Goa Congress: గోవా కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. BJPలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు.. సీఎల్పీ విలీనంపై అసెంబ్లీ కార్యదర్శికి లేఖ
గోవాలో కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీలో చేరిన వారిలో..
భారత్ జోడోతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వానికి భారీ షాక్ తగిలింది. గోవాలో కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీలో చేరిన వారిలో మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైకెల్ లోబో ఉన్నారు. ప్రధాని మోదీని బలపరిచేందుకే తాము బీజేపీలో చేరామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. గోవా సీఎం, గోవా బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ ఉదయం గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను కలిశారు. అంతకు ముందు గోవా కాంగ్రెస్ శాసనసభాపక్షం పనాజీలో సమావేశమైంది. సీఎల్పీని బీజేపీలో విలీనం చేయాలనే తీర్మానాన్ని సీఎల్పీ నేత మైకేల్ లోబో ప్రతిపాదించగా మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు దాన్ని బలపరిచారు. వెంటనే ఆ తీర్మానాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందించడం, చేరిక చకచకా జరిగిపోయింది.
2019లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. తాజాగా మొత్తం శాసనసభాపక్షమే బీజేపీలో విలీనం కావడం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే. వాస్తవానికి రెండు నెలల క్రితమే ఈ విలీన ప్రక్రియ జరగాల్సి ఉంది. నాడు కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడంతో నాటి ఆపరేషన్ లోటస్ ఆగిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి