Delta Variant: వ్యాక్సిన్ తీసుకుంటే డెల్టా వేరియంట్ నుంచి తప్పించుకోవచ్చు.. తాజా పరిశోధనలలో వెల్లడి
Delta Variant: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మరోవైపు డెల్టా వేరియంట్ మరింత భయపెడుతోంది. గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను..
Delta Variant: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మరోవైపు డెల్టా వేరియంట్ మరింత భయపెడుతోంది. గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చేస్తుండగా, కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇక డెల్టా వేరియంట్ కూడా మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో పరిశోధకులు నిర్వహించిన పలు అధ్యయనాల్లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
మరోవైపు ఇదే వేరియంట్ డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెంది మరింత ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపధ్యంలో డెల్టా వేరియంట్ విషయంలో పరిశోధకులు పలు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా వైరస్ బారినపడి కోలుకున్నవారికి వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇస్తే చాలు.. డెల్టా వేరియంట్ నుంచి సైతం రక్షణ కల్పిస్తుందని అధ్యయనంలో తేలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్నవారితో.. కరోనా నుంచి కోలుకుని ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిని పోల్చి చూస్తే డెల్టా వేరియంట్ నుంచి అత్యధిక రక్షణ పొందారని అధ్యయనంలో తేలింది. నేచర్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కోవిడ్ బారినపడిన వారిలో అభివృద్ధి చెందే యాంటీబాడీస్‌కు వ్యాక్సిన్ సింగిల్ డోస్ కలిస్తే.. మరింత ప్రమాదకర వేరియంట్ల నుంచి రక్షణ కలుగుతుందని స్పష్టం అయ్యింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం వల్ల డెల్టా వేరియంట్ నుంచి కాపాడుకోవచ్చని అధ్యయనం చెబుతోంది.
ప్రస్తుతం మన దేశంలో 45 లక్షల 60 వేల సెంటర్ల ద్వారా దాదాపుగా 35 కోట్ల వ్యాక్సిన్ పంపిణి జరిగింది. ఓ వైపు వ్యాక్సినేషన్ జరుగుతుండగానే.. వ్యాక్సిన్‌కు సంబంధించి వివిధ రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. మరోవైపు వివిధ రకాల వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. అయితే ఆస్ట్రాజెనెకా లేదా ఫైజర్ టీకాలను ఒకే మోతాదు పొందిన వారిలో 10 శాతం మంది రక్తనమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ మొదటి డోసు డెల్టా వేరియంట్ నుంచి రక్షణ పొందవచ్చని గుర్తించారు.
ఇక రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా సోకడం, మరణాలు సంభవించడం చాలా వరకు తగ్గిపోయాయని గుర్తించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఇప్పటికే పరిశోధకులు స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌లు తీసుకోవడం వల్ల పాజిటివ్ కేసులు, మరణాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కోవిడ్ టీకాలు ఆస్పత్రుల్లో చేరడాన్ని నిరోధించగలవని చెబుతున్నారు.