Delhi Car Blast: పేలుడుకి ముందు పార్క్ చేసిన కారు ఇదే.. అసలు ఆ 3 గంటల్లో ఏం జరిగిందంటే?
ప్రమాదం జరగడానికి మూడు గంటల ముందు హ్యుందాయ్ i20 తెలుపు రంగు కారు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో పార్క్ చేయబడి ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా తెలుస్తుంది. ఢిల్లీ పోలీసులు ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా ఈ కారు సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు..

ఢిల్లీ, నవంబర్ 11: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలు టీవీ9 చేతికి అందాయి. ప్రమాదం జరగడానికి మూడు గంటల ముందు హ్యుందాయ్ i20 తెలుపు రంగు కారు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో పార్క్ చేయబడి ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా తెలుస్తుంది. ఢిల్లీ పోలీసులు ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా ఈ కారు సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు పార్క్ చేసి ఉన్నట్లు గుర్తించారు. మూడు గంటల తర్వాత 6:48 గంటలకు పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరినట్లు గుర్తించారు. కారు వెళ్లే సమయంలో పార్కింగ్ స్థలం చాలా రద్దీగా ఉంది. ప్రస్తుతం కారులోకి ఎవరు ప్రవేశించారు? ఎవరు పార్క్ చేశారు? దానిని తీసుకెళ్లడానికి ఎవరు వచ్చారో తెలుసుకోవడానికి పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
కారు ఎక్కడ నుంచి వచ్చింది? మొదట ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలం వద్దకు వచ్చిందా? ఆపై పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరి ఎర్రకోటకు ఎదురుగా ఉన్న రెడ్ లైట్ వద్దకు చేరుకుందా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా పార్కింగ్ అటెండెంట్‌ను కూడా పోలీసులు ప్రశ్నిస్తారు.
కారు వివరాలు ఇవే..
తెలుపు రంగులో ఉన్న హ్యుందాయ్ i20 కారు నంబర్ ప్లేట్: HR 26CE 7674. ఇది హర్యానాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కారు మొదట సల్మాన్ (హర్యానా నివాసి) పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఉంది. దానిని నదీమ్‌కు సల్మాన్ విక్రయించాడు. అనంతరం అతడు ఫరీదాబాద్ కార్ డీలర్ కు విక్రయించాడు. తర్వాత తారిక్‌కు చేరుకున్న కారు.. చివరికి ఆత్మహుతి దాడికి పాల్పడ్డ డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఆధీనంలోకి చేరుకుంది. డాక్టర్ ఉమర్ అక్టోబర్ 29న ఐ-20 కారు కొనుగోలు చేశాడు. అదే రోజున కారుకు పొల్యూషన్ పరీక్షలు కూడా చేయించాడు.
సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు హ్యుందాయ్ i20 కారు ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించి 3 గంటలకు పైగా పార్కింగ్ చేసి ఉంది. సాయంత్రం 6:48 గంటలకు కారు పార్కింగ్ నుండి నిష్క్రమించి రద్దీగా ఉండే సుభాష్ మార్గ్ కూడలి వైపు కదిలింది. సాయంత్రం 6:52 గంటలకు నెమ్మదిగా కదులుతున్న కారు రెడ్ లైట్ వద్ద ఆగి ఒక్కసారిగా పేలిపోయింది. సమీపంలోని అనేక వాహనాలను ధ్వంసం చేసి భారీ అగ్నిప్రమాదం సృష్టించింది. సాయంత్రం 6:55 గంటలకు ఢిల్లీ అగ్నిమాపక విభాగానికి కాల్ అందడంతో.. 7 ఫైరింజన్లు, 15 అంబులెన్స్‌లు ఎర్రకోటవైపు పరుగులు తీశాయి. కారు ప్రమాద సమయంలో ముగ్గురు వ్యక్తులు అందులో ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా తెలుస్తుంది. బదర్‌పుర్ టోల్‌ప్లాజా వద్ద కారులో బాంబర్ మాస్క్ ధరించి ఉన్న దృశ్యాలు సైతం పోలీసులకు చిక్కాయి.
