Cyclone Michaung: జలదిగ్బంధంలోనే చెన్నై శివార్లు.. నేడు స్కూల్స్, కాలేజీలకు సెలవు.. సహాయక చర్యలు వేగవంతం..
మిచౌంగ్ తుపాను శాంతించినప్పటికీ చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మరోవైపు కేంద్రం ఇప్పటికే 500 కోట్ల రూపాయలను తక్షణ సాయంగా విడుదల చేసింది. మరో 450 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది. అంతేకాదు బాధితులకు అండగా కోలీవుడ్ కదిలింది. సేవా కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు.
మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్, తిరువళ్లూరు జిల్లాల్లో తీవ్ర నష్టం సంభవించింది. చెన్నై శివార్లు ఇంకా వరద ముంపు ఎదుర్కుంటూనే ఉన్నాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేయలేకపోయారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నందున, చెన్నై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు నేడు (డిసెంబర్ 8న) సెలవు ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మైచాంగ్ తుపాను నేపథ్యంలో చెన్నైలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇతర జిల్లాల నుంచి 9,000 మంది అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. “343 చోట్ల నీటిని సరఫరా చేసే విధంగా పని జరుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. వైద్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, EN సిబ్బంది మొదలైన ఇతర జిల్లాల సిబ్బందిని పునరుద్ధరణ కోసం చెన్నైలో పని చేయాలని పిలుపునిచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు అందించేందుకు సినీ పరిశ్రమ ప్రముఖులు ముందుకొచ్చారు. భారత వైమానిక దళం బృందాలు కూడా సహాయ సామగ్రిని పంపిణీ చేశాయి. సీఎం స్టాలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తక్షణ సాయంగా రూ.5060 కోట్లు ఇవ్వాలని ఆయన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు భారీ వర్షాలతో నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే తర్వాత రాజ్‌నాథ్ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సచివాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు, వరదలతో దెబ్బతిన్న చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి, ఈ విపత్తు వల్ల సంభవించిన నష్టం, కేంద్రం నుంచి సాయం తదితర అంశాలపై చర్చించారు. రాజ్‌నాథ్ సింగ్‌వెంట కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ కూడా ఉన్నారు.
తమిళనాడులో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలని ప్రధాని మోదీ తనను ఆదేశించారని.. సీఎం స్టాలిన్‌తోనూ ఆయన ఫోన్‌లో మాట్లాడారని రాజ్‌నాథ్ చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో సహా అన్ని కేంద్ర బృందాలు సహాయక చర్యలు బాగా నిర్వహిస్తున్నాయని రాజ్‌నాథ్ తెలిపారు. చెన్నైలో వరద బాధితప్రాంతాల్లో సహాయ కార్యకలాపాల కోసం కేంద్రం 500 కోట్ల రూపాయలను ఆమోదించిందని.. రెండో విడత కింద రూ.450 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖను ప్రధాని ఆదేశించారని రాజ్‌నాథ్ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..