AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెరపైకి మరో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్.. ప్రధాని.. రాష్ట్రపతికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ..

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు దేశంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తోంది. దక్షిణ కర్ణాటక ప్రభుత్వం తమ ప్రాంతంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది.ఎమ్మెల్యే రాజు కేజ్ ఏకంగా రాష్ట్రపతి, ప్రధానికే లేఖ రాయడం ద్వారా ఈ నినాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

తెరపైకి మరో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్.. ప్రధాని.. రాష్ట్రపతికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ..
Mla Raju Kage
Krishna S
|

Updated on: Nov 12, 2025 | 1:06 PM

Share

ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్ మరోసారి బలంగా తెరపైకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే రాజు కేజ్ ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడం ద్వారా ఈ ఉద్యమానికి మళ్లీ ఊపిరి పోశారు. ఎమ్మెల్యే రాజు కేజ్ లేఖ అనంతరం ఉత్తర కర్ణాటక హోరాట సమితి(UKHS), ఉత్తర కర్ణాటక వికాస్ వేదిక వంటి సంఘాలు తమ డిమాండ్లను మరింత తీవ్రతరం చేశాయి. బెల్గాంలో జరగనున్న శీతాకాల సమావేశాల్లో తమ మూడు ప్రధాన డిమాండ్లను నెరవేర్చకపోతే కర్ణాటక శాసనసభ భవనంపై ప్రత్యేక రాష్ట్ర జెండాను ఎగురవేస్తామని హెచ్చరించడం సంచలనం సృష్టించింది.

ఎమ్మెల్యే లేఖలో ఏముంది..?

ఎమ్మెల్యే రాజు కేజ్ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఉత్తర కర్ణాటకను రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. మొత్తం 15 జిల్లాలతో కూడిన ఉత్తర కర్ణాటకను వేరు చేయాలని ఆయన అభ్యర్థించారు. బీదర్, కలబురగి, విజయపుర, యాద్గిర్, బాగల్‌కోట్, బెళగావి, ధార్వాడ్, గడగ్, కొప్పల్, రాయచూర్, ఉత్తర కన్నడ సహా పలు జిల్లాలు ఉన్నాయి. సమగ్ర అభివృద్ధి కోసమే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అని ఆయన అన్నారు.అభివృద్ధి విషయంలో ఉత్తర కర్ణాటక జిల్లాలకు అన్యాయం జరుగుతుందని.. దక్షిణ కర్ణాటక ప్రభుత్వం సవతి తల్లి వైఖరితో వివక్ష చూపుతోందని ఆయన లేఖలో ఆరోపించారు.

ఈ విధంగా ఉత్తర కర్ణాటక హోరాట సమితి పోరాటానికి ఎమ్మెల్యే కేజ్ బహిరంగంగా మద్దతు తెలిపారు. రాబోయే శీతాకాల సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని చర్చిస్తానని ఆయన స్పష్టం చేశారు. దివంగత నాయకుడు ఉమేష్ కత్తి మరణం తర్వాత ఈ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని బలంగా వినిపిస్తున్న తొలి ఎమ్మెల్యేగా రాజు కేజ్ నిలిచారు. గతంలో ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రం డిమాండ్‌ను బలంగా వినిపించిన దివంగత నాయకుడు ఉమేష్ కత్తి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి.

“రాష్ట్ర జనాభా 2.5 కోట్ల నుంచి 6.5 కోట్లకు పెరిగింది. జనాభా పెరిగే కొద్దీ రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో రెండు, ఉత్తరప్రదేశ్‌లో ఐదు, మహారాష్ట్రలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి. దేశం మొత్తం 50 రాష్ట్రాలుగా విభజించాలి. ప్రధానమంత్రి ఈ విషయం గురించి ఆలోచించారని నేను భావిస్తున్నాను’’ అని అప్పట్లో ఉమేష్ కత్తి అన్నారు. ఉత్తర కర్ణాటకకు అన్యాయం జరిగినప్పుడు నేను నా స్వరాన్ని వినిపిస్తాను. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా మారాలి లేదా అభివృద్ధి చెందాలి అని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..