Coimbatore Blast: పొలిటికల్ టర్న్ తీసుకున్న కోయంబత్తూర్ కారు పేలుడు.. కోర్టుకు చేరిన బంద్ రచ్చ..
కోయంబత్తూర్ కారు పేలుడు ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ వర్సెస్ డీఎంకే కొట్లాటగా మారి... ఈ పంచాయతీ కాస్తా కోర్టు పంచకు చేరింది. దర్యాప్తుపై కూడా సందేహాలు మొదలయ్యాయి.
ఈనెల 23న కారు బాంబు పేలుడు జరిగిన తర్వాత నుంచీ కోయంబత్తూరు గంభీరంగానే ఉంది. ఘటన వెనుక ఉగ్రకోణం ఉందన్న అనుమానంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఎన్‌ఐఏ దర్యాప్తు కోసం డిమాండ్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఈ క్రమంలో స్థానికంగా బీజేపీ బంద్‌కు పిలుపునివ్వడంతో ఈ అంశం కొత్త మలుపు తీసుకుంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ, తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో ఈనెల 31న కోయంబత్తూరు వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది బీజేపీ. కానీ.. బంద్ పేరుతో నగర వాసులపైనా, పరిశ్రమలపైనా ఒత్తిడి తెస్తున్నారంటూ ఒక వెంకటేశ్ అనే వ్యాపారి కోర్టుకెక్కారు.
దీంతో.. సోమవారం నాడు బంద్ జరగనివ్వకుండా యాక్షన్ తీసుకోవాలంటూ హైకోర్టు నుంచి కోయంబత్తూరు పోలీసుల్ని ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు, కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ ఈ బంద్ విషయంలో పట్టుదల మీదున్నారు. ఆరునూరైనా బంద్ చేసే తీరతామని ప్రకటించారు.
అటు… 3 వేల మంది పోలీసులతో కోయంబత్తూరులో పహారా జరుగుతోంది. నలువైపులా 40 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేసును చెన్నైలోని పూనమల్లై ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. నిందితుడు మొబిన్ నివాసంలో మరోసారి సోదాలు చేసి… పేలుడు పదార్థాల్ని, 109 వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసి, సిటీలో అనుమానాస్పదంగా ఉన్న 12 కార్లను గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం