Delhi Blast: మిస్టరీగా ఉన్న ఢిల్లీ పేలుడు ఘటన..ఇదివరకెప్పుడూ చూడని కొత్త తరహా బ్లాస్ట్..
ఢిల్లీ మధ్యలో ఒక్కసారిగా పేలిన కారు నగరాన్ని భయాందోళనల్లోకి నెట్టింది. రోడ్డుపై గుంత కనిపించకపోవడం.. మృతుల శరీరాల్లో పదునైన తుక్కుల ఆనవాళ్లు కూడా లేకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తుంది. ఇది సాధారణ బాంబు పేలుడా? లేక కొత్త రకమైన రసాయనిక విస్ఫోటమా? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

ఢిల్లీ నగరం మళ్లీ భయాందోళనల్లో మునిగిపోయింది. నగరం మధ్యలో సంభవించిన ఒక అనూహ్యమైన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సాధారణంగా కనిపించిన ఓ కారు ఒక్కసారిగా చెల్లాచెదురైపోయింది. ఆ క్షణం నల్లటి పొగ ముసురుకుంటూ రోడ్డంతా గందరగోళమైంది. అయితే ఈ పేలుడు ఏ రకం అనేది ఇప్పటికీ స్పష్టంగా లేదు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, కారు వెనుక భాగంలోనే బ్లాస్ట్ జరిగినట్టు తేలింది. మాములుగా ఇంత భారీ పేలుడు జరిగితే అక్కడ రోడ్డుకు గుంత పడాలి. ఆశ్చర్యమేమిటంటే.. పేలుడు తర్వాత రోడ్డుపై ఎలాంటి గుంత కనిపించలేదు. కారు ప్రయాణికుల్లో కొందరు అక్కడికక్కడే మృతి చెందగా, వారి శరీరాల్లో పదునైన లోహపు తుక్కులు లేదా స్పష్టమైన అవశేషాలు ఏవీ కనబడలేదు. ఇదే విషయం ఫోరెన్సిక్ నిపుణులను అయోమయానికి గురి చేస్తోంది. ఘటనాస్థలంలో మిగిలిన పదార్థాలు సాధారణ బాంబు పేలుడు పదార్థాల లక్షణాలు కనబరచడం లేదు. రసాయనిక స్వరూపం కొత్త రకంగా ఉందని, ఇది ఇప్పటివరకు దేశంలో ఎక్కడా చూడని మోడల్ బ్లాస్ట్ కావచ్చని నిపుణులు అంటున్నారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, పేలుడు ముందు ఎటువంటి మంట, వాసన లేదా శబ్దం కూడా వినిపించలేదని చెబుతున్నారు. క్షణాల్లోనే కారు వెనుక భాగం ముక్కలైపోయిందని, అది బాహ్య దాడిలా కాకుండా లోపలే ఏదో రసాయనిక ప్రతిచర్యలా అనిపించిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీస్, ఎన్ఐఏ, ఫోరెన్సిక్ టీమ్‌లు కలిసి మల్టీ లెవెల్ దర్యాప్తు చేస్తున్నారు. కారు లోపల పెట్టిన ఎలక్ట్రానిక్ పరికరాలు, జిపిఎస్ సిగ్నల్స్ అన్నీ స్కాన్ చేస్తున్నారు. ఇది ఉగ్రదాడా? లేక ఏదైనా కొత్త తరహా కెమికల్ ఎక్స్‌ప్లోషనా? అనే ప్రశ్నకు సమాధానం రానుంది.
ఢిల్లీ నగర హృదయంలో ఇంత ఆధునిక, అంతే రహస్యమైన బ్లాస్ట్ జరగడం దేశ భద్రతా వ్యవస్థలను సవాల్ చేసింది. ఇది కొత్త తరహా ఉగ్రవాద దాడుల ప్రారంభమా? లేక సైన్స్ తప్పుదోవ పట్టిన ప్రయోగమా? అన్నది ఇప్పుడు దేశమంతా అడుగుతున్న ప్రశ్న.
థ్యాంక్ గాడ్. ఇవాళ మండే కావడం ఒక బెనిఫిట్టయింది. లేదంటే ప్రమాద తీవ్రత అనూహ్యంగా ఉండేది. ఇంతకుమించి ప్రాణనష్టం జరిగేది. ప్రమాదం జరిగిన ఛాంద్‌నీచౌక్ ప్రాంతం.. షాపింగ్‌కి హబ్ లాంటిది. ఎప్పుడూ వెండర్లు, కస్టమర్లతో కిటకిటలాడేది. కానీ, సోమవారం సెలవు కావడంతో జన తక్కువగా వచ్చారు. ఘటన జరిగినప్పుడు జనసంచారం పల్చగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీలోని టూరిస్ట్ స్పాట్లకు, మార్కెట్లకు ప్రతి సోమవారం సెలవు. వీకెండ్స్‌తో తాకిడి ఎక్కువగా ఉంటుంది గనుక, వారానికోరోజు మూత తప్పనిసరి కనుక ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. మండే హాలిడే విషయంలో అధికారులు కూడా స్ట్రిక్ట్‌గా ఉంటారు. దుకాణాలన్నీ షట్టర్లు మూసెయ్యాల్సిందే. కాకపోతే, రోడ్‌సైడ్ వెండర్స్, తోపుడు బండ్లను నియంత్రించే ఛాన్స్ లేదు.
సోమవారం మినహా మిగతా ఆరురోజుల్లో చాందినీ చౌక్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుంది. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు షాపింగ్ కోసం జనం, టూరిస్టులు ఎగబడ్డం చూస్తుంటాం. అందుకే, ఇవాళ కాకుండా నిన్నోమొన్నో ఈ పేలుడు జరిగుంటే నష్టం తీవ్రంగా ఉండేది. ప్రాణనష్టం వందల్లో ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు చెబుతున్నది కూడా అదే.
ఒక్క పేలుడు.. ఎన్నో ప్రశ్నలు. సిగ్నల్ దగ్గర ఆగిన కారులో పేలుడు ప్లాన్డ్‌గానే జరిగిందా అనుకోకుండా జరిగిందా అన్న అనుమానాలు.
— బాంబుపెట్టిన కారులో ప్రయాణికులు ఎందుకు ఉన్నారు? –కారులో బాంబు ఉందనే విషయం వారికి తెలుసా? లేదా? –ఆ కారులో మరెవరన్నా బాంబును అమర్చి ఉంటారా? –కారులో ఉన్నవారు పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నారా? –బాంబు అనుకున్న సమయంకంటే ముందే పేలిందా? –పేలుళ్ల కుట్రదారుల అసలు టార్గెట్ వేరే ఉందా? –కారులో ఉన్నవారికి దిగిపోయే అవకాశం దొరకలేదా? అన్నవి ప్రస్తుతానికి మిస్టరీ సందేహాలు…




