వామ్మో ఇదేం ఎండరా నాయనా – ఉదయం 8.30 గంటలకే 45 డిగ్రీలు నమోదు
నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు, చల్లటి వాతావారణం నెలకొంటే ఉత్తరాది రాష్ట్రాలు ఎండ వేడిమితో భగ్గుమంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 -50 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి.. మరో రెండు రోజులపాటు ఢిల్లీ, యుపి, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ప్రస్తుతం ఢిల్లీలో రెడ్ అలెర్ట్ కొనసాగుతుంది.

ఉత్తరాది రాష్ట్రాలు భానుడి భగభగలతో అల్లాడుతున్నాయి..ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, యుపి, హర్యానా, రాజస్థాన్ , పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. ఢిల్లీలో ఉదయం 8.30 గంటలకే ఆయనగర్‌లో 45.0 డిగ్రీలు, పాలం 44.5 డిగ్రీలు, లోది రోడ్ 43.4 డిగ్రీలు, సఫ్దర్జంగ్ 43.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే ఎండల తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్, హర్యానా 45 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. బుధవారం పంజాబ్ బటిండాలో అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది.
మరో రెండు రోజుల పాటు ఉత్తర భారతదేశంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది..శుక్రవారం లేదా శనివారం సాయంత్రానికి వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం వేడిగాలులు వీచే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని IMD అంచనా వేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి తేమతో కూడిన గాలుల సంగమం కారణంగా నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని దీనివల్ల వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ప్రస్తుతం పశ్చిమ రాజస్థాన్, పంజాబ్, జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, దక్షిణ హర్యానా-ఢిల్లీ, తూర్పు రాజస్థాన్, దక్షిణ ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో వేడిగాలులు వీస్తున్నాయి. పశ్చిమ రాజస్థాన్, పంజాబ్ జమ్మూ-కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వేడిగాలులు నమోదయ్యాయి. శుక్రవారం వరకు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని జూన్ 14 నుండి ఎండ వేడి గాలుల ప్రభావం క్రమంగా తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) భావిస్తుంది.
రెడ్ అలర్ట్
ఎండలు వేడిగాలుల తీవ్రత ఉన్నప్పుడు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. రెడ్ అలెర్ట్ సమయంలో అన్ని వయసుల వారికి వేడి అనారోగ్యం, వడదెబ్బ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.. రెడ్ అలర్ట్ ప్రజలు ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని సూచిస్తుంది.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపద్యంలో హైడ్రేషన్ పెంచడానికి రోజంతా ఎక్కువగా నీరు తాగాలి. ఎండ తీవ్రత అధికంగా ఉండే మధ్యాహ్నం సమయాల్లో బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేసుకోవాలని ఐఎండీ రెడ్ అలెర్ట్ సూచిస్తుంది.. గాలి తగిలే తేలికైన, వదులుగా ఉండే లేత రంగు దుస్తులను ధరించాలి..ఎండ నుంచి చర్మాన్ని రక్షించడానికి అధిక SPF ఉన్న సన్‌స్క్రీన్‌ను వాడాలి. వృద్ధులైన కుటుంబ సభ్యులు, అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు, చిన్న పిల్లలను జాగ్రత్త చర్యలు పాటించాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




