AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: ఇక ప్రతీ నగకు ప్రత్యేకమైన ఆరు అంకెల కోడ్‌.. పాత బంగారం ఉన్న వారికి చిక్కులే

మీ ఇంట్లో పాత బంగారం ఉందా? దానికి హాల్‌ మార్కింగ్‌ ఉందా? ఉంటే ఫర్వాలేదు. లేనట్టు అయితే చిక్కుల్లో పడ్డట్టే. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన కారణంగా ఇక పాత బంగారం అమ్మడం కష్టం కావచ్చు. అదే సమయంలో కొత్త నిబంధనల కారణంగా కొనుగోలుదారుకు సంబంధించిన డేటా బట్టబయలయ్యే ప్రమాదం కూడా ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

Gold: ఇక ప్రతీ నగకు ప్రత్యేకమైన ఆరు అంకెల కోడ్‌.. పాత బంగారం ఉన్న వారికి చిక్కులే
Gold
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2023 | 9:23 PM

Share

స్వర్ణాభరణాల విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసిన ప్రభుత్వం తాజాగా ఈ దిశగా మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రతీ బంగారు ఆభరణానికి ఆరంకెల ఆల్ఫా న్యూమరిక్‌ కోడ్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ప్రస్తుతం నాలుగెంకెల కోడ్‌ మాత్రమే అమల్లో ఉంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి నాలుగు అంకెల కోడ్‌ కలిగిన ఆభరణాలు విక్రయించరాదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

వాస్తవానికి బంగారు నగలకు ఆరంకెల HUID నెంబర్‌ జూలై , 1, 2021 నుంచి అమల్లో ఉంది. అయితే ఇన్నాళ్లు ఇది స్వచ్ఛందం. ఇప్పడు ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరిగా మార్చేశారు. పాత ఆభరణాలన్ని క్లియర్‌ చేసుకునేందుకు ఇన్నాళ్లు వెసులుబాటు కల్పించారు. నగల విక్రేతలు చాలా మంది ఇప్పటికే ఆరంకెల కోడ్‌తో కూడిన నగలు కూడా అమ్ముతున్నారు. అయితే నాలుగెంకల కోడ్‌, ఆరంకెల కోడ్‌తో కొంత గందరగోళం చోటుచేసుకుంటోంది.

ఆరంకెల HUID కలిగిన నగలో 3 గుర్తులు ఉంటాయి. ఒకటి BIS లోగో, రెండోది ఆ ఆభరణం స్వచ్ఛత, మూడోది ఆరంకెల ఆల్ఫాన్యూమరిక్‌ కోడ్‌. అంటే అక్షరాలు, అంకెలతో కూడిన కోడ్‌. ఆ కోడ్‌ ఆధారంగా ఆ నగ ఎక్కడ తయారైందో దాని మూలాలు సులభంగా గుర్తించవచ్చు. ఆ నెంబర్‌ ఉపయోగించి వినియోగదారులు BIS యాప్‌ ద్వారా దాని నాణ్యతను సరిపోల్చుకోవచ్చని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 4 అంకెల కోడ్‌లో BIS లోగో, ఆ నగ స్వచ్ఛత, నగల దుకాణదారు, హాల్‌మార్కింగ్‌ సెంటర్‌ లోగో ఉండేవి.

ఇంత వరకు బాగానే ఉంది, కాని పాత బంగారం కలిగిన వారికే చిక్కులు కనిపిస్తున్నాయి. హాల్‌మార్కింగ్‌, 91.6 గుర్తులు లేని పాతకాలం బంగారు నగలు కలిగిన వారికి ఇదంతా పెద్ద ఝంఝాటమే. అమ్ముదామంటే కొనుగోలుదారులు అడ్డుగోలు ధర నిర్ణయించే ప్రమాదం ఉంది. మరో వైపు HUID నెంబర్‌ ద్వారా డేటా ప్రైవసీకి చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. నెంబర్‌ను బట్టి ఎవరు ఆ నగను కొనుగోలు చేశారో ఇట్టే కనిపెట్టవచ్చు. ఇన్నాళ్లు విక్రేత, కొనుగోలుదారు మధ్యన ఉన్న సంబంధాల్లోకి ఇప్పుడు HUID ద్వారా ప్రభుత్వానికి చొరబడే అవకాశం ఉంటుంది. అంటే ఎవరెవరు ఏ నగ కొన్నారు, ఆ బంగారం బరువెంతా, విలువెంతన్న డేటా ప్రభుత్వం కళ్లెదుటే ఉంటుంది. అంటే పన్ను నుంచి తప్పించుకోవడం, ఎగొడతామని చేసే ప్రయత్నాలు భవిష్యత్‌లో ఫలించకపోవచ్చు.

అటు పాత విధానంలో హాల్‌ మార్క్‌ నగలు కొనుగోలు చేసినవారికి కూడా ప్రభుత్వం ఊరట కల్పించింది. గతంలో కొన్న నగలన్ని చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. అదే సమయంలో ఎవరైనా హాల్‌మార్కింగ్‌ అని చెప్పి తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని అమ్మినట్టు అయితే ఆ దుకాణదారుపై రెండు రెట్లు జరిమానా విధించడం జరుగుతుంది. అంటే గతంలో ఎవరైనా నకిలీ బంగారం అమ్మి ఉంటే వాళ్లకు ముందున్నది గడ్డు కాలమే. అదే సమయంలో మీకు పాత బంగారానికి ఆరంకెల HUID కోడ్‌ వేయించుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. మీరు కొనుగోలు చేసిన దుకాణాన్ని సంప్రదించి మీ నగకు సిక్స్‌ డిజిట్‌ కోడ్‌ వేయమని కోరవచ్చు. దానికి కొంత నామినల్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాని ప్రస్తుత పరిమితంగానే హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉండటం వల్ల ఆరంకెల కోడ్‌ వేయించుకోవడడం తొందరగా సాధ్యం కాకపోవచ్చు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో రోజుకూ 3 లక్షల బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని 339 జిల్లాల్లో కనీసం ఒక్క హాల్‌మార్కింగ్‌ కేంద్రమైన ఉంది. హైదరాబాద్‌లాంటి నగరాల్లో దాదాపు పది హాల్‌మార్కింగ్ కేంద్రాలున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..