TV Anchor: వాతావరణ వార్తలు చదువుతూ లైవ్‌లోనే కుప్పకూలిన యాంకర్.. ! ఏ ఛానెల్లోనంటే..
దేశ వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పెరిగాయి. తాజాగా ఎండల తీవ్రత గురించి వార్తలు చదువుతూ లైవ్ జరుగుతున్న సమయంలోనే దూరదర్శన్ యాంకర్ లోపాముద్ర సిన్హా ఒక్కసారిగా కుర్చీలోనే కుప్పకూలిపోయారు. దూరదర్శన్ కోల్‌కతా బ్రాంచ్‌లో గత గురువారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు 21 యేళ్లుగా బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో ఉన్న సిన్హా..
కోల్‌కతా, ఏప్రిల్ 22: దేశ వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పెరిగాయి. తాజాగా ఎండల తీవ్రత గురించి వార్తలు చదువుతూ లైవ్ జరుగుతున్న సమయంలోనే దూరదర్శన్ యాంకర్ లోపాముద్ర సిన్హా ఒక్కసారిగా కుర్చీలోనే కుప్పకూలిపోయారు. దూరదర్శన్ కోల్‌కతా బ్రాంచ్‌లో గత గురువారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు 21 యేళ్లుగా బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో ఉన్న సిన్హా ఆరోజు ఉదయం ప్రోగ్రాంకి ముందే ఒంట్లో కాస్త నలతగా అనిపించిందని తెలిపారు. లైవ్ ప్రోగ్రాం కావడంతో తన వద్ద వాటర్ బాటిల్ ఉన్నప్పటికీ మాటిమాటికీ నీళ్లు తాగలేకపోయానని అన్నారు. అంతేకాకుండా లైవ్ ప్రోగ్రాం మధ్యలో విజువల్స్ గానీ, బ్రేక్‌లు గానీ లేకపోవడంతో షో ముగిసే వారకు నీళ్లు తాగడానికి అవకాశం లేకపోయిందన్నారు. దీంతో ఒక్కసారిగా తన బ్లడ్ ప్రెషర్ వేగంగా పడిపోవడంతో కుర్చీలోనే కుప్పకూలిపోయినట్లు ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో వివరించారు. న్యూస్ రూం కూలింగ్ సిస్టమ్‌లో కొంత ఇబ్బంది కారణంగా స్టూడియో లోపల కూడా విపరీతమైన వేడిగా ఉందని యాంకర్ చెప్పారు.
‘నా 21 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ వాటర్ బాటిల్‌ను నా వద్ద ఉంచుకోలేదు. అది 15 నిమిషాల ప్రసారమైనా లేదా అరగంట ప్రసారమైనా, నా కెరీర్‌లో ప్రసారాల సమయంలో మధ్యలో నీళ్ళు తాగవల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. కానీ, ఆ రోజు 15 నిమిషాలు కూడా ఉండలేకపోయాను. వాతావరణ వార్తలు చదువుతున్నప్పుడు మాటలు తడబడ్డాయి. అయినప్పటికీ నా ప్రెజెంటేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నించాను. కానీ అంతలోనే టెలిప్రాంప్టర్ మసకగా కనిపించింది. సృహతప్పి పడిపోయాను. అదృష్టవశాత్తూ, టీవీలో 30 నుంచి 40 సెకన్ల యానిమేషన్ ప్లే అవుతున్న సమయంలో ఇది జరిగింది’ అంటూ వివరించారు.
దీంతో వెంటనే అక్కడే ఉన్న సహోద్యోగులు ఆమెకు సహాయం చేసేందుకు పరుగులు తీశారు. ముఖం మీద నీళ్లు చల్లి, ఫ్యాన్ గాలి తగిలేలా చేసి ఆమె కోలుకునేలా చేశారు. కార్యక్రమం మధ్యలో తనకు ఇలా జరిగినందుకు ఛానెల్‌కు క్షమాపణలు తెలిపారు. కాగా ప్రస్తుతం ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏడు నుంచి ఎనిమిది డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్, బంకురాలో వరుసగా 44.5, 44.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇటువంటి వాతావరణ పరిస్థితులలో హైడ్రేటెడ్‌గా ఉండటం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. యాంకర్ సిన్హా కూడా వేడి వాతావరణం మూలంగా డీహైడ్రేటెడ్ అయ్యి కుప్పకూలిపోయారు. ఎండల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.