తిండి లేదు..చచ్చిపోతాం.. ఓ పేద కుటుంబం మొర.. ఖాకీల మానవత

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పేదల పాలిట శాపంగా మారుతోంది. పని దొరకక, తినడానికి పట్టెడన్నం లేక.. అనేకమంది ఆకలి బాధకు గురవుతున్నారు. చండీగఢ్ లో ఓ కుటుంబ దీనావస్థ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

తిండి లేదు..చచ్చిపోతాం.. ఓ పేద కుటుంబం మొర.. ఖాకీల మానవత
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 29, 2020 | 4:44 PM

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పేదల పాలిట శాపంగా మారుతోంది. పని దొరకక, తినడానికి పట్టెడన్నం లేక.. అనేకమంది ఆకలి బాధకు గురవుతున్నారు. చండీగఢ్ లో ఓ కుటుంబ దీనావస్థ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కొన్ని రోజులుగా ఇంట్లో ఆహారం లేక తాను, తన భర్త, అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ పస్తులుంటున్నామని , ఇక  భరించలేక ఆత్మహత్య చేసుకుంటామని ఓ మహిళ విలపిస్తూ పోలీసులకు ఫోన్ చేసింది. తమను ఆదుకునేవారెవరూ లేరని వాపోయింది. దీంతో చలించిపోయిన డీఎస్పీ దిల్ షేర్ సింగ్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో సహా వెంటనే ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి వారికి ఆహారాన్ని అందజేశారు. కొంత నగదు సాయం కూడా చేశారు. చంటిబిడ్డ వైద్యానికి సహాయపడతామని హామీ ఇచ్చారు. వారి ఔదార్యానికి ఆ కుటుంబం ఎంతో కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఇలా ఎంతకాలం ? ఇలాంటి అభాగ్యులను ఎవరైనా ఎంతకాలం ఆదుకుంటారు ? ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ నిర్భాగ్యుల కోసం సహాయక కేంద్రాలు ప్రారంభించాలని మానవతావాదులు కోరుతున్నారు. 21 రోజుల లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తోందా అని లక్షలాది  పేదలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. దేశంలో కరోనా కేసులు వెయ్యికి పైగా పెరిగి.. మృతుల సంఖ్య 25 కి చేరుకున్నట్టు వస్తున్న వార్తలు చూస్తుంటే ప్రభుత్వం లాక్ డౌన్ ని మరికొంతకాలం పొడిగించవచ్ఛుననే భయంకర ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా మహమ్మారి అదుపులోకి రావాలంటే ప్రజలు కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదని ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో తేల్చి చెప్పారు. యూపీ, బీహార్ ప్రభుత్వాలు వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపేందుకు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ.. మరి ఇతర రాష్ట్రాల మాటేమిటని మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు.