40 ఏళ్ల క్రితం విమాన హైజాక్ ఘటన.. అందులో విదేశాంగ మంత్రి జైశంకర్ తండ్రి కూడా..!
స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, “1984లో, నేను ఒక అధికారిగా, హైజాకర్లతో సంప్రదింపులు జరిపే బృందంలో భాగమయ్యాను. కొన్ని గంటల తర్వాత, విమానం హైజాక్ అయినందున నేను ఇంటికి రాలేనని మా అమ్మకు ఫోన్ చేసినప్పుడు, మా నాన్న కూడా అదే విమానంలో ఉన్నారని నాకు తెలిసింది" అన్నారు.
ఇది ఒక సినిమాను తలపించేలా జరిగిన ఓ నిజ జీవిత కథ. ఇందులో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం సహా ఇంకా మరికొందరు కీలక పాత్రధారులు. వేర్పాటువాదులు హైజాక్ చేసిన ఓ విమానంలో జైశంకర్ తండ్రి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం ఉంటే.. ఆ హైజాకర్లతో సంప్రదింపులు జరిపి ప్రయాణికులను విడిపించే కీలక బాధ్యతలో నాటి యంగ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎస్. జైశంకర్ ఉన్నారు. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. హైజాక్‌కు గురైన విమానంలో తన తండ్రి ఉన్న విషయం ముందు ఆయనకు తెలియదు. కానీ హైజాకర్లతో నేగోషియేటర్‌గా బాధ్యతలు తీసుకున్న జైశంకర్, తాను ఇంటికి రావడం ఆలస్యమవుతుందని చెప్పడం కోసం తల్లికి ఫోన్ చేసినప్పుడు ఈ విషయం తెలుసుకున్నారు. అప్పుడు అధికారిగా, కొడుకుగా జైశంకర్ అనుభవించిన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. స్విట్జర్లాండ్‌లో జైశంకర్ 40 ఏళ్ల క్రితం నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.
స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, “1984లో, నేను ఒక అధికారిగా, హైజాకర్లతో సంప్రదింపులు జరిపే బృందంలో భాగమయ్యాను. కొన్ని గంటల తర్వాత, విమానం హైజాక్ అయినందున నేను ఇంటికి రాలేనని మా అమ్మకు ఫోన్ చేసినప్పుడు, మా నాన్న కూడా అదే విమానంలో ఉన్నారని నాకు తెలిసింది” అన్నారు. జైశంకర్ తండ్రి కే. సుబ్రమణ్యం కూడా సివిల్ సర్వెంట్‌గా, ప్రముఖ పాత్రికేయుడిగా.. అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకుడిగా పేరున్న వ్యక్తి. హైజాకైన సమయానికి ఆయన ఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన “ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్” సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు. మొత్తానికి సుఖాంతంగా ముగిసిన ఈ హైజాక్ కహానీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
చండీగఢ్‌లో మొదలైన హైజాక్ కథ
అది 1984 ఆగస్టు 24 తెల్లవారుజాము. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC- 421 (బోయింగ్ 737-2A8)లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF)తో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు హైజాక్ చేశారు. నిజానికి ఈ విమానం ఢిల్లీలో బయలుదేరి, చండీగఢ్ మీదుగా శ్రీనగర్ వెళ్లాల్సిన విమానం. ఢిల్లీలో బయలుదేరిన సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 122 మంది ఉన్నారు. వారిలో 67 మంది ప్రయాణికులు చండీగఢ్‌లో దిగగా, 31 మంది ప్రయాణికులు శ్రీనగర్ అక్కడ ఎక్కారు. హైజాకైన సమయానికి విమానంలో 74 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇలా ఎక్కినవారిలో హైజాకర్లు కూడా ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల వయస్సులో ఉన్న సిక్కు యువకులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి, కెప్టెన్ వీకే మెహతాను తమ ఆధీనంలోకి తీసుకుని విమానంపై నియంత్రణ సాధించారు. చండీగఢ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఉదయం 7.30 గంటలకు విమానం హైజాక్‌కు గురైంది. ఈ విమానంలో ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తండ్రి, సివిల్ సర్వెంట్ సుబ్రమణ్యం కూడా ఉన్నారు.
హైజాకర్లు తొలుత విమానాన్ని భారత్‌కు దూరంగా ఉన్న అమెరికాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అంత దూరం తీసుకెళ్లేందుకు తగినంత ఇంధనం లేకపోవడంతో పాకిస్థాన్‌లోని లాహోర్‌లో విమానాన్ని ల్యాండ్ చేయించారు. విమానం లాహోర్‌లో దాదాపు 80 నిమిషాల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. విమానంలో ఇంధనం తక్కువగా ఉండటంతో, పాక్ అధికారులు ఉదయం 9:50 గంటలకు లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ సమయంలో విమానాన్ని పేల్చివేయడానికి తగినంత పేలుడు పదార్థాలు తమ వద్ద ఉన్నాయని హైజాకర్లు బెదిరించారు. విమానంలో ఇంధనం నింపే వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకరిని చంపేస్తామని బెదిరించారు.
లాహోర్‌లో 5గురు ప్రయాణికులకు విముక్తి
హైజాకైన విమానంలో ఉన్న ప్రయాణికుల్లో ఐదుగురిని రాత్రి 7 గంటలకు లాహోర్‌లోనే విడిచిపెట్టారు. హైజాకర్ల డిమాండ్ మేరకు విమానంలో ఇంధనం నింపడానికి, టేకాఫ్ చేసేందుకు పాకిస్తాన్ అధికారులు అనుమతి ఇచ్చారు. లాహోర్‌లో టేకాఫ్ చేసిన విమానాన్ని బహ్రైన్ తీసుకెళ్లాలని హైజాకర్లు తొలుత భావించారు. కానీ వాతావరణం సహకరించకపోవడంతో చివరకు పాకిస్తాన్‌లోనే ఉన్న మరో నగరం కరాచీలో ల్యాండ్ చేశారు. ప్రయాణికుల్లో బ్రిటీష్ పాస్‌పోర్టు కల్గిన ఇద్దరు మహిళలు అనారోగ్యానికి గురికావడంతో వారికి అక్కడే విడిచిపెట్టారు. అక్కడ మరోసారి విమానంలో ఇంధనం నింపిన తర్వాత తర్వాత హైజాకర్లు ఈ విమానాన్ని దుబాయ్ తీసుకెళ్లారు.
దుబాయ్‌లో కథకు క్లైమాక్స్ సీన్
ఈ ఎయిర్ ఇండియా విమానం ఇప్పుడు దుబాయ్‌లో ఉంది. మరుసటి రోజు ఉదయం గం. 8.00కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రక్షణ మంత్రి మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రయాణీకులను సురక్షితంగా విడుదల చేయడంతోపాటు హైజాకర్లను UAE అధికారులకు అప్పగించడం గురించి చర్చలు జరిపాడు. మధ్యాహ్నం గం. 1:45కు రక్షణ మంత్రి షేక్ రషీద్ పదేపదే చేసిన అభ్యర్థనల తర్వాత, హైజాకర్లు చివరకు బందీలకు ఆహారం, నీటిని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు. యూఏఈ అధికారులతో చర్చల సందర్భంగా, హైజాకర్లు తాము సురక్షితంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) వెళ్లాలని, తమకు రాజకీయ ఆశ్రయం కల్పించాలని డిమాండ్ చేశారు. కానీ దుబాయ్‌లోని యూఎస్ ఎంబసీ మాత్రం అమెరికా వెళ్తే అరెస్ట్ చేస్తామని తేల్చి చెప్పింది. మరోవైపు భారత అధికారులతో పాటు దుబాయ్ అధికారులు హైజాకర్లతో చర్చల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో హైజాకర్లు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, ప్రతి అరగంటకు ఒక బందీని చంపడం ప్రారంభిస్తారని బెదిరించారు.
హైజాకర్లతో చర్చల సమయంలో, యూఏఈ అధికారులు రెండు అంబులెన్స్‌లను విమానానికి సమీపంలో అందుబాటులో ఉంచారు. అయితే విమానంలో ప్రయాణికుల్లో ఒకరిగా ఉన్న జైశంకర్ తండ్రి సుబ్రహ్మణ్యం తాను మధుమేహంతో బాధపడుతున్నానని, తనకు సమయానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఇబ్బందిపడతానని హైజాకర్లతో చెప్పారు. విమానానికి సమీపంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో సుబ్రహ్మణ్యంకు ఇన్సులిన్ డోస్ ఇచ్చిన తర్వాత హైజాకర్లు మళ్లీ ఆయనను విమానంలోకి తీసుకెళ్లిపోయారు.
అప్పటికి విమానం హైజాక్ అయి 36 గంటలు గడిచింది. ప్రయాణికులను సురక్షితంగా విడుదల చేయడంపై హైజాకర్లు, భారత అధికారుల మధ్య నిరంతరం చర్చలు జరిగాయి. అనేక రౌండ్ల చర్చల తర్వాత, సాయంత్రం 6.50 గంటలకు దుబాయ్ పోలీస్ చీఫ్ హైజాకర్లు బేషరతుగా లొంగిపోయినట్లు ప్రకటించారు. దుబాయ్ పోలీసులు హైజాకర్లను అదుపులోకి తీసుకున్నారు. హైజాక్ జరిగిన సుమారు 36 గంటల తర్వాత మిగిలిన ప్రయాణికులు, సిబ్బంది అందరూ దుబాయ్‌లో సురక్షితంగా విడుదలయ్యారు.
ఇంకా ఉంది
ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా విడుదలవడంతో కథ క్లైమాక్స్‌కు వచ్చినా.. అక్కడితో ముగిసిపోలేదు. హైజాకర్లను అమెరికాకు పంపే ముందు వారికి ఏడు రోజుల ఆశ్రయం కల్పిస్తామని చర్చల సందర్భంగా దుబాయ్ అధికారులు హామీ ఇచ్చారు. కానీ తరువాత హైజాకర్ల ముందు రెండు ఆప్షన్స్ పెట్టారు. ఒకటి నేరుగా భారత్‌కు పంపించడం, రెండోది UAE చట్టం ప్రకారం విమాన హైజాక్ ఘటనపై విచారణ చేయడం. హైజాకర్లు దుబాయ్‌లో విచారణ ఎదుర్కొని ఆ దేశంలో జైలు పాలవడం కంటే భారతదేశమే నయం అనుకున్నారో.. మరే కారణమో… మొత్తానికి హైజాకర్లు భారత్‌కు చేరుకున్నారు.సెప్టెంబర్ 3, 1984న హైజాకర్లను న్యూఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ కేసు విచారణ రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరంలో 9 సంవత్సరాల పాటు కొనసాగింది. ఏప్రిల్ 1993లో, అజ్మీర్‌లోని జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు మొత్తం ఏడుగురు నిందితులకు శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జీవిత ఖైదు శిక్షపడిన హైజాకర్లలో కమల్‌జీత్ సింగ్ సంధు, దేవేంద్ర సింగ్, అమరేంద్ర సింగ్, అవతార్ సింగ్, తాజిందర్ సింగ్, మాన్ సింగ్, సురేంద్ర సింగ్ ఉన్నారు.