AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Party: అన్ని సమస్యలకూ ఒక్కటే మందు.. మొన్న కర్ణాటక, నిన్న ఛత్తీస్‌గఢ్.. అదే ఫార్ములా రాజస్థాన్‌లోనూ వర్కౌట్ అవుతుందా?

కర్ణాటకలో ముఖ్యనేతలిద్దరు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందే ఆ ఇద్దరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కలసికట్టుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లోనూ కర్ణాటక తరహాలో ఆ పార్టీ ముఖ్యనేతల మధ్య విబేధాలున్నాయి.

Congress Party: అన్ని సమస్యలకూ ఒక్కటే మందు.. మొన్న కర్ణాటక, నిన్న ఛత్తీస్‌గఢ్.. అదే ఫార్ములా రాజస్థాన్‌లోనూ వర్కౌట్ అవుతుందా?
Sachin Pilot VS Ashok Gehlot
Mahatma Kodiyar
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 30, 2023 | 12:17 PM

Share

వివిధ రాష్ట్రాల్లో నిత్యకృత్యంగా మారిన అంతర్గత విబేధాల పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్టానం ఒకటే ఫార్ములాను అనుసరిస్తోంది. మొన్నటి కర్ణాటక తరహా ఫార్ములాని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లూనూ అమలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కర్ణాటకలో ముఖ్యనేతలిద్దరు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందే ఆ ఇద్దరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కలసికట్టుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లోనూ కర్ణాటక తరహాలో ఆ పార్టీ ముఖ్యనేతల మధ్య విబేధాలున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ టీఎస్ సింగ్‌ దేవ్‌ను డిప్యూటీ సీఎంగా నియమించింది. 2018లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సింగ్‌ దేవ్‌కు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు మధ్య అధికార పోరు సాగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సింగ్ దేవ్‌కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించడం ద్వారా వారిద్దరి మధ్య నెలకొన్న అంతర్గత పోరుకు ముగింపు పలకాలని పార్టీ భావిస్తోంది.  ఇక రాజస్థాన్‌లోనూ దాదాపు నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ల మధ్య ఇదే తరహాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమస్యకు కూడా చత్తీస్‌గఢ్ తరహాలోనే పరిష్కారం చూపాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జూలై 3న రాజస్థాన్ వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ కూడా హాజరుకానున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం సచిన్ పైలట్‌కు అదనపు బాధ్యతలను అప్పగించాలే యోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

2018లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సచిన్ పైలట్.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవి మాత్రం ఆయన్ను వరించలేదు. కొన్నాళ్లు డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పటికీ, అసంతృప్తితో చేసిన తిరుగుబాటు సమయంలో ఆ పదవిని కూడా వదులుకున్నారు. ఈసారి ఆయనకు మళ్లీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారా లేక చత్తీస్‌గఢ్ తరహాలో డిప్యూటీ సీఎంగా చేయడంతో పాటు పార్టీలోనూ ఏవైనా కీలక బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ జరుగుతోంది. అయితే ఇన్ని ఊహాగానాల నడుమ సచిన్ పైలట్ అకస్మాత్తుగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడం మరింత చర్చకు దారితీసింది. గత కొన్ని రోజులుగా మీడియాతో పెద్దగా మాట్లాడ్డం లేదు. ఇప్పటి వరకు ఏఐసీసీ ప్రతిపాదించిన ఏ పదవినీ స్వీకరించని ఆయన చత్తీస్‌గఢ్ తరహా ఫార్ములాకు అంగీకరిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

రెండు శిబిరాలు – వైరి వర్గాలు

చత్తీస్‌గఢ్ – రాజస్థాన్ రాష్ట్రాల్లో నెలకొన్న వర్గపోరు, అంతర్గత కలహాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో జైపూర్‌లో సచిన్ పైలట్ తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా, యాత్ర చేపట్టినట్టు చత్తీస్‌గఢ్‌లో టీఎస్ సింగ్ దేవ్ చేయలేదు. సచిన్ పైలట్ తన చర్యలతో కేవలం రాష్ట్ర నాయకత్వానికే కాదు, కేంద్ర నాయకత్వానికి కూడా సవాల్ విసురుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్ ఫార్ములా రాజస్థాన్‌లో అమలు చేస్తారా లేదా అన్నదే ప్రశ్నార్థకమైతే.. అమలు చేసినంత మాత్రాన ఎంతమేర ఫలితం ఉంటుందన్నది మరో ప్రశ్నగా మిగిలిపోతోంది. సచిన్ పైలట్ తన సొంత ప్రభుత్వంలోని అవినీతి సమస్యలపై ప్రజల్లోకి వెళ్లినందున పార్టీ హైకమాండ్ ఈ సమస్యను చాలా జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుంది. 2013లో పార్టీ పరాజయం పాలైనప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పని చేసి, 2018లో అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాటి సచిన్ పైలట్‌కు, ప్రస్తుత సచిన్‌ పైలట్‌కు మధ్య కూడా చాలా తేడా ఉంది. ఇందుక్కారణం లేకపోలేదు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో అంత కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చినప్పటికీ.. రోజుల తరబడి హైడ్రామా అనంతరం గాంధీ కుటుంబం అశోక్ గెహ్లాట్‌‌ను ముఖ్యమంత్రిని చేసింది. పైలట్ చివరికి 2020లో 19 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పైలట్ తిరుగుబాటును అశోక్ గెహ్లాట్ చాలా చాకచక్యంగా వ్యవహరించి అణిచివేయగలిగారు. కానీ ఆనాటి నుంచి పైలట్ – గెహ్లాట్ మధ్య విబేధాలు మరింత పెరుగుతూపోయాయి తప్ప తగ్గలేదు. అనేక సందర్భాలలో ఒకరిపై ఒకరు మాటల దాడిని కొనసాగించారు. ఫలితం రెండు శిబిరాల మధ్య రాజకీయ వైరానికి మించి శత్రుత్వం పెరిగింది.

రాజీ కుదిరేనా?

అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు నిర్వహించిన వివిధ సర్వేల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు మాత్రమే గెలుపొందగలదని తేలింది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. ప్రజానాడిని గమనించిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్రంలో దూకుడు పెంచి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. పెరిగిన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ‘మెహంగాయీ రాహత్’ శిబిరాలను కూడా ప్రారంభించారు. అలాగే కర్ణాటక తరహాలో ఎన్నికలకు రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని, తద్వారా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు తగినంత సమయం ఉంటుందని అధిష్టానానికి సూచిస్తున్నారు.

ఏదెలా ఉన్నా.. గెహ్లాట్ – పైలట్ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ఇంతకాలంగా విఫలమైందనే చెప్పాలి. జూలై 3న జరిగే సమావేశంలో ఇద్దరి మధ్య రాజీ కుదిరితే తప్ప పార్టీ ఎన్నికల్లో కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేని స్థితిలోకి జారుకుంటుంది. అందుకే జులై 3న ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యనేతలిద్దరి మధ్య రాజీ కుదిర్చి కలసికట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేలా చేయాలని అధిష్టానం భావిస్తోంది. అయితే ఇది అంత తేలిగ్గా పరిష్కారమయ్యే సమస్య కాదని అధిష్టానం పెద్దలకు తెలుసు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ పైలట్ తన సొంత ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణల కారణంగా ఏర్పడ్డ అప్రతిష్టను చెరిపేసుకోవడం ఓ పెద్ద సవాల్‌గా మారుతుంది. అవినీతి, యువత భవిష్యత్తు విషయంలో తాను రాజీ పడే ప్రసక్తే లేదని పైటల్ ఇప్పటికీ చెబుతున్నారు. సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు కల్గిన యువనేత పైలట్ కాస్త పట్టువిడుపు ధోరణితో ముందుకెళ్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా మొన్న కర్ణాటక, నిన్న ఛత్తీస్‌గడ్, రేపు రాజస్థాన్‌లో నెలకొన్న అన్ని అంతర్గత సమస్యల పరిష్కారానికి  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకే ఫార్ములాను ఎంచుకుంటోంది. మరి అన్ని సమస్యలకు ఒకటే మందు పనిచేస్తుందో? లేదో? వేచిచూడాల్సిందే..

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..