ఉగ్ర దాడికి కుట్ర, ఢిల్లీలో నలుగురు కాశ్మీరీల అరెస్ట్
ఉగ్రదాడికి కుట్ర పన్నారన్న ఆరోపణపై ఢిల్లీలో నలుగురు కాశ్మీరీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐ టీ ఓ ఏరియాలో..

ఉగ్రదాడికి కుట్ర పన్నారన్న ఆరోపణపై ఢిల్లీలో నలుగురు కాశ్మీరీ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐ టీ ఓ ఏరియాలో అనుమానాస్పదంగా వీరు తిరుగుతుండగా పట్టుకున్నారు. వీరి నుంచి అత్యంత ఆధునిక పిస్టల్స్, 120 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అల్తాఫ్ అహ్మద్ దర్, ముస్తాక్ అహ్మద్ గని, ఇశ్వాక్ మజీద్ కోకా, అకేబ్ సఫీలుగా గుర్తించారు. వీరిలో అల్తాఫ్ అహ్మద్ పుల్వామా జిల్లాకు, ఇతరులు షోపియాన్ జిల్లాకు చెందినవారని పోలీసులు చెప్పారు. ఈ నలుగురిలో ఇశ్వాక్ సామాన్యుడు కాదు. జమ్మూ కాశ్మీర్ లో అల్ ఖైదా అనుబంధ సంస్థ ఘజ్వాత్ ఉల్ హింద్ నేత అయిన బుర్హాన్ కోకా సోదరుడేనట! గతంలో షోపియాన్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో బుర్హాన్ మరణించాడు. గత నెల 27 న ఈ కాశ్మీరీలు ఢిల్లీకి వచ్చారని, కీలక ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు పక్కా ప్లాన్ వేశారని పోలీసులు తెలిపారు.



