AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది.. మహిళా అభ్యర్థి మెడలో పూలమాల వేసిన సీఎం.. వీడియో వైరల్..

ముజఫర్‌పూర్‌ ర్యాలీలో ఎన్డీఏ అభ్యర్థి రమా నిషాద్‌ మెడలో సీఎం నితీష్ కుమార్ పూలమాల వేయడం చర్చనీయాంశమైంది. ఈ వీడియోను షేర్ చేస్తూ తేజస్వి యాదవ్ సీఎం ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేయగా, పప్పు యాదవ్ కూతుళ్లకు దండ వేయకూడదా? అంటూ మద్దతు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదేందయ్యా ఇది.. మహిళా అభ్యర్థి మెడలో పూలమాల వేసిన సీఎం.. వీడియో వైరల్..
Nitish Kumar's Garland Mistake In Muzaffarpur
Krishna S
|

Updated on: Oct 22, 2025 | 10:47 AM

Share

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో సీఎం నితీశ్ ఆరోగ్య పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆరోగ్యంపై గత కొన్నాళ్లుగా విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వాడనలకు బలం చేకూరుస్తూ ముజఫర్‌పూర్‌ ఎన్నికల ర్యాలీలో సీఎం వ్యవహరించిన తీరుపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ అభ్యర్థి రమా నిషాద్‌ను సన్మానించడానికి బదులుగా, ఆమె మెడలో పూలమాల వేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఎక్స్‌ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నితీష్ కుమార్ ఆరోగ్యం గురించి పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తారు. “ఆయన నిజంగా వింతైన వ్యక్తి. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉంటే, రాసిన నోట్‌లోని ప్రసంగాన్ని ఎందుకు చదువుతున్నారు? ఆయన ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?” అని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. మాజీ ఎంపీ పప్పు యాదవ్ ఈ సంఘటనపై భిన్నంగా స్పందించారు. “మనం కూతుళ్లకు దండలు వేయకూడదా.. దేవతలకు దండలు వేయకూడదా..? దీన్ని ఎందుకు సమస్యగా చేస్తున్నారు? నితీష్ కుమార్ అలా చేస్తుంటే సమస్య ఏమిటి? అని ప్రశ్నించారు.

భారతీయ జనతా పార్టీ ఔరాయ్ అసెంబ్లీ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్‌సురత్ రాయ్‌కు టికెట్ నిరాకరించి.. మాజీ ఎంపీ అజయ్ నిషాద్ భార్య రమా నిషాద్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన రాయ్ స్థానంలో శక్తివంతమైన నిషాద్ రాజకీయ కుటుంబం నుండి వచ్చిన రమా నిషాద్‌ను నిలబెట్టడం గమనార్హం. టికెట్ నిరాకరణతో అసంతృప్తి చెందిన మాజీ మంత్రి రామ్‌సూరత్ రాయ్ సోషల్ మీడియాలో తన నిరాశను వ్యక్తం చేశారు. గత 2020 ఎన్నికల్లో గ్రాండ్ అలయన్స్ అభ్యర్థిపై 48,000 ఓట్ల తేడాతో విజయం సాధించానని, ఇది అతిపెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్లుగా నియోజకవర్గానికి విస్తృతంగా సేవ చేశానని గుర్తు చేశారు. అయినప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

శక్తివంతమైన రాజకీయ కుటుంబం

రమా నిషాద్ రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుండి వచ్చారు. ఆమె భర్త అజయ్ నిషాద్ ముజఫర్‌పూర్ మాజీ ఎంపీ. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరించబడడంతో గత సంవత్సరం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన అజయ్ నిషాద్ పరాజయం తరువాత తిరిగి బిజెపి గూటికి చేరారు.

రమా నిషాద్ మామ కెప్టెన్ జై నారాయణ్ ప్రసాద్ నిషాద్.. బీహార్ రాజకీయాల్లో సుపరిచితులు. ఆయన నాలుగుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మరణానంతరం, అజయ్ నిషాద్ బీజేపీ టికెట్‌పై రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు ఔరాయ్ అసెంబ్లీ స్థానం నుండి రమా నిషాద్‌ను నిలబెట్టడం ద్వారా నిషాద్ కుటుంబంపై బీజేపీ తన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. నితీష్ కుమార్ చర్యపై ప్రతిపక్ష విమర్శలు, బీజేపీ టికెట్ల కేటాయింపుపై అసంతృప్తులు వెరసి, బీహార్ ఎన్నికల ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది.