మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకెక్కిన ఎన్నికల కమిషన్, రేపు విచారణ,

మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకెక్కింది. న్యాయమూర్తులు జస్టిస్ వై.వి.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్. షాలతో కూడిన బెంచ్ ఈసీ  అప్పీలుపై సోమవారం విచారించ నుంది...

  • Publish Date - 7:39 am, Sun, 2 May 21 Edited By: Anil kumar poka
మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకెక్కిన ఎన్నికల కమిషన్, రేపు విచారణ,
Ec Appeal Against Madras Highcourt

మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకెక్కింది. న్యాయమూర్తులు జస్టిస్ వై.వి.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్. షాలతో కూడిన బెంచ్ ఈసీ  అప్పీలుపై సోమవారం విచారించ నుంది. దేశంలో కోవిద్ కేసులు పెరిగిపోవడానికి ఈసీదే పూర్తిగా బాధ్యత అని, మీ పై హత్యాభియోగాలు ఎందుకు మోపరాదో చెప్పాలని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార రాలీలను అనుమతించిన కారణంగానే కోవిడ్ కేసులు వ్యాప్తి చెందాయని,  శుక్రవారం లోగా ఓ ప్లాన్ ను మీరు సమర్పించకపోతే ఎన్నికల ఫలితాల ప్రకటనను కూడా నిలిపివేస్తామని హైకోర్టు తీవ్రంగా పేర్కొంది. అయితే ఇందులో తమ తప్పేమీ లేదని కోర్టు మౌఖికంగా చేసే వ్యాఖ్యలను మీడియా ప్రచురించిందని ఈసీ పేర్కొంది. ఎన్నికలు జరగని రాష్ట్రాల్లో కూడా కేసులు పెరిగిపోలేదా అని ప్రశ్నించింది. తాము ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రకటించడానికి ముందు దేశంలో కేసులు తక్కువగా ఉన్న విషయాన్నిగుర్తు చేసింది. ఏమైనా… హైకోర్టు వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమైనవని, రాజ్యాంగ సంస్థ అయిన తమను ఇలా తప్పు పట్టడం భావ్యంకాదని   ఈసీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తమ అప్పీలులో పేర్కొంది. ఓట్ల కౌంటింగ్ కేంద్రాల్లో కోవిడ్ గైడ్ లైన్స్ పాటించేలా తాము  అన్ని చర్యలూ తీసుకున్నట్టు తెలిపింది. అభ్యర్థులు  లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశించే ముందు వారి ఆర్టీ -పీసీ ఇతర టెస్టులను తప్పనిసరి చేసినట్టు వెల్లడించింది.

కాగా శనివారం నాడే ఓట్ల  లెక్కింపు కేంద్రాల్లో ఇలా అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేలా ఈసీ ఏర్పాట్లు చేసింది. ఈసీ అధికారులు ఆయా కేంద్రాలకు వెళ్లి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.