం దాఖలుచేసిన అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘాలు స్వతంత్రంగా పనిచేయాలన్న రాజ్యాంగ సూత్రాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అనుసరించాలని నిర్దేశించింది.
ఇదీ చదవండిః సెల్ఫీ వీడియో కోసం ట్రై చేసిన యువతి.. ఓ ఆటాడుకున్న పొట్టేలు… నవ్వులు పూయిస్తున్న వీడియో..