TGPSC Group 3 Exams: టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలకు జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లు జారీ.. ఇబ్బందులొస్తే ఫోన్ చేయండి
తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలు మరో మూడు రోజుల్లో జరగనున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలైనప్పటికీ కొందరు అభ్యర్ధులకు వీటిని డౌన్ లోడ్ చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. దీంతో తాజాగా కమిషన్ జిల్లాల వారీగా హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను జారీ చేసింది..
హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే కమిషన్ విడుదల చేసింది కూడా. అయితే కొందరు అభ్యర్ధులకు హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురవడంతో.. ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. అలాగే టీజీపీఎస్సీ కార్యాలయం కూడా హెల్ప్‌లైన్ నంబర్లను జారీ చేసింది. ఏదైనా సమస్య తలెత్తితే 040-22445566 లేదా 23542185 లేదా23542187 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. లేదంటే helpdesk@tspsc.gov.inకు మెయిల్ చేయవచ్చు. అన్ని పని దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్ధులు ఫోన్ చేసి తమ సందేహాలను నివృతి చేసుకోవచ్చు.
తెలంగాణ గ్రూప్ 3 రాత పరీక్ష హెల్ప్‌లైన్ నంబర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రోజుకు రెండు సెషన్లలో గ్రూప్ 3 పరీక్షలు జరుగుతాయి. నవంబర్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 18వ తేదీన పేపర్ 3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 3 పేపర్లకు గ్రూప్ 3 పరీక్షలు జరుగుతాయి. తెలంగాణలో దాదాపు 1380కి పైగా గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. రాత పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
తెలంగాణ గ్రూప్ 3 రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలో మొత్తం 3 పేపర్లకు ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ విభాగాలపై పరీక్ష జరుగుతుంది. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్షలు జరుగుతాయి. గ్రూప్ 3 పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు. ఆఫ్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.