AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CONGRESS PRESIDENT: ఆసక్తి రేపుతున్న అధ్యక్ష ఎన్నిక.. ససేమిరా అంటున్న రాహుల్ దిగొస్తారా ? రాకపోతే ఆయనే నెక్స్ట్ ప్రెసిడెంట్!

సుదీర్ఘ పాదయాత్రతో పార్టీలో పునరుత్తేజం నింపి, పార్టీకి పునర్వైభవం తేవాలని ప్రయత్నిస్తున్న రాహుల్.. అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదన్న దిశగానే సంకేతాలిస్తున్నారు. అంటే పార్టీ అధ్యక్ష పదవి...

CONGRESS PRESIDENT: ఆసక్తి రేపుతున్న అధ్యక్ష ఎన్నిక.. ససేమిరా అంటున్న రాహుల్ దిగొస్తారా ? రాకపోతే ఆయనే నెక్స్ట్ ప్రెసిడెంట్!
Congress President Election
Rajesh Sharma
|

Updated on: Sep 22, 2022 | 9:08 PM

Share

CONGRESS PRESIDENT ELECTION IN CONGRESS PARTY BECOMING INTERESTING: ఇంతకీ రాహుల్ గాంధీ(Rahul Gandi) ఏఐసీసీ(AICC) ప్రెసిడెంటు ఎలెక్షన్ రేసులో వున్నట్టా ? లేనట్టా ? ఒకవేళ రాహుల్ కాకపోతే ఎవరికి అవకాశం దక్కుతుంది ? సోనియా(Sonia Gandhi) ఆశీస్సులతో అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) అఖిల భారత కాంగ్రెస్ అధినేత అవుతారా ? లేక తనదైన శైలిలో చక్రం తిప్పుతున్న కేరళ లీడర్ శశిధరూర్(Shashi Tharoor) పార్టీ ప్రెసిడెంటు అవుతారా ? ఇపుడు ఈ ప్రశ్నల పరంపర ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నేతల మదిలో మెదులుతోంది. ఓవైపు వివిధ రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలన్నీ వరుసబెట్టి రాహుల్ గాంధీనే ప్రెసిడెంటు కావాలంటూ తీర్మానాలు చేస్తున్నాయి. ఇదంతా ఓ వ్యూహం ప్రకారం జరుగుతోందా లేక అందరూ కలిసి రాహుల్‌నే కావాలని కోరుకుంటున్నారా ? ఇది తేలాలంటే లోతైన విశ్లేషణ అవసరం. అయితే రాహుల్ మదిలో ఏముందన్నది ఆయనకూ, ఆయన మాతృమూర్తి సోనియమ్మకు మాత్రమే తెలుసని ఏమాత్రం రాజకీయ అవగాహన వున్నవారైనా చెప్పేస్తారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగితే అక్టోబర్ 17న గానీ, అక్టోబర్ 19న (పోలింగ్ జరగాల్సి వస్తే కౌంటింగ్ డే) గానీ ఫలితం వెల్లడి కానున్నది. ప్రస్తుతానికి రేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి, కురువృద్ధ నేత అశోక్ గెహ్లాట్, మాజీ కేంద్ర మంత్రి, కేరళ కాంగ్రెస్ నేత శశిధరూర్ వున్నట్లు కనిపిస్తోంది. ఇంకోవైపు తానూ అధ్యక్ష రేసులో వున్నానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) కూడా చెబుతున్నారు. ఇలా ఎందరి పేర్లు రేసులో వినిపిస్తున్నా.. ఒకసారి రాహుల్ రంగంలోకి దిగితే పరిస్థితి తారుమరు కాక తప్పదు. అయితే, సుదీర్ఘ పాదయాత్రతో పార్టీలో పునరుత్తేజం నింపి, పార్టీకి పునర్వైభవం తేవాలని ప్రయత్నిస్తున్న రాహుల్.. అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదన్న దిశగానే సంకేతాలిస్తున్నారు. అంటే పార్టీ అధ్యక్ష పదవి తాను చేపట్టడం కంటే.. పార్టీకి పునర్వైభవం వస్తే ప్రధాని రేసులోకే నేరుగా రావాలని ఆయన భావిస్తూ వుండవచ్చు.  పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రహసనం ఎలా వున్నా రాహుల్ మాత్రం తన పాదయాత్రను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పలు వర్గాలను కలుపుకుని నడుస్తూ.. మధ్యలో మధ్యలో తనను కలిసేందుకు, సంఘీభావం వ్యక్తం చేసేందుకు వస్తున్న వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో సంభాషిస్తూ ఆయన పాదయాత్ర ఉత్సాహభరితంగా కొనసాగిస్తున్నారు.

రాహుల్ అభిమతం ఎలా వున్నా.. అశోక్ గెహ్లాట్ మాత్రం ప్రెసిడెంటు పదవిని చేపట్టేందుకు సంసిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి అశోక్ గెహ్లాట్ పేరు తొలుత తెరమీదికి వచ్చినపుడు తనకు పార్టీ ప్రెసిడెంటు పదవి కంటే రాజస్థాన్ సీఎం పదవే ముఖ్యమని, ఆ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే సంవత్సరం (2023లో) జరగనున్న ఎన్నికల్లో పార్టీని మరోసారి విజయం దిశగా అడుగులే వేయించాల్సిన గురుతర బాధ్యత తనమీద వుందని గెహ్లాట్ చెప్పుకొచ్చారు. ఆనాటి మాటల్లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడితే.. అక్కడ సచిన్ పైలట్ (Sachin Pilot) కీలక నేతగా ఎదుగుతాడన్న భయమే ఎక్కువగా కనిపించింది. సచిన్ పైలట్ చాలా కాలంగా సీఎం సీటుపై కన్నేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ దాాటిన వెంటనే యంగ్ సీఎంగా తనకు అవకాశం ఇవ్వాలని సచిన్ పైలట్ రాయబారాలు నెరిపారు. యువ నేతగా తనకు ఛాన్సిస్తే కనీసం రెండు దశాబ్దాల పాటు రాజస్థాన్ కాంగ్రెస్ (Congress Party) గుప్పిట్లో వుండేలా చూసుకోగలనంటూ పైరవీలు చేసుకున్నారు. ఓ దశలో రాహుల్ కూడా సచిన్‌కు సీఎం సీటునిచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని వినిపించింది. కానీ గెహ్లాట్ ఆఖరి నిమిషంలో తన అనుభవాన్నంతా రంగరించి నెరపిన మంత్రాంగం ఫలితమిచ్చింది. ఆయనకే ముఖ్యమంత్రి పీఠం దక్కేలా చేసింది. అయితే గత మూడున్నరేళ్ళుగా సచిన్ పైలట్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే వున్నారు. గెహ్లాట్ తన పదవిని రక్షించుకుంటూ వస్తూనే వున్నారు.  గెహ్లాట్ వున్నంత కాలం తనకు సీఎంగా అవకాశం రాదని భావించిన సచిన్ పైలట్ పలు సందర్భాలలో బీజేపీకి దగ్గరవుతున్నట్లు కనిపించారు. కానీ ఇప్పటివరకు ఆయన పార్టీ మారలేదు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Sindia)కు గాలెం వేయడం ద్వారా అక్కడ కమల్ నాథ్ (Kamalnath) సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీ (BJP).. ఆ తర్వాత ఆపరేషన్ రాజస్థాన్‌ (Operation Rajastan)ను చేపట్టి, సచిన్ పైలట్ లక్ష్యంగా పావులు కదుపుతుందని అనుకున్నారు. కానీ బీజేపీ ప్రయత్నాలకు సచిన్ లొంగలేదు. భవిష్యత్తుపై ఆశతో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. సొంత రాష్ట్రంలో తిరుగులేని నేతగా వున్న గెహ్లాట్ ఇపుడు జాతీయ అధ్యక్షునిగా అవతరిస్తే అది సచిన్‌కు ఒకింత లాభమే అయినా.. జాతీయ అధ్యక్షుని హోదాలో రాజస్థాన్‌లో గెహ్లాట్ తన వర్గానికి, తన చెప్పు చేతల్లో వుండే వ్యక్తికి అవకాశాలు కల్పిస్తే అప్పుడు సచిన్ పైలట్ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకమే. తాజాగా ఏఐసీసీ ప్రెసిడెంటు పదవిపై తనకు ఆసక్తి లేదన్నట్లు మాట్లాడిన గెహ్లాట్ తాజాగా అందరు కోరితే సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్దమని అంటున్నారు.

ఇక పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ముందుకొచ్చిన కేరళ కాంగ్రెస్ నేత, ఆంగ్ల భాషా కోవిదుడు శశిధరూర్.. తాజాగా సోనియాగాంధీని కలిసి తన అభిమతాన్ని తెలియజేశారు. ఒక వేళ రాహుల్ అధ్యక్ష బాధ్యతల నుంచి దూరంగా వుండాలనే భావిస్తే తాను రేసులో వుంటానని, అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తానని ఆయన వెల్లడించారు. అయితే, అశోక్ గెహ్లాట్, శశిధరూర్‌ల అభ్యర్థిత్వాలను పోలిస్తే గెహ్లాట్ వైపే మెజారిటీ నేతలు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు రాహులే పార్టీకి సారథ్యం వహించాలని పలు పీసీసీలు తీర్మానాలు చేసి పంపుతున్నాయి. తెలంగాణ పీసీసీ కూడా రెండు రోజుల క్రితం తీర్మానం చేసి పంపింది. పీసీసీల తీర్మానాలను రాహుల్ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆ లెక్కన చూస్తే అశోక్ గెహ్లాట్ అవకాశాలు రోజు రోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సోనియా ఆశీస్సులు ఆయనకు వుండడమే అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రజాస్వామిక విధానంలో జరిగిందని చాటుకునేందుకు శశిధరూర్‌ని ఎన్నికల బరిలో వుండేలా చూసినా.. గెహ్లాట్ అభ్యర్థిత్వానికే మెజారిటీ పార్టీ నేతలు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇపుడున్న పరిస్థితిని ఆకళింపు చేసుకుంటే .. రాహుల్ తన అభిమతాన్ని మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తదుపరి ప్రెసిడెంటుగా అశోక్ గెహ్లాట్‌ను చూడడం ఖాయం.