Congress – Election Commission: ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టులో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

కేంద్ర ఎన్నికల సంఘానికి , కాంగ్రెస్‌కు మధ్య వివాదం మరింత ముదిరింది. ఎన్నికల నిర్వహణ నియయాలను ఈసీ సవరించడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల బోగస్‌ ఓట్లను చేర్పించారన్న వార్తల్లో నిజం లేదని ఈసీ స్పష్టం చేసింది.

Congress -  Election Commission: ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టులో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
Congress - Election Commission
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 24, 2024 | 9:45 PM

కేంద్ర ఎన్నికల సంఘానికి , కాంగ్రెస్‌కు మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే.. ఎన్నికల నిర్వహణపై పలు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఎన్నికల నిర్వహణ నియమాలను సవరిస్తూ ఎన్నికల సంఘం ఇటీవల జారీ చేసిన ఆదేశాలను కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎన్నికల ప్రక్రియపై నిజాయితీ వేగంగా తుడిచిపెట్టుకుపోతోందని, దాన్ని పునరుద్ధరించడంలో సుప్రీంకోర్టు తోడ్పాటు అందించగలదని పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేష్‌ తెలిపారు.

ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌, వెబ్‌కాస్టింగ్‌ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలను కేంద్ర న్యాయశాఖ సవరించింది.

ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా, ప్రజలతో సంప్రదింపులు లేకుండా ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పులు చేయడం దారుణమంటూ కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు.

అయితే, ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.. ప్రతి నియోజకవర్గంలో 10 వేల బోగస్‌ ఓట్లను చేర్పించారన్న ఆరోపణల్లో నిజం లేదని కూడా ఎన్నికల సంఘం వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేేయండి..