AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు వాస్తవాలివే..

హిమాలయాల్లో వర్షం పడితే భారత మైదానాలు ఎందుకు మునుగుతున్నాయి..? నేపాల్‌లో ముంచెత్తే వరదలు దిగువనున్న బీహార్, ఉత్తరప్రదేశ్‌లను ఎందుకు అతలాకుతలం చేస్తున్నాయి? నేపాల్ గేట్లు ఎత్తింది అనే సాధారణ ప్రచారం వెనుక దాగున్న అసలు పర్యావరణ, భౌగోళిక వాస్తవాలేంటి? నిపుణులు ఏమంటున్నారు..? అనేది తెలుసుకుందాం.

నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు వాస్తవాలివే..
The Science Behind Nepal Flood Risk To India
Krishna S
|

Updated on: Sep 03, 2026 | 11:04 AM

Share

నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. దిగువన ఉన్న భారత్‌కు అవి పెను ముప్పుగా మారుతున్నాయి. హిమాలయాల్లో పుట్టే నదులను ఇరు దేశాలు పంచుకుంటున్న నేపథ్యంలో నేపాల్‌లో వచ్చే వరద భారత్‌లో విపత్తుగా మారడానికి గల కారణాలు, దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలపై పర్యావరణ, హైడ్రాలజీ నిపుణులు సమగ్ర విశ్లేషణను అందించారు. నేపాల్‌లో దాదాపు 6వేలకు పైగా నదులు, వాగులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం దక్షిణ ముఖంగా భారత్‌లోని గంగా నది పరివాహక ప్రాంతంలో కలుస్తాయి. తూర్పున కోసి, మధ్యలో గండక్, పశ్చిమాన కర్నాలి, సరిహద్దుల్లోని మహాకాళి నదులతో పాటు బాగ్మతి, కమల, రాప్తి, బబాయ్ వంటి చిన్న నదులు నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవహిస్తున్నాయి.

ఎక్కువగా నష్టపోయే రాష్ట్రాలు

భారత్‌లో వరద ముప్పు అత్యధికంగా ఉన్న రాష్ట్రం బీహార్. ఉత్తర బీహార్‌లో దాదాపు 75 శాతం భూభాగం వరద ముప్పు పరిధిలోనే ఉంది. ముఖ్యంగా బీహార్ దుఃఖదాయినిగా పిలిచే కోసి నదితో పాటు గండక్, బాగ్మతి నదులు ఇక్కడ తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తాయి. తూర్పు యూపీలోని గోరఖ్‌పూర్, బహ్రైచ్, లఖింపూర్ ఖేరీ, శ్రావస్తి వంటి జిల్లాలు ఘాఘ్రా, రాప్తి నదుల వల్ల నిరంతరం ముంపునకు గురవుతాయి. అంతేకాకుండా ఉత్తరాఖండ్ (మహాకాళి-శారద), ఉత్తర బెంగాల్ (మేచి, మహానంద) ప్రాంతాలు సైతం ముంపునకు ప్రభావితమవుతున్నాయి.

నీటి ప్రవాహం మాత్రమే కాదు.. సమస్య ఎక్కడ వస్తోంది?

నేపాల్‌లో కురిసే వర్షం భారత్‌లో వరద విపత్తుగా మారడం వెనుక మూడు ప్రధాన దశలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ఎత్తైన హిమాలయాల కంటే శివాలిక్, చూరే, తెరాయ్ వంటి తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాల్లో కురిసే కుండపోత వర్షాలు ఎక్కువ ఉధృతిని కలిగిస్తాయి. పర్వతాల నుంచి మైదాన ప్రాంతంలోకి వచ్చే క్రమంలో నదులు విపరీతమైన మట్టి, రాళ్లు, వ్యర్థాలను తీసుకొస్తాయి. మైదానాల్లోకి రాగానే ఈ వ్యర్థాలు మేటవేసి నదీ ప్రవాహ మార్గాన్ని మారుస్తాయి. గంగా నదిలో నీటి మట్టం, భారత్ వైపు కురిసే వర్షపాతం, నదీ పరీవాహక ప్రాంతాల్లో నిర్మించిన రోడ్లు, రైల్వేలు, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు వరద తీవ్రతను రెట్టింపు చేస్తాయి. ‘‘సరిహద్దు వద్దకు వచ్చే గరిష్ట నీటి ప్రవాహాన్ని నేపాల్ వర్షపాతం నిర్ణయిస్తే.. అది భారత్‌లోకి వచ్చాక ఎంతటి విపత్తుగా మారుతుందనేది భారత్ వైపు ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’’ అని ఐసీఐఎంఓడీ శాశ్వత సన్యాల్ తెలిపారు.

కోసి విపత్తు..

దీనికి 2008 నాటి కోసి విపత్తు స్పష్టమైన ఉదాహరణ. ఆ సమయంలో నదిలో నీటి ప్రవాహం సాధారణ సామర్థ్యంలో పదో వంతు మాత్రమే ఉన్నప్పటికీ సరైన నిర్వహణ లేక నేపాల్ భూభాగంలోని కట్ట తెగిపోవడంతో బీహార్‌లో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. అది నీటి ఉధృతి వల్ల వచ్చిన విపత్తు కాదు, నిర్మాణ నిర్వహణ లోపం వల్ల సంభవించిన ప్రమాదం.

నేపాల్ నీటిని వదిలేయలేదు..

భారత్‌లో వరదలు రాగానే నేపాల్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేసిందనే భావన చాలామందిలో ఉంది. కానీ శాస్త్రవేత్తలు దీన్ని ఒక పెద్ద అపోహగా కొట్టిపారేస్తున్నారు. నేపాల్‌లో భారీ నిల్వ జలాశయాలు దాదాపు లేవు.కోసి, గండక్ బ్యారేజీల నిర్వహణ బాధ్యత భారత్ చేతుల్లోనే ఉంది. వర్షం తీవ్రత ఎక్కువైనప్పుడు నదులు సహజసిద్ధంగా దిగువకు ప్రవహిస్తాయి తప్ప, నేపాల్ కావాలని నీటిని నిల్వ ఉంచి విడుదల చేయడం అసాధ్యం.

ముందస్తు హెచ్చరికలు – ఉన్న సవాళ్లు

సాధారణ రుతుపవన వరదలకు సంబంధించి భారత్‌కు 12 గంటల నుంచి 2 రోజుల వరకు సమయం లభిస్తుంది. పర్వత ప్రాంతాల నుంచి బీహార్ మైదానాలకు నీరు చేరడానికి కోసి, గండక్ నదుల ద్వారా దాదాపు ఒక రోజు పడుతుంది. అయితే క్లౌడ్ బరస్ట్‌లు, విస్ఫోటనాలు లేదా కొండచరియలు విరిగిపడి ఏర్పడే ఫ్లాష్ ఫ్లడ్స్ కేవలం కొద్ది గంటల్లోనే దూసుకొస్తాయి. ఇరు దేశాల మధ్య రియల్ టైమ్ డేటా మార్పిడి జరుగుతున్నప్పటికీ, వేగంగా ప్రవహించే నదీ ప్రాంతాల్లో మానిటరింగ్ స్టేషన్ల కొరత, సమగ్ర సమాచార లోపం ఇప్పటికీ ప్రధాన సవాలుగా ఉన్నాయి.

భారత్‌ను భయపెడుతున్న హిమాలయాల ముప్పు

ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ రాజీవ్ సిన్హా ప్రకారం.. కేవలం సాధారణ వరదల కంటే హిమాలయాల్లో చోటుచేసుకుంటున్న భౌగోళిక మార్పులే అసలైన ప్రమాదం.

శకలాల ప్రవాహం: ఇది సాధారణ నీటి వరద కాదు. నీరు, మంచు, కొండచరియలు, భారీ రాతి వ్యర్థాలు కలిసి ఒక చిక్కని బురద ప్రవాహంగా మారి మార్గంలోని సర్వస్వాన్నీ ధ్వంసం చేస్తాయి. 2021 ఉత్తరాఖండ్ చమోలి దుర్ఘటన, 2025 ధరాలీ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. ప్రస్తుత నేపాల్ వరదలు వీటన్నింటి కంటే 5 నుంచి 10 రెట్లు తీవ్రమైనవిగా భావిస్తున్నారు.

వాతావరణ మార్పుల ప్రభావం: గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. క్లౌడ్ బరస్ట్‌లు, గ్లేసియల్ సరస్సులు బద్దలవడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయి. నదీ గర్భాల్లో మేటవేస్తున్న మట్టి కారణంగా నదుల ప్రవాహ సామర్థ్యం తగ్గిపోతోంది.

పరిష్కారం ఏంటి?

వరదలకు ఒకరినొకరు నిందించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎగువన నేపాల్, దిగువన భారత్ ఉన్న ఈ ఉమ్మడి నదీ వ్యవస్థలో ముప్పును ఎదుర్కోవడానికి సమగ్ర సహకారం తప్పనిసరి.

  • అధునాతన ఉమ్మడి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు
  • హిమానీనద సరస్సుల నిరంతర పర్యవేక్షణ.
  • కట్టల నిర్వహణ, నదీ గర్భాల్లో పూడికతీతపై ఉమ్మడి ప్రణాళిక.
  • హెచ్చరికలను క్షేత్రస్థాయిలోని సాధారణ ప్రజలకు వేగంగా చేరవేసే పటిష్ట సమాచార వ్యవస్థ.

Follow Us