భర్తకు నిద్రమాత్రలిచ్చి.. బ్యాట్‌తో కొట్టి చంపి ఇంట్లోనే పాతేసిన ఇల్లాలు.. చివర్లో ట్విస్ట్!
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ సినిమా చూసే ఉంటారు. అచ్చం అదే మాదిరి ఇల్లాలు తన భర్తను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టేందుకు విఫలయత్నం చేసి.. చివరికి దొరికిపోయింది. ముందుగా పతి దేవుడికి నిద్ర మత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి, ఆనక బ్యాట్‌తో తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించింది. శవాన్ని మాయం చేసేందుకు ఇంట్లో పూడ్చి పెట్టేందుకు పన్నాగం పన్నింది. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని బారామతిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

బారామతి, ఆగస్ట్ 17: మహారాష్ట్రలోని బారామతికి చెందిన షర్మిలా (38), ప్రవీణ్ జాదవ్ దంపతులు. అయితే తన భర్త ప్రవీణ్ జాదవ్‌ను హత్య చేసేందుకు జూలై 30న షర్మిలా ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ముందుగా భర్త తాగే జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. వాటిని తాగిన ప్రవీణ్ రెండు రోజుల పాటు స్పృహ కోల్పోయాడు. ఆగస్టు 1న ప్రవీణ్‌కు కొంత స్పృహ వచ్చిన సమయంలో షర్మిలా బ్యాట్‌తో అతనిపై తీవ్రంగా దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. భర్తను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే పూడ్చిపెట్టాలని ఆమె ప్రయత్నించింది. ఇందుకోసం కార్మికులతో ఇటుకలు, సిమెంట్‌తో ముందుగానే ఓ చదరపు ఆకారంలోని నిర్మాణాన్ని చేయించింది. ప్రవీణ్‌ను అందులో పడుకోబెట్టి, పైన పెద్ద రాయి పలకను ఉంచి ఆ నిర్మాణాన్ని మూసివేయడానికి ప్రయత్నించింది. అయితే నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులకు పరిస్థితిపై అనుమానం వచ్చింది. గుంతలో ఉన్న ప్రవీణ్ చేయి కదపడం కార్మికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రవీణ్‌ను గుంత నుంచి బయటకు తీసి రక్షించారు. ఈ ఘటనపై ప్రవీణ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షర్మిలాను పోలీసులు అరెస్టు చేశారు.
‘రెండు రోజులు నిద్రపోయాను.. మూడో రోజు లేచేసరికి బ్యాట్‌తో కొడుతోంది’
తనపై జరిగిన దాడిని ప్రవీణ్ పోలీసులకు వివరించాడు. తన భార్య జ్యూస్‌లో నిద్రమాత్రలు కలపడంతో రెండు రోజుల పాటు నిద్రలోనే ఉన్నానని చెప్పాడు. మూడో రోజు కొంత స్పృహ వచ్చినప్పుడు భార్య తనను బ్యాట్‌తో కొడుతున్నట్లు గుర్తించానని తెలిపాడు. కొట్టొద్దని వేడుకున్నా ఆమె వినలేదని పేర్కొన్నాడు. ఆ తర్వాత తనను ఎత్తుకుని బాల్కనీలో ఏర్పాటు చేసిన గుంతలో పడుకోబెట్టిందని చెప్పాడు. అయితే కార్మికులు వచ్చి తన చేయి కదలడాన్ని గుర్తించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారని, వారి వల్లే తన ప్రాణాలు నిలిచాయని తెలిపాడు. ఘటన జరిగిన సమయంలో తన తల్లి కూడా ఇంట్లోనే ఉన్నారని ప్రవీణ్ తెలిపారు. తన భార్య తన తల్లికి కూడా నిద్రమాత్రలు ఇచ్చిందని ఆరోపించాడు. అయితే ప్రవీణ్‌పై భార్య బ్యాట్‌తో దాడి చేస్తున్న సమయంలో అతని తల్లికి స్పృహ వచ్చిందని, వెంటనే ఆమె మరో కుమారుడికి సమాచారం అందించిందని చెప్పాడు. దీంతో అతని సోదరుడు ఇంటి తలుపు తెరిచి లోపలికి వచ్చి గుంతలో ఉన్న ప్రవీణ్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపాడు.
‘బ్లాక్ మ్యాజిక్ కోణం ఉండొచ్చు’
ఈ ఘటన వెనుక క్షుద్రపూజలు లేదా బ్లాక్ మ్యాజిక్ కోణం ఉండొచ్చనే అనుమానాన్ని కూడా ప్రవీణ్ వ్యక్తం చేశాడు. జూలై 13, 14 తేదీల్లో ఇంటి క్యాలెండర్‌లో తన భార్య ‘నో రిజల్ట్’ అని రాసిందని, ఆ రెండు రోజులు అమావాస్య రోజులు కావడంతో దీనికి ఏదైనా సంబంధం ఉందా అనే అనుమానం ఉందని పేర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు నిజంగా అలాంటి నేపథ్యం ఉందా అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. తన భార్యకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అధిక మోతాదులో నిద్రమాత్రలు విక్రయించిన మెడికల్ షాపు యజమానిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ పోలీసులను కోరాడు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి మందులు విక్రయించినందుకు మెడికల్ షాపు లైసెన్స్‌ను రద్దు చేయాలని తన ఫిర్యాదులో కోరారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటన అనంతరం తన అత్తమామలు ఇద్దరు పిల్లలను తమ వెంట తీసుకెళ్లారని ప్రవీణ్ తెలిపారు. తన పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. పిల్లలను వెంటనే తనకు అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




