మీరు నిరుద్యోగులా అయితే ఒకసారి ఇది చూడండి.. ఈ బిజినెస్‌కు భవిష్యత్‌లో మంచి డిమాండ్..
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి భవిష్యత్ ఉంది. ఈవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి భవిష్యత్ ఉంది. ఈవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈవీ పాలసీలను ప్రకటించాయి. ఇందులో భాగంగా ఎన్నో రాయితీలను అందిస్తోంది. మహానగరాల్లో విపరీతంగా కాలుష్యం పెరిగిపోతుండడం పెట్రోల్ ధరలు మండిపోతుండడంతో ప్రజలు కూడా ఈవీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యవత ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసుకొని తద్వారా ఉపాధి పొందవచ్చు.
చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ఎలాంటి లైసెన్స్ పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ కల్పించిన వెసులుబాటుతో ఈవీ ఛార్జింగ్ సేవలను ప్రారంభించవచ్చు. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత బూస్టింగ్ ఇచ్చినట్లవుతుంది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్‌ను ఇల్లు లేదా కార్యాలయంలో ఎలాంటి లైసెన్సు లేకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలనుకునేవారికి ఆ ప్రక్రియలో విద్యుత్ పంపిణీ సంస్థ సహాయపడుతుందని పేర్కొంది. అయితే ఛార్జింగ్ పాయింట్ భద్రత, సాంకేతిక మరియు పనితీరు ప్రభుత్వ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని, అన్ని ప్రోటోకాల్స్‌ను పాటించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ప్రభుత్వం సవరించిన ఈ మార్గదర్శకాలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా విస్తరించడానికి ప్రోత్సహిస్తాయి. చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలని, పంపిణీ సంస్థ కనెక్టివిటీని అందించడానికి కట్టుబడి ఉందని విద్యుత్ సంస్థ గత నెలలో పేర్కొంది. ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, అహ్మదాబాద్‌లతో సహా తొమ్మిది నగరాల్లో ప్రత్యేక ఈవీ పర్యావరణ వ్యవస్థలను రూపొందించడానికి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని సిద్ధం చేస్తోంది. మిగతా అన్ని నగరాల్లో పలు సంస్థలు ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఎన్‌టిపిసి, పవర్ గ్రిడ్ కార్ప్, ఇండియన్ ఆయిల్ కార్ప్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వం ఈ నగరాల్లో పైలట్ ప్రాజెక్టులను ప్రారంభిస్తోంది. ప్రతి మూడు కిలోమీటర్లకు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉంటుంది. ప్రతి 25 కిలోమీటర్ల చొప్పున ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి 11 బిజీ రహదారులను ప్రభుత్వం గుర్తించింది.