రూ.3 వేల కోట్ల లంచం కేసు.. ఆ ప్రభుత్వ అధికారికి మరణశిక్ష విధించిన కోర్టు
దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన లంచాలు స్వీకరించిన కేసులో చైనాకు చెందిన మాజీ అధికారి వాంగ్ యాంగ్‌కు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 1993 నుంచి 2023 వరకు ప్రాజెక్టుల కేటాయింపులు, వ్యాపార అనుమతులు, భూముల మంజూరు తదితర అంశాల్లో సహకారం అందించినందుకు ఆయన భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు కోర్టు తేల్చింది. ఈ అభియోగాల్లో దోషిగా నిర్ధారించడంతో ఈ కఠిన తీర్పు వెలువడింది. ఈ కేసు చైనాలో ఇటీవలి కాలంలో వెలుగుచూసిన అతిపెద్ద అవినీతి కేసుల్లో ఒకటిగా నిలిచింది..

చైనాలో ఓ అవినీతి తిమింగలానికి అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. టిబెట్ స్వయం పాలిత ప్రాంత ప్రభుత్వంలో వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న వాంగ్ యాంగ్ అనే అధికారి.. అతడు అధికారంలో ఉన్న సమయంలో దాదాపు రూ.3వేల కోట్ల మేర లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో వాంగ్ యాంగ్ దోషిగా తేలడంతో న్యాయస్థానం సోమవారం మరణశిక్ష విధించింది. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో 32.5 కోట్ల డాలర్ల ( అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2,700 కోట్లకు పైగా) లంచాలు అతడు తీసుకున్నట్లు కోర్టు తేల్చింది. వాంగ్ యాంగ్‌పై లంచాలు స్వీకరించడం, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం, ఇతరులకు లంచాలు ఇవ్వడం, అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్ వంటి పలు అభియోగాలు నమోదయ్యాయి. లంచాల పరిమాణం దృష్ట్యా ఇటీవలి కాలంలో వెలుగుచూసిన అతిపెద్ద అవినీతి కేసుల్లో ఇది ఒకటిగా నిలిచింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా యాంగ్‌పై విచారణ జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని జిన్‌పింగ్ తన రాజకీయ ప్రత్యర్థులను తొలగించడానికి కూడా ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టుల కేటాయింపు, వ్యాపార కార్యకలాపాలకు అనుమతులు, భూముల మంజూరు, మూలధన సదుపాయాల కోసం సహకరించినందుకు యాంగ్ లంచాలు తీసుకున్నట్లు చాంగ్‌జౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు వెల్లడించింది.1993 నుంచి 2023 వరకు యాంగ్ అక్రమంగా 2.21 బిలియన్ యువాన్లు (సుమారు 325 మిలియన్ డాలర్లు) విలువైన ఆస్తులు, నగదు స్వీకరించినట్లు కోర్టు పేర్కొంది.
విచారణ సందర్భంగా యాంగ్ తన తప్పును అంగీకరిస్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారని కోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన బహిరంగ విచారణలు మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు విడతలుగా జరిగాయి. విచారణ సమయంలో 30 మందికిపైగా న్యాయస్థానం ఎదుట హాజరైనట్లు కోర్టు తెలిపింది. యాంగ్ వ్యక్తిగత ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని, అతను లంచాల రూపంలో పొందిన మొత్తం డబ్బును తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కాగా చైనాలో చట్టాలు కాస్త కఠినంగానే ఉంటాయి. లంచం, అవినీతి అనే పదాలు మన దేశంలో నిత్య ఊత పదాలుగా మారిపోయాయి. తొలినాళ్లలో కాస్త హడావిడి చేసినా.. ఆ తర్వాత అవి కాలగర్భంలో కలిపిపోతుంటాయి. కానీ చైనాలో అలాకాదు. అవినీతి కేసుల్లో ఇప్పటికే అనేక మంది అధికారులకు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. 2021లో ప్రభుత్వ రంగ సంస్థ పార్టీ కార్యదర్శి లై షియామిన్ లంచాలు, అవినీతి, ద్వివివాహం కేసుల్లో దోషిగా తేలడంతో చైనా దేశంలోని కోర్టు మరణశిక్ష అమలు చేసింది. అలాగే 2024లో ఇన్నర్ మంగోలియాకు చెందిన స్థానిక అధికారి లీ జియాన్‌పింగ్ కూడా అవినీతి, లంచాల కేసుల్లో దోషిగా తేలడంతో ఉరిశిక్ష అమలు చేశారు.




