Congress: రాహుల్ పాదయాత్ర.. అధ్యక్ష ఎన్నికల సందడి.. నిరసనల్లోనూ టాప్ గేర్.. కాంగ్రెస్‌లో కొత్త జోష్
కాంగ్రెస్ ట్రాక్ ఎక్కినట్టే కనిపిస్తోంది.. ఓవైపు రాహుల్ పాదయాత్ర.. మరోవైపు ప్రెసిడెంట్ ఎన్నికల సందడి ఆ పార్టీలో జోష్ నింపుతున్నాయి. అటు నిరసనల్లోనూ తగ్గేదే లే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.

Rahul Gandhi: రాహుల్‌గాంధీ జోడో యాత్ర(Jodo Yatra) హుషారుగా సాగుతోంది. కాస్త విరామం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత.. శనివారం కేరళ(Kerala) పెరంబ్ర నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. దారిపొడవునా అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు రాహుల్‌గాంధీ. ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఉత్తరాఖండ్ రిషికేష్ ఘటనను తీవ్రంగా ఖండించారు రాహుల్‌గాంధీ. మరోవైపు.. కాంగ్రెస్‌లో అధ్యక్ష ఎన్నికల రేసు మొదలైంది. ఇందుకోసం శశిథరూర్ తొలి అడుగు వేశారు. కాంగ్రెస్‌లో చీఫ్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీ నుంచి థరూర్ ప్రతినిధులు- నామినేషన్ పత్రాలు స్వీకరించారు. తన అభ్యర్థిత్వానికి ఐదు సెట్ల పత్రాలు కావాలని మిస్త్రీకి థరూర్ లేఖ రాశారు. ఇకపోతే.. విపక్షాల్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. RJD చీఫ్ లాలూప్రసాద్, బీహార్ CM నితీష్ కుమార్ రేపు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని కలువనున్నారు. ఇప్పటికే లాలూ యాదవ్ హస్తినకు చేరుకున్నారు. విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు లాలూ. తాను, నితీష్ కలసి సోనియాతో చర్చిస్తామని చెప్పారు. మోదీ సర్కార్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తామని చెప్పారు.
ఇక.. నిరసనల్లోనూ టాప్ గేర్‌తో దూసుకెళ్తోంది కాంగ్రెస్. కేరళలో యూత్ కాంగ్రెస్ చేపట్టిన నిరసన రణరంగాన్ని తలపించింది. యూత్ కాంగ్రెస్ నేతల అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. ఆందోళనకు దిగింది క్యాడర్. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు నేతలు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. చివరకు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి