AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Gandhi: అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలు.. పలు రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌ల మార్పు

దేశంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పరాజయం చవిచూసింది. దాంతో.. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రాల వారీగా అధ్యక్షులను మార్పులు చేర్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Priyanka Gandhi: అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలు.. పలు రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌ల మార్పు
Priyanka Gandhi
Balaraju Goud
|

Updated on: Dec 24, 2023 | 5:28 PM

Share

దేశంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పరాజయం చవిచూసింది. దాంతో.. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రాల వారీగా అధ్యక్షులను మార్పులు చేర్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న అధ్యక్ష పదవుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టింది.

ప్రస్తుతం ఉత్తర్‎ప్రదేశ్ బాధ్యతలు చూస్తున్న ప్రియాంకగాంధీని ఆ స్థానం నుంచి తప్పించడం ఆసక్తిగా మారింది. ప్రియాంకను తప్పించి.. యూపీ బాధ్యతలను అవినాశ్‌ పాండేకు కట్టబెట్టింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఇప్పటివరకూ పార్టీలో ప్రధాన భూమిక పోషించిన ప్రియాంకకు ఎలాంటి బాధ్యతలూ అప్పగించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కాంగ్రెస్ ఇప్పుడు ప్రియాంక గాంధీ స్థానంలో నాగ్‌పూర్ వాసి అవినాష్ పాండేకు ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది. అవినాష్ ప్రస్తుతం జార్ఖండ్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ మార్పు కీలకంగా మారనుంది. ప్రస్తుతం ప్రియాంక గాంధీకి ఎలాంటి బాధ్యత‌లు అప్పగించలేదు కాంగ్రెస అధిష్టానం.

అయితే.. ప్రియాంకగాంధీ సేవలను ఇకపై దేశవ్యాప్తంగా వినియోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. దానిలో భాగంగానే.. ఆమెను ఒక రాష్ట్రానికే పరిమితం చేయకుండా ఆ బాధ్యతల నుంచి విముక్తి కల్పించినట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. దాంతో పాటు.. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీకి కంచుకోటగా మారి.. కాంగ్రెస్‌ ఆశించిన ఫలితాలు సాధించలేక పోతోంది. ఆ వైఫల్యం ప్రియాంక అకౌంట్‌లో పడుతుండడంతో ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఆ తర్వాత.. ఏ బాధ్యతలు అప్పగించాలనే విషయాన్ని చూసుకోవచ్చని అధిష్టానం నిర్ణయించింది. అందుకే, కాంగ్రెస్‌ సంస్థాగత మార్పుల్లో ప్రియాంకగాంధీకి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని ఆ పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ బేరర్లను ప్రకటించినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రియాంక. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీకి యూపీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కాంగ్రెస్‌కు రాయ్‌బరేలీ సీటు మాత్రమే లభించింది. అలాగే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఏడు నుంచి రెండుకు తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌కు దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ఇంచార్జిపై రకరకాల చర్చలు జరిగాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ప్రకటించారు. ఇందులో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అవినాష్‌ పాండేకు ఉత్తరప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే గతంలో రాజస్థాన్ ఎన్నికల ఇన్‌స్పెక్టర్‌గా, గుజరాత్, జార్ఖండ్‌లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. తొలిసారిగా 1985-89 మధ్య మహారాష్ట్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. జూలై 2010లో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…