క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేసి క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఎలా వస్తుంది..? ఇది తెలుసుకోకపోతే నష్టపోతారు..
ప్రస్తుతం క్రెడిట్ కార్డులు ఉపయోగించేవారు ఎక్కువమంది ఉన్నారు. వీటి ద్వారా ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఒక్కొసారి షాపింగ్ చేశాక ఆర్డర్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో క్రెడిట్ కార్డులకు రీఫండ్ ఎలా వస్తుందనేది ఇందులో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు అనేది చాలామంది ప్రస్తుత రోజుల్లో వాడుతున్నారు. ఎవరి చేతుల్లో చూసినా ఏదొక బ్యాంక్ క్రెడిట్ కార్డు కనిపిస్తుంది. ఒకప్పుడు ఉద్యోగస్తులు, వ్యాపారులు మాత్రమే కార్డు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు విద్యార్థులతో పాటు సామాన్యులు కూడా వినియోగిస్తున్నారు. క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ అనేక ఆఫర్లను అందుబాటులో ఉంచుతాయి. దీంతో ఈ ఆఫర్ల కోసం చాలామంది క్రెడిట్ కార్డులు తీసుకుంటూ ఉంటారు. అలాగే అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుందనే కారణంతో కూడా ఎక్కువమంది తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా వాడి బిల్లులు కట్టలేక అప్పులపాలవుతూ ఉంటారు. అయితే క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో షాపింగ్ చేసి ఆ తర్వాత క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఎలా వస్తుందనే ప్రశ్నకు సమాధానాలు ఇందులో చూద్దాం.
క్రెడిట్ కార్డు రీఫండ్ ఎలా పనిచేస్తుంది..
ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేసి క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసి ఆ తర్వాత క్యాన్సిల్ చేశారనుకుందాం. ఇలాంటి సమయంలో స్టోర్ పాలసీని బట్టి రీఫండ్ ఉంటుంది. కస్టమర్ ఎంచుకున్న రీఫండ్ పాలసీ ప్రకారం డబ్బులు రీఫండ్ అవుతాయి. అయితే క్రెడిట్ కార్డు రీఫండ్ కోసం ఎక్కువ రోజులు సమయం పడుతుంది. 5 నుంచి 14 రోజుల పాటు సమయం పట్టే అవకాశముంది. క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్ సైకిల్‌ను బట్టి ఉంటుంది. మీ కార్డు సైకిల్ లోపు రీఫండ్ వస్తే క్రెడిట్ కార్డు బిల్లు అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవ్వకపోతే మీరు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అదనపు ఛార్జీలు, ఆలస్య ఫీజులు పడే అవకాశముంటుంది. దీని వల్ల మీకు భారీగా నష్టం జరుగుతూ ఉంటుంది. అయితే చాలామందికి ఈ విషయం గురించి తెలియక వెంటనే రీఫండ్ అవుతుందని అనుకుంటారు. కొన్నిసార్లు వెంటనే రీఫండ్ అవుతుంది. కొన్ని సమయాల్లో ఆలస్యం కావొచ్చు. దీని వల్ల మీరు జాగ్రత్త పడటం మంచిది.
రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోండి..
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ప్రతీఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. రీఫండ్ స్టేటస్ చేక్ చేసుకుంటూ ఉండాలి. 14 రోజుల్లోగా రీఫండ్ అవ్వకపోతే బ్యాంక్ సిబ్బందిని సంప్రదించండి. దీంతో బ్యాంక్ సిబ్బంది మీ సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ నుంచి సమస్య ఉంటే కస్టమర్ కేర్ సిబ్బందిని సంప్రదించి మీ సమస్యను క్లియర్ చేసుకోండి. ఇటీవల ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్‌లలో చాలామంది క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. దీంతో ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
