శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. ప్రత్యేకత ఏంటి? దర్శనాలు ఎప్పటి వరకు?
Sabarimala Ayyappa Darshan: చింగం మాసం, మలయాళ నూతన సంవత్సరం ప్రారంభంతో శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆగస్టు 21 వరకు చింగం మాసం పూజలు కొనసాగనుండగా, ఓణం సందర్భంగా ఆగస్టు 24న ఆలయం మళ్లీ తెరుచుకోనుంది. దీంతో ఆలయానికి భక్తుల రాక కొనసాగుతోంది.

Sabarimala Ayyappa Darshan Telugu: కేరళలోని ప్రసిద్ధ శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మలయాళ నూతన సంవత్సరం చింగం మాసం ప్రారంభం సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచే వందలాది మంది భక్తులు శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మలయాళ క్యాలెండర్ ప్రకారం కర్కిడకం మాసం చివరి రోజైన ఆదివారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళశాంతి ప్రసాద్ ఈ.డి. ఆధ్వర్యంలో, తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పదినెట్టాంపడి కింద ఉన్న పవిత్ర ఆజిలో అగ్ని వెలిగించారు.
మలయాళ నూతన సంవత్సరానికి ముందురోజైన ఆదివారం సాయంత్రం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు చేరుకున్నారు. రాత్రి పూజలు పూర్తయిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేసి, సోమవారం ఉదయం 5 గంటలకు మళ్లీ భక్తుల దర్శనార్థం తెరిచారు. చింగం మాసం పూజల్లో మరో ముఖ్యమైన కార్యక్రమం కూడా జరగనుంది. ఉష పూజ అనంతరం శబరిమలలో మేళశాంతికి పూజలు, ఇతర ఆచారాల్లో సహకరించే ఉల్కాజకంను లాటరీ విధానంలో ఎంపిక చేయనున్నారు.
ఆగస్టు 21 వరకు చింగం మాసం పూజలు
చింగం మాసం పూజలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం ఆగస్టు 24న ఓణం పూజల కోసం శబరిమల ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది ఓణం పండుగలో అత్యంత ముఖ్యమైన తిరువోణం ఆగస్టు 26న జరగనుంది. దీంతో ఓణం సందర్భంగా కూడా శబరిమలలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అయ్యప్ప దర్శనానికి భక్తుల ఏర్పాట్లు
చింగం మాసంలో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగానే వర్చువల్ క్యూ ద్వారా దర్శన స్లాట్‌ను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) కూడా ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 16 నుంచి 28 వరకు శబరిమల యాత్రికుల కోసం విస్తృతమైన ప్రయాణ సౌకర్యాలను అందుబాటులో ఉంచింది.
స్వామియే శరణం అయ్యప్ప! చింగం మాసం ప్రారంభంతో శబరిమలలో భక్తి, ఆధ్యాత్మికత మరింత వెల్లివిరిసింది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం తరలివస్తున్న భక్తులతో పవిత్ర సన్నిధానం శరణుఘోషలతో మార్మోగుతోంది.




