AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్ర ఇంటర్నెట్‌ కేబుళ్లను కట్ చేస్తాం.. హెచ్చరించిన ఇరాన్‌

సముద్ర ఇంటర్నెట్‌ కేబుళ్లను కట్ చేస్తాం.. హెచ్చరించిన ఇరాన్‌

Phani CH
|

Updated on: Apr 24, 2026 | 8:06 PM

Share

ఇరాన్ గల్ఫ్ సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. అమెరికా ఆంక్షల నడుమ, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ పోర్టులపై దిగ్బంధనం కొనసాగుతోంది. ఇది ప్రపంచ చమురు సరఫరాను, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముడి చమురు ధరలు పెరిగాయి, ప్రపంచ కనెక్టివిటీకి ముప్పు పొంచి ఉంది. భారత్‌కు ఇరాన్ నుంచి చమురు సరఫరా కొనసాగడం కీలక పరిణామం.

పశ్చిమాసియాలో ఇరాన్ అనుకూల మీడియా నుంచి ఒక కొత్త హెచ్చరిక వచ్చింది. గల్ఫ్ ప్రాంతంలో సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ తమ లక్ష్యాలుగా మారే అవకాశముందని సంకేతాలు ఇచ్చింది. ఇది సాధారణ హెచ్చరిక కాదు… ప్రపంచ కనెక్టివిటీనే ప్రభావితం చేసే విషయం. ప్రపంచ దేశాల మధ్య డేటా రవాణా చేసే ఈ కేబుల్స్, గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థకు వెన్నెముకలా పనిచేస్తాయి. అలాంటి కీలక వ్యవస్థలే ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయని ఇరాన్‌ నుంచి సూచనలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్నెట్ షట్‌ డౌన్ అయితే ఏమవుతుంది? విస్తృత స్థాయిలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలు, వ్యాపారాలు, ప్రభుత్వ కార్యకలాపాలు ఒక్కసారిగా దెబ్బతింటాయి. ఇది కేవలం ఒక దేశంపై మాత్రమే కాదు, అనేక ప్రాంతాలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు తగ్గలేదు. ఈ పోరాటం ఇప్పుడు సంప్రదాయ సైనిక లక్ష్యాలను దాటి డిజిటల్ నెట్‌వర్క్‌ వైపు మళ్లింది. ఒకవైపు కాల్పుల విరమణ కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా ఇరాన్ పోర్టులపై బ్లాకేడ్ కొనసాగిస్తోంది. బ్లాకేడ్‌ ప్రభావం ఇప్పటికే ప్రపంచ మార్కెట్లపై పడింది. హోర్ముజ్ నుంచే ప్రపంచానికి 20% చమురు రవాణా అవుతుంది. . ఇప్పుడు ఈ మార్గం నిలిచిపోవడంతో ఆహారం నుంచి నిత్యావసరాల ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది, యుద్ధానికి ముందుతో పోలిస్తే 35% పెరిగింది. ఇరాన్ నుంచి ఇరాక్‌కు రూ.4,600 కోట్ల క్యాష్‌ను ప్రత్యేక విమానం ద్వారా తరలిస్తున్నారు. ఊహించని విధంగా ఇరాన్‌కు అమెరికా షాకిచ్చింది. డబ్బుతో వెళ్తున్న విమానాన్ని మధ్యలోనే అమెరికా అడ్డుకుంది. కొంతకాలంగా ఇరాక్‌లోని అమెరికా రాయబార కేంద్రాలపై ఇరాన్ అనుకూల ముఠాలు రాకెట్లు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్నాయి. దాడులను అరికట్టడంలో ఇరాక్ విఫలమైందన్న కోపంతో.. ఆ దేశానికి వెళ్లాల్సిన కరెన్సీ నోట్ల విమానాన్ని అమెరికా నిలిపి వేసిందని తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి నుంచి గుజరాత్ పోర్టుకు వస్తున్న నౌక సహా రెండు కంటైనర్లను ఇరాన్ సీజ్ చేసింది. కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తూనే, పోర్టుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని తెలిపారు. దీనికి ఇరాన్ దీటుగా స్పందించింది. రెండు నౌకలపై ఇరాన్ ఈ ఉదయం కాల్పులు జరిపింది. హ‌ర్మూజ్ జలసంధి తమ పూర్తి నియంత్రణలో ఉందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అయితే అది ఫ్లాప్‌ షో అని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఏప్రిల్‌ 13న అమెరికా దిగ్బంధం విధించినప్పటి నుంచి ఇరాన్‌కు సంబంధమున్న కనీసం 34 ట్యాంకర్లు హ‌ర్మూజ్ జలసంధిని దాటాయి. బయటకు వెళ్లిన వాటిలో ఆరు నౌకలు సుమారు 10.7 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురును రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీని ద్వారా ఇరాన్‌కు దాదాపు 910 మిలియన్ డాల‌ర్ల‌ ఆదాయం సమకూరినట్లు అంచనా. అమెరికా నిఘా నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ నౌకలు ఆధునిక పద్ధతులు వాడుతున్నాయి. తమ ఉనికిని, లొకేషన్‌ను తెలిపే ట్రాన్స్‌పాండర్‌ను ఆపేసి జలసంధిని దాటాయి. ఈ పరిణామాలతో నౌకల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్ విధించిన ‘డబుల్ దిగ్బంధం’గా మారిందని వాపోతున్నారు. 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో ట్యాంకర్ ‘డోర్నా’ భారత దక్షిణ తీరానికి చేరుకుంది. ఈ విషయాన్ని భారత ఇరాన్ కాన్సులేట్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. అమెరికా నావికాదళం హర్మూజ్ జలసంధిని దిగ్బంధించినప్పటికీ ముడి చమురుతో ఉన్న ఈ ట్యాంకర్ విజయవంతంగా భారత్ చేరుకుంది. అమెరికా దిగ్బంధనానికి కొద్దిసేపటి ముందే ఇరాన్ జలాల నుంచి అది బయలుదేరింది. అమెరికా ఆంక్షల నడుమ వారం రోజుల వ్యవధిలో భారత్‌కు మూడు విడతల్లో దాదాపు 6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు వచ్చింది. ప్రస్తుతం దక్షిణ తీరానికి చేరుకున్న డోర్నా నౌక సమీపంలోని స్థానిక రిఫైనరీకి సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురును అందచేయనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mangli: ₹200Cr భారీ స్కామ్‌.. మంగ్లీ క్లారిఫికేషన్..

Weather Update: వచ్చే నాలుగు రోజులు ఎండలే ఎండలు

TSRTC: మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. చర్చలు షురూ.. ఆ మూడు డిమాండ్లే కీలకం

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్‌.. తగ్గిన బంగారం ధరలు

తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??

Follow Us