Edible oils: వంటనూనెల ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు.. తగ్గనున్న ఆయిల్ రేట్లు..
దేశంలో 2018 తర్వాత ఒక్కసారిగా వంటనూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో అమాంతం భారీగా వంటనూనె ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందిపడేవారు. అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం వంటనూనెల ధరల నియంత్రణపై ప్రత్యే దృష్టి..
దేశంలో 2018 తర్వాత ఒక్కసారిగా వంటనూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో అమాంతం భారీగా వంటనూనె ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందిపడేవారు. అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం వంటనూనెల ధరల నియంత్రణపై ప్రత్యే దృష్టి కేంద్రీకరించింది. దీంతో ధరలు అధికంగా పెరగకుండా నియంత్రణలో పెడుతూ వస్తోంది. తాజాగా వంటనూనెల ధరల నియంత్రణకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంటనూనెల దిగుమతి సుంకంపై కల్పిస్తున్న సబ్సీడీలను మార్చి 2023 వరకు కొనసాగుతాయని కేంద్ర ఆహార శాఖ అక్టోబర్ 2వ తేదీ ఆదివారం ప్రకటించింది. దేశీయంగా సరఫరాను పెంచి ధరల్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఉపశమనాలను మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతూ వస్తున్నాయని, ఫలితంగా దేశీయంగానూ ధరలు నియంత్రణలోకి వస్తున్నాయని కేంద్రప్రభుత్వం తెలిపింది.
సుంకాల రాయితీ కొనసాగించడం ద్వారా భారత్‌లో వంట నూనెల ధరలు ఇటీవల కాలంలో తగ్గాయని పేర్కొంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ముడి, రిఫైన్డ్ పామాయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్స్ పై ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాలు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం ముడి రకాల నూనెలపై సున్నా శాతం దిగుమతి సుంకం ఉంది. అయితే, వ్యవసాయం, సామాజిక సంక్షేమ సెస్సులతో కలిపి మొత్తంగా వీటి దిగుమతిదారులు 5.5 శాతం పన్ను కట్టాల్సి వస్తోంది.
రిఫైన్డ్ పామాయిల్ దిగుమతిపై 13.75 శాతం, రిఫైన్డ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 19.25 శాతం పన్ను విధిస్తున్నారు. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. భారత్ తన అవసరాల్లో 60 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో దేశీయంగానూ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై పడిన భారం తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం పలు దఫాల్లో దిగుమతి సుంకాన్ని తగ్గించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..