మూసీకి మహర్దశ! రూ.7,345 కోట్లతో పనులు.. టెండర్లు షురూ!
హైదరాబాద్ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. తొలి దశ పనుల కోసం రూ.7,345 కోట్లతో రెండు ప్యాకేజీలకు అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించారు. నదిలో పూడిక తొలగింపు, వరద నియంత్రణ, రిటైనింగ్ వాల్స్, రహదారులు, మురుగునీటి పైప్లైన్లు, రెండు కీలక వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.4,500 కోట్ల వరకు రుణం అందనుండగా, తొలి దశ పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
హైదరాబాద్ నగరానికి కొత్త రూపు తీసుకొచ్చే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. గత కొన్నేళ్లుగా మురికికూపంగా మారిన మూసీ నదిని శుభ్రం చేయడంతో పాటు.. నదికి ఇరువైపులా రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలి దశ పనులకు సంబంధించి మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. రెండు ప్యాకేజీలకు కలిపి అంచనా వ్యయం ఏకంగా 7,345 కోట్ల రూపాయలు. ఇంతకీ ఈ ప్రాజెక్టులో ఏయే పనులు చేపట్టనున్నారు? నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పటిలోగా పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు? డీటెయిల్ గా చూద్దాం. మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం రెండు ప్యాకేజీల కింద పనులు చేపట్టనున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిబంధనల ప్రకారం అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. మొదటి ప్యాకేజీ జోన్-1ఏ కాగా.. రెండో ప్యాకేజీ జోన్-1బీ. ఈ రెండు ప్యాకేజీల అంచనా వ్యయం 7,345.12 కోట్ల రూపాయలు. ఇందులో భూసేకరణ ఖర్చులు లేవు. ఈ పనులను ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ విధానంలో చేపట్టనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు కూడా కాంట్రాక్టు సంస్థే చూసుకోవాలి. మొదటి ప్యాకేజీ కింద హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు సుమారు 7.53 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దీనికి 3,232.01 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. హిమాయత్‌సాగర్ డ్యామ్ భద్రతా నిబంధనల కారణంగా గతంలో ప్రతిపాదించిన దూరాన్ని తగ్గించారు. ఈ ప్రాంతంలో నదిలో పేరుకుపోయిన పూడికను తొలగించడం, నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడం, రిటైనింగ్ వాల్స్ నిర్మించడం వంటి పనులు చేపడతారు. అంతేకాదు.. రహదారులు, వంతెనలు, వరదనీటి కాలువలు, మురుగునీటి పైప్లైన్లు, యుటిలిటీ కారిడార్లు, రబ్బర్ డ్యామ్‌లను ఏర్పాటు చేయనున్నారు. రెండో ప్యాకేజీ కింద ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు సుమారు 11.52 కిలోమీటర్ల మేర పనులు చేపడతారు. ఈ ప్యాకేజీ అంచనా వ్యయం 4,113.11 కోట్ల రూపాయలు. ఇక్కడ కూడా నదీ ప్రక్షాళన, వరద నియంత్రణ, రిటైనింగ్ వాల్స్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ప్రధాన మురుగునీటి పైప్లైన్లు ఏర్పాటు చేస్తారు. ఈ రెండు ప్యాకేజీలను కలిపితే సుమారు 19.05 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు జరగనున్నాయి. గతంలో తొలి దశలో 21 కిలోమీటర్ల లక్ష్యాన్ని ప్రకటించినప్పటికీ.. తాజా టెండర్లలో చేర్చిన పరిధి కొంత తగ్గింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు కీలక బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రనగర్ టోల్ ప్లాజా సమీపంలో ఒక ఐకానిక్ బ్రిడ్జిని నిర్మిస్తారు. మరోవైపు నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఓఆర్ఆర్ ప్రాంతంలో కేబుల్-స్టేయిడ్ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న లోలెవల్ వంతెనను తొలగించి కొత్త వంతెనను నిర్మించే ప్రణాళిక ఉంది. ఈ వంతెనలు నదిపై రాకపోకలను మెరుగుపరచడంతో పాటు.. వరదల సమయంలో రవాణాకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడంలో కీలకంగా మారనున్నాయి. మొత్తం 55 కిలోమీటర్ల మేర విస్తరించనున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 4,500 కోట్ల రూపాయల వరకు రుణం అందనుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. తొలి దశ పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, భూసేకరణ, పునరావాసం వంటి అంశాలు కూడా ఈ ప్రాజెక్టు అమలులో కీలకంగా ఉండనున్నాయి. ముఖ్యంగా రాజేంద్రనగర్ పరిధిలో భూసేకరణ, పరిహారం అంశాలపై స్థానికుల అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో.. వాటిని ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టెండర్ల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15 నుంచి టెండర్ పత్రాలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 29న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నారు. నవంబర్ 26 సాయంత్రం 5 గంటలలోపు సంస్థలు తమ బిడ్లను దాఖలు చేయాలి. నవంబర్ 27న సాంకేతిక బిడ్లను తెరవనున్నారు. సాంకేతిక, ఆర్థిక అర్హతలను పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన సంస్థను ఎంపిక చేస్తారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పూర్తయితే నదిని శుభ్రం చేయడంతో పాటు వరద నిర్వహణ, మురుగునీటి వ్యవస్థ, రహదారులు, వంతెనల అభివృద్ధికి అవకాశం ఉంటుంది. నదికి ఇరువైపులా మెరుగైన మౌలిక సదుపాయాలు, అందమైన రివర్‌ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే, ప్రాజెక్టు విజయవంతం కావాలంటే పర్యావరణ పరిరక్షణ, భూసేకరణ, స్థానికుల సమస్యల పరిష్కారం, నిధుల సమర్థ వినియోగం కూడా అంతే ముఖ్యం. మరి టెండర్ల నుంచి నిర్మాణం వరకు పనులు ఎంత వేగంగా సాగుతాయి? మూసీ నిజంగానే హైదరాబాద్‌కు కొత్త ఆకర్షణగా మారుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేతి వాచ్‌లోనూ రామమందిరం, శ్రీరాముడి చిత్రాలు.. ధర తెలిస్తే ఫ్యూజుల్ అవుట్
సిరులు కురిపిస్తున్న వక్క తోటలు.. చిగురిస్తున్న రైతుల ఆశలు!
LIC: ఎల్ఐసీ నుంచి అదిరిపోయే కొత్త పాలసీలు..
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
