Dalai Lama: ఇంకా 40 ఏళ్లు బతుకుతా.. 90 ఏళ్ల దలైలామా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తన వారసుడి ఎంపికకు సంబంధించి ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన బౌద్ద మత గురువు.. తాజాగా తన జీవిత కాలానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 130 ఏళ్ల పాటు జీవించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తనకు స్పష్టమైన సంకేతాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

సాధారణంగా మనిషి జీవితకాలం 100 ఏళ్లుగా చెప్తారు. ప్రస్తుత ఆధునిక యుగంలో అది చాలా కష్టమైపోతుంది. కొన్ని ప్రాంతాల్లో 100ఏళ్లకు పైగా వయస్సు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో బౌద్ధ మత గురువు దలైలామ తన జీవితకాలానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 90 ఏళ్లు. ఆదివారం ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే తాను మరో 40 ఏళ్లు జీవించాలనుకుంటున్నట్లు దలైలామ చెప్పారు. తనకు అవలోకితేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయని.. ప్రజలకు సేవ చేసేందుకు 130 ఏళ్లు జీవించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవలే తన వారసుడి ఎంపికకు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తన జీవితకాలానికి సంబంధించిన చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీశాయి.
దలైలామా పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన అనుచరులు దీర్ఘాయుషు కార్యక్రమం నిర్వహించారు. దీనికి 15వేల మందికిపైగా హాజరయ్యారు. వారిని ఉద్దేశించి దలైలామా ప్రసంగించారు. ఈ సందర్భంగా 130 ఏళ్ల పాటు జీవించాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట బయటపెట్టాడు. ‘‘నాకు అవలోకితేశ్వరుని ఆశీస్సులు ఉన్నాయి. బౌద్ధ మతం కోసం ఇప్పటివరకు నా వంతు కృషి చేశాను. ఇంకా 30 నుంచి 40 ఏళ్లు జివించాలని ఆశిస్తున్నాను.’’ అని దలైలామా అన్నారు. దీంతో అనుచరుల చప్పట్లతో ప్రార్థన మందిరం మార్మోగింది. కాగా గతంలో తాను 110 ఏళ్లు బతుకుతానని దలైలామా అన్నారు.
ఇక ఇటీవలే తన వారసుడి ఎంపికకు సంబంధించిన దలైలామా కీలక ప్రకటన చేశారు. తన వారసుడిని ఎంపిక చేసే హక్కు కేవలం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ కు మాత్రమే ఉందని అన్నారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా 15వ దలైలామాను ఎంపిక చేయవద్దని చెప్పింది. అంతేకాకుండా చైనా చట్టాలకు లోబడి, బీజీంగ్ లో ఆ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేసింది. కానీ దీనిని దలైలామా కొట్టిపారేశారు. ఇటు భారత్ సైతం తన వారసుడిని ఎంపిక చేసే హక్కు దలైలామాకు తప్ప ఇంకెవరికి లేదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా దలైలామా పుట్టినరోజు వేడుకలకు కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, లాలన్ సింగ్ హాజరుకానున్నారు.