కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చడ్డా సహా ఏడుగురు ఆప్ ఎంపీలు..
ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం పుట్టింది. కేజ్రీవాల్‌కు బిగ్ షాకిస్తూ రాజ్యసభ పక్షం నిలువునా చీలిపోయింది. పార్టీ హైకమాండ్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ, ఏడుగురు ఎంపీలు రాఘవ్ చడ్డా నాయకత్వంలో కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. నేను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అంటూ చడ్డా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు జెండా ఎగిరింది. ఆప్ రాజ్యసభ పక్షం నిలువునా చీలిపోయింది. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ.. ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఒకేసారి కమలం తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎంపీ రాఘవ్ చడ్డా నాయకత్వంలో ఎంపీలు విలీన పత్రాన్ని సైతం రాజ్యసభ చైర్మన్‌కు సమర్పించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆప్ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు చడ్డా ప్రకటించారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది ఎంపీలు ఉండగా, ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి తప్పించుకునేందుకు అవసరమైన 2/3 వంతు మెజారిటీని తిరుగుబాటు వర్గం సాధించింది. రాఘవ్ చడ్డా, అశోక్ కుమార్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్బజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, స్వాతి మలివాల్, విక్రమ్ సింగ్ సాహ్ని కమలం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి చడ్డాను కేజ్రీవాల్ తొలగించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే చడ్డా పార్టీ మారడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా రాఘవ్ చడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను నా జీవితంలోని 15 ఏళ్లను ఆప్‌కు అంకితం చేశారు. కానీ ఆ పార్టీ నేడు అవినీతి పరుల చేతుల్లో ఉంది. నేను ఇన్నాళ్లూ తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని. ఇప్పుడు పార్టీకి దూరమై, ప్రజలకు దగ్గరవాలని నిర్ణయించుకున్నాను. మోదీ, అమిత్ షా నాయకత్వంలో పనిచేస్తాం’’ అని చడ్డా కుండబద్ధలు కొట్టారు. రాఘవ్ చడ్డాకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఆప్ రియాక్షన్
రాఘవ్ చడ్డా ఆరోపణలపై ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ స్పందించారు. పార్టీ చడ్డాకు అన్ని ఇచ్చిందని అన్నారు. అయినా తన స్వార్థం కోసం బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. పంజాబ్ ప్రజలకు చడ్డా ద్రోహం చేశారని మండిపడ్డారు.
