Corona Vaccination: హెల్త్ వర్కర్లు..ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వాక్సిన్ కోసం ఇకపై కొత్తగా ప్రత్యేక రిజిస్ట్రేషన్లు లేవు: కేంద్రం ప్రకటన
కేంద్ర ప్రభుత్వం హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చేదు వార్త చెప్పింది. కరోనా వాక్సినేషన్ లో ప్రత్యేకంగా వారికి ఇస్తున్న రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని నిలిపివేసింది.
Corona Vaccination: కేంద్ర ప్రభుత్వం హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చేదు వార్త చెప్పింది. కరోనా వాక్సినేషన్ లో ప్రత్యేకంగా వారికి ఇస్తున్న రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని నిలిపివేసింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కరోనా తీవ్రంగా విరుచుకుపడిన సమయంలో హెల్త్ వర్కర్స్ తమ అమూల్యమైన సేవలు అందించిన విషయం తెలిసిందే. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం వారి సేవలకు గుర్తింపుగా జనవరి నెలలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన వెంటనే వారికే ప్రధమ ప్రాధాన్యం ఇచ్చింది. హెల్త్ వర్కర్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కల్పించింది. అయితే, ఇప్పుడు ఆ సౌకర్యాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి తగినంత సమయం వ్యాక్సినేషన్ కు ఇవ్వడం.. 45 సంవత్సరాలకు పైబడిన ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రారంభించడం ఈ నిర్ణయానికి కారణాలుగా చెబుతున్నారు. అదేవిధంగా ఈ రెండు కేటగిరీలలో అనర్హులు కూడా లబ్ది పొందిన విషయం తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ విషయంపై మాట్లాడుతూ 45 సంవత్సరాలకు పైబడిన వ్యక్తులకు కోవిన్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా అన్నిరాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్లకు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరినట్టు తెలిపారు.
”హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్ విషయంలో ప్రభుత్వం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వారికి మొదట వ్యాక్సినేషన్ ఇవ్వడంలో పూర్తి స్థాయిలో పనిచేశాయి. మొదటి దఫా టీకా ఇచ్చిన తరువాత కూడా వారికి అవకాశం కల్పించాం. అంతేకాకుండా 60 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించినా హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు రిజిస్ట్రేషన్ లో ప్రాధాన్యత ఇచ్చాము. ఇప్పటికే చాలా సమయం వారికి ఇచ్చినందువల్ల ఇతర వర్గాలకూ వ్యాక్సిన్ అందాల్సి ఉండటం వలన ఈ నిర్ణయం తీసుకున్నాం.” అని రాజేష్ భూషణ్ వివరించారు.
వ్యాక్సినేషన్ ప్రారంభంలో హెల్త్ వర్కర్లు టీకాలు వేయించుకోవడానికి నిరాకరించారు. కానీ, ప్రభుత్వం వారిని తప్పనిసరిగా వాక్సిన్ వేసుకోవాలని హెచ్చరించడంతో వారు టీకాలు వేయించుకున్నారు. దేశంలో మొదట టీకాలు పొందిన కేటగిరీ హెల్త్ వర్కర్లు కావడం గమనార్హం.