పగతో టీచర్‌నే లేపేయ్యాలని ప్లాన్.. క్లాస్‌లో కుర్చీ కింద బాంబు పెట్టి బ్లాస్ట్! ఆ తర్వాత ఏం జరిగిందంటే?
విద్యాబుద్ధులు నేర్పి, సన్మార్గంలో నడిపే టీచర్ మందలించిందని విద్యార్ధులు పగబట్టారు. ఆమెపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్లాన్ వేశారు. తరగతి పాఠాలు చెబుతుండగా.. ఆమె కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చేశారు. ఈషాకింగ్ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది..
హర్యాణా, నవంబర్ 17: చక్కగా పాఠాలునేర్పి, జీవితానికి బాటలు వేసే టీచర్లు.. విద్యార్ధుల క్షేమం కోరి వారిని సరైన మార్గంలో పెట్టేందుకు ఆడపా దడపా పనీష్‌మెంట్‌లు ఇవ్వడం మనందరి జీవితంలో అనుభవమే. అయితే తమను దండించిందన్న కోసంతో 12వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు మహిళా సైన్స్ టీచర్‌పై పగపెంచుకున్నారు. అంతేనా.. అదును చూసి ఆమెను లేపెయ్యాలని పథకం పన్నారు. దీనిలో భాగంగా టీచర్ కుర్చీ కింద బాణసంచా లాంటి ఓ బాంబును పెట్టి, పేల్చేశారు. అయితే టీచర్ మాత్రం చాకచక్యంగా వీరికుట్ర నుంచి బయటపడింది. ఈ దారుణానికి ఒడిగట్టిన విద్యార్ధులను ప్రిన్సిపల్ స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ షాకింగ్ ఘటన హర్యాణాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
హర్యానాకు చెందిన ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 13 నుంచి 15 విద్యార్థుల్ని మహిళా సైన్స్ లెక్చరర్ మందలించారు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు లెక్చరర్‌పై ప్రాంక్ పేరుతో ప్రతీకారం తీర్చుకునేందుకు పథకం పన్నారు. యూట్యూబ్ సహాయంతో ఫైర్ క్రాకర్స్ తరహాలో ఉండే పేలే రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేయడం చేసి, దీనిని క్లాస్ రూంకి తీసుకువచ్చారు. ప్లాన్ ప్రకారం.. టీచర్ వచ్చి కుర్చీలో కూర్చోగానే ఒక విద్యార్థి కుర్చీకింద బాణసంచా లాంటి బాంబును అమర్చి వచ్చి తన సీటులో కూర్చున్నారు. ఇంతలో మరొకరు రిమోట్ కంట్రోల్‌ని ఉపయోగించి బాంబును పేల్చాడు. దీంతో భారీ శద్ధంతో పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తు తృటిలో టీచర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళా లెక్చరర్‌కు తోటి లెక్చరర్లు మద్దతుగా నిలిచారు. ఇలాంటి ఆకతాయి పనులు పునరావృతం కాకుండా ఉండేలా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.
దీనిపై స్పందించిన హర్యానా విద్యా శాఖ నిర్ణయాత్మక చర్య తీసుకుంది. బాంబు పేల్చడంలో పాలుపంచుకున్న 13 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేసింది. అంతేకాకుండా విద్యా శాఖ అధికారులు వెంటనే పాఠశాలను సందర్శించి సమగ్ర విచారణ ప్రారంభించారు. పిల్లల తల్లిదండ్రులు క్షమాపణలు చెప్పి, భవిష్యత్తులో ఈ విధంగా ప్రవర్తించబోరని హామీ ఇచ్చారు. ఘటన అనంతరం గ్రామంలో పంచాయతీ కూడా పెట్టి విద్యార్థుల వికృత చేష్టలపై చర్చించారు. పంచాయితీ సందర్భంగా 15 మంది విద్యార్థుల్లో 13 మందికి దీనితో సంబంధం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి విద్యార్ధులను వారం పాటు సస్పెండ్ చేసిన అధికారులు.. వారిపై అదనపు చర్యలు తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్యకు పాల్పడిన విద్యార్థులను బాధిత మహిళా టీచర్ క్షమించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి నరేష్ మెహతా తెలియజేశారు.