Bihar: బిహార్ ఓటర్ లిస్టులో విదేశీయులు… దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఈసీ సన్నాహాలు
ఓటర్ల జాబితాలో ఎవరుంటారు? భారతీయులేగా అనుకుంటున్నారేమో! ఓటర్ల లిస్టులో భారతీయులతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ పౌరులు కూడా ఉన్నారట! బిహార్‌లో ఓటర్ల లిస్టును చూసి కంగు తిన్న ఎన్నికల సంఘం... దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదని డిసైడయింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో ఓటర్ల జాబితాపై సమీక్ష కోసం...

ఓటర్ల జాబితాలో ఎవరుంటారు? భారతీయులేగా అనుకుంటున్నారేమో! ఓటర్ల లిస్టులో భారతీయులతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ పౌరులు కూడా ఉన్నారట! బిహార్‌లో ఓటర్ల లిస్టును చూసి కంగు తిన్న ఎన్నికల సంఘం… దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదని డిసైడయింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో ఓటర్ల జాబితాపై సమీక్ష కోసం ఇంటింటికి వెళ్లారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. ఓటర్ల లిస్టులో బిహారీల సంగతేమో గానీ, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ పౌరులు కూడా పెద్ద సంఖ్యలో దర్శనమిచ్చారట. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్‌ల నేతృత్వంలో…. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ పంచాయతీల్లో బూత్ లెవెల్ అధికారులు నిర్వహించిన సమీక్షలో ఈ నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. దీంతో ఎన్నికల కమిషన్ షాక్ తింది.
బిహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ….ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. దేశంలో స్థిరపడిన బంగ్లాదేశ్, మయన్మార్‌లకు చెందిన అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో వీరంతా ఓటర్లుగా మారడంపై చర్చ మొదలయ్యింది. బిహార్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న విదేశీయులు…ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులను అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు తెలుస్తోంది. సర్వే కోసం వెళ్లే క్షేత్ర స్థాయి అధికారులు ఇలాంటి వారిని అనేక మందిని గుర్తించినట్లు సమాచారం. వీటన్నింటినీ ఆగస్టు 1 నుంచి పరిశీలిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా పరిణామం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో, సీరియస్ నిర్ణయం తీసుకుంది ఈసీ. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సిద్ధమైందని చెబుతున్నారు. అనర్హులు, నకిలీ ఓటర్లతోపాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వేను ఈసీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సర్వేను చివరిసారిగా 20 ఏళ్ల క్రితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్‌ని త్వరలోనే ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈసీ ఈ ప్రక్రియను చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వివాదం దుమారం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రత్యేక సవరణను దేశవ్యాప్తంగా చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.




