Mobile Phones: అక్కడి స్కూళ్లలో మొబైల్ ఫోన్లు బంద్.. సర్క్యులర్ జారీ చేసిన సర్కారు.. ఎందుకో తెలుసా?
మొబైల్ ఫోన్ కలిగించే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువ ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల యుగంలో అవి అందించే వినోదం పక్కదారి పడుతోంది. సోషల్ మీడియా ఒక వ్యసనంగా తయారవుతోంది. మరీ ముఖ్యంగా పరిణితి లేని వయస్సులో పిల్లలు వీడియో గేమ్స్‌కు బానిసల్లా మారి మతి, గతి తప్పుతున్న ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే..

చదువుకునే పిల్లల ఏకాగ్రతను దెబ్బతీసే అంశాలు చాలానే ఉన్నాయి. సాధారణంగా వినోదాన్ని అందించే మాధ్యమాలే చదువు మీద నుంచి దృష్టిని మళ్లిస్తుంటాయి. ఒక తరంలో నాటకాలు, సినిమాలు.. ఇంకో తరంలో టీవీలు.. ఇప్పుడేమో మొబైల్ ఫోన్లు.. విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీసే సాధనాలు. సినిమాలు, టీవీల కాలంలో విద్యార్థులు స్కూలు నుంచి బయటపడ్డ తర్వాతనే వాటి ప్రభావం ఉండేది. కానీ మొబైల్ ఫోన్ల యుగంలో.. అవి దూరని ప్రదేశమంటూ లేదు. చివరకు పడక గదులు, తరగతి గదులు కూడా మినహాయింపు కాదు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మొబైల్ ఫోన్ కలిగించే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువ ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల యుగంలో అవి అందించే వినోదం పక్కదారి పడుతోంది. సోషల్ మీడియా ఒక వ్యసనంగా తయారవుతోంది. మరీ ముఖ్యంగా పరిణితి లేని వయస్సులో పిల్లలు వీడియో గేమ్స్‌కు బానిసల్లా మారి మతి, గతి తప్పుతున్న ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే.. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా చదువుకునే పిల్లలు స్కూళ్లకు తీసుకురావద్దంటూ సర్క్యులర్లు జారీ అయ్యాయి.
పిల్లలకే కాదు, ఉపాధ్యాయులకూ ఆంక్షలు
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DoE) మొబైల్ ఫోన్ల వినియోగంపై గురువారం ఒక కీలక సర్క్యులర్ జారీ చేసింది. ఆ ప్రకారం తరగతి గదుల్లో మొబైల్ ఫోన్ల వాడకం పూర్తి నిషేధం. పిల్లలు తమతో పాటు మొబైల్ ఫోన్లను స్కూళ్లకు తీసుకెళ్లకుండా తల్లిదండ్రులే జాగ్రత్త వహించాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆంక్షలు కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే కాదు, ఢిల్లీలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది. కోవిడ్-19 లాక్‌డౌన్ సందర్భంగా ఢిల్లీ సహా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవడం కోసం స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లపై ఆధారపడాల్సి వచ్చింది. అసైన్మెంట్లు, హోం వర్క్ కూడా వాట్సాప్ వంటి సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా టీచర్లు మెటీరియల్ పంపించడం జరిగింది. అప్పుడు మొదలైన అలవాటు పిల్లల్లో కొనసాగుతూ వచ్చింది. అందులో కొందరు పిల్లలు స్మార్ట్ గ్యాడ్జెట్లకు బానిసలుగా కూడా మారిపోతున్నారు. విద్యావసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మొదలుపెట్టిన స్మార్ట్ గ్యాడ్జెట్ల వినియోగం.. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వం గ్రహించింది. అందుకే తాజాగా ఈ ఆంక్షలు జారీ చేసింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలకు ఏదైనా సమాచారం అందించడం కోసమో లేదంటే పాఠశాల సమయం ముగిసిన తర్వాత పికప్ చేసుకునే సందర్భంలోనో కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్లను అందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న నేటి పరిస్థితుల్లో పిల్లలకు మొబైల్ ఫోన్లు అందించడం పరిపాటిగా మారింది. ఇలాంటివారిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. అలా ఎవరైనా పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లను స్కూలుకు తీసుకొస్తే.. వాటిని సురక్షితంగా దాచిపెట్టే సేఫ్ లాకర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా అన్ని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలోకి ప్రవేశించే సమయంలో పిల్లలు వాటిని డిపాజిట్ చేసి, తిరిగి ఇంటికి వెళ్లే ముందు తీసుకునేలా ఈ విధానం ఉండాలని సూచించింది. తద్వారా తరగతి గదుల్లో పిల్లల చేతుల్లో ఫోన్లు లేకుండా చూడొచ్చని, పూర్తి ఏకాగ్రత ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై నిలపడానికి ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ క్లాసులు జరుగుతున్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో సమాచారం చేరవేయాల్సి పరిస్థితులు ఉంటే, అందుకు వీలు కల్పించేలా ప్రతి స్కూల్‌లో హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేసి, తల్లిదండ్రులు, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది.
స్వాగతిస్తోన్న విద్యావేత్తలు
అయితే ఈ నిషేధాజ్ఞలు, ఆంక్షలను విద్యార్థుల వరకే పరిమితం చేయలేదు. పాఠశాల సిబ్బందికి కూడా ఈ ఆంక్షలను వర్తింపజేసింది. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది బోధన సమయంలో లేదంటే అభ్యాస కార్యకలాపాలు జరిగే తరగతి గదులు, ఆట స్థలాలు, ప్రయోగశాలలు, లైబ్రరీ వంటి ప్రదేశాలలో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించకూదని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా పిల్లల ఏకాగ్రతతో పాటు అధ్యాపకుల ఏకాగ్రతకు సైతం భంగం కలగకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం ఓవరాల్ విద్యావిధానాన్ని మెరుగుపరుస్తుందని, విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరహా నిబంధనలు విదేశాల్లో అనేక దేశాల్లో అమల్లో ఉన్నాయి. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే ఈ తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటికీ ఏకరీతిన ఆంక్షలు విధించడాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. ఢిల్లీని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచిస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..