మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో తెలుసా..?
మహిళలకు రూ. 2 వేలు.. మగవారికి కూడా ఫ్రీ బస్సు.. రాబోయే ఎన్నికల కోసం అన్నాడీఎంకే అదిరిపోయే ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఎం.జి.ఆర్ జయంతి సందర్భంగా చెన్నైలో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ, ఎడప్పాడి పళనిస్వామి కీలక హామీలను గుప్పించారు. ఆర్థిక భరోసా, సొంతింటి కల.. ఇలా ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా రూపొందించిన ఈ ముందస్తు మేనిఫెస్టో తమిళ గడ్డపై రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది..

గత కొన్నేళ్లుగా ఎన్నికలు అనగానే ఫ్రీ బస్ స్కీమ్ ముందు వరుసలో ఉంటుంది. కర్ణాటక మొదలుకొని, తెలంగాణ, ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ అవుతుంది. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలో పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అటు అన్నాడీఎంకే తన దూకుడును పెంచింది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంజీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సంచలన ప్రకటనలు చేశారు. డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరించారు.
ప్రధాన ఎన్నికల హామీలు ఇవే
మహిళలకు నెలకు రూ.2వేలు
సమాజంలో ఆర్థిక సమతుల్యత సాధించడమే లక్ష్యంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలోని మహిళా యజమానికి నెలకు రూ.2,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం ఇస్తున్న రూ.1,000 కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం.
రవాణా రంగంలో విప్లవం
మహిళలకు ప్రస్తుతం ఉన్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే..పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తామని ఎడప్పాడి హామీ ఇచ్చారు.
అమ్మ ఇల్లం పథకం
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి, ఇళ్లను నిర్మించి ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లో స్థలం కేటాయించి, ఆధునిక అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు. షెడ్యూల్డ్ కులాల కుటుంబాల్లోని మహిళలు వివాహం చేసుకున్న సమయంలో వారికి కాంక్రీట్ ఇళ్లను కానుకగా నిర్మించి ఇస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు.
ఉపాధి హామీ పెంపు
గ్రామీణ కూలీల సంక్షేమం కోసం 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని హామీ ఇచ్చారు.
అమ్మ ద్విచక్ర వాహన పథకం
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 5 లక్షల మంది మహిళలకు రూ. 25,000 సబ్సిడీతో ద్విచక్ర వాహనాలను అందజేస్తామని వెల్లడించారు.
త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టో
పార్టీ మేనిఫెస్టో తయారీ బృందం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించిందని, ఈ నివేదికల ఆధారంగా మరిన్ని కీలక ప్రకటనలతో కూడిన పూర్తిస్థాయి మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని పళనిస్వామి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎడప్పాడి మాట్లాడుతూ.. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి పరిపాలనా నైపుణ్యం లేదని విమర్శించారు. డీఎంకే పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నిపుణుల కమిటీలు వేసినా అప్పులు తగ్గలేదు.. ఈ ఐదేళ్ల కాలం ముగిసేసరికి తమిళనాడుపై సుమారు రూ. 5.5 లక్షల కోట్ల అదనపు అప్పు భారం పడింది” అని ఆయన ధ్వజమెత్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
