Malayalam : నర్సులు మలయాళంలో మాట్లాడొద్దంటూ ఢిల్లీలోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రి సర్కులర్.. స్పందించిన రాహుల్, కేటీఆర్
నర్సులు కేవలం ఇంగ్లీష్ లేదా హిందీ లోనే మాట్లాడాలని.. మలయాళంలో మాట్లాడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని..
GIPMER Delhi government hospital tells nurses not to speak in Malayalam : ఢిల్లీలోని “గోవింద్ బల్లబ్ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్” (GIPMER) వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. జిప్మర్ హాస్పిటల్ లోని నర్సులు మలయాళంలో మాట్లాడవద్దంటూ సర్క్యులర్ జారీ చేసింది. నర్సులు కేవలం ఇంగ్లీష్ లేదా హిందీ లోనే మాట్లాడాలని.. మలయాళంలో మాట్లాడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని సదరు సర్క్యులర్ లో పేర్కొంది. దేశ రాజధానిలో ఈ ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రి తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వివిధ సంఘాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ జిప్మర్ నిర్ణయాల్ని తీవ్రంగా ఖండించారు.
ఇతర భారతీయ భాషలెంతో మలయాళ భాష కూడా అంతేనన్న రాహుల్.. భాషా వివక్ష ఆపండంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా జిప్మర్ నిర్ణయంపై రియాక్టయ్యారు. ఇది కచ్చితంగా ప్రాధమిక హక్కుల ఉల్లంఘనేనన్న కేటీఆర్.. భారతదేశంలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మొదలైన 22 అధికారిక భాషలు ఉన్నాయి. ప్రతి భారతీయుడికి తమకు నచ్చిన భాషలో సంభాషించే హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించిన ఆ ప్రాథమిక హక్కును ఎవరూ ఉల్లంఘించకూడదని కేటీఆర్ అన్నారు. ఇలాంటి చర్యలు దేశాల మూఢత్వానికి సూచికలుగా మారతాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అయితే, దేశవాప్తంగా తీవ్రమైన విమర్శలు ఎదురుకావడంతో జిప్మర్ తన ఈ వివాదాస్పద సర్కులర్ ను గంటల వ్యవధిలోనే ఉపసంహరించుకుంది. తమకు సమాచారం లేకుండా ఆ సర్కులర్ జారీ అయిందని ఆస్పత్రి యాజమాన్యం వివరణ ఇచ్చింది. అటు, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా సర్కులర్ జారీపై జిప్మర్ ఆసుపత్రికి మెమో జారీ చేసిందని తెలిసింది.
Malayalam is as Indian as any other Indian language.
Stop language discrimination! pic.twitter.com/SSBQiQyfFi
— Rahul Gandhi (@RahulGandhi) June 6, 2021
This directive reeks of language chauvinism ?
India has 22 official languages & Malayalam, Telugu, Tamil, Hindi etc are included
Every Indian should have the right to converse in a language of their choice & no one should infringe on that basic right pic.twitter.com/noIVoCZtBQ
— KTR (@KTRTRS) June 6, 2021