Hyderabad: హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తున్నాయి. చెరువుల్లోకి నీరు చేరుతోంది. రోడ్లపై వాన నీరు ప్రవహిస్తోంది. వాతావరణం కూడా చల్లబడుతోంది. అయినా నగరం ముందున్న మరో పెద్ద సమస్య నీటిదే. వర్షం పడుతున్నప్పుడే వచ్చే వేసవికి నీటి లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నగరం పెరుగుతున్న వేగానికి తగ్గట్టుగా నీటి అవసరం కూడా పెరుగుతోంది. అందుబాటులో ఉన్న వనరులు మాత్రం అంతే వేగంగా పెరగడం లేదు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

హైదరాబాద్ చుట్టూ నగరం వేగంగా విస్తరిస్తోంది. కొత్త కాలనీలు, అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, కార్యాలయాలు పెరుగుతున్నాయి. విస్తృత హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో దాదాపు 1.3 కోట్ల మంది ఉన్నట్లు తాజా అంచనాలు ఉన్నాయి. ఇంత పెద్ద జనాభాకు ప్రతిరోజూ భారీగా నీరు అవసరం. ప్రస్తుతం నగరానికి సుమారు 600 MGD నీరు సరఫరా అవుతోంది. MGD అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే. ఒక మిలియన్ గ్యాలన్ సుమారు 37.85 లక్షల లీటర్లు. ఈ లెక్కన 600 MGD అంటే రోజుకు దాదాపు 2,270 మిలియన్ లీటర్ల నీరు. కానీ నగర అవసరం సుమారు 750 MGD. అంటే రోజుకు దాదాపు 2,840 మిలియన్ లీటర్లు కావాలి. సరఫరా, అవసరం మధ్య దాదాపు 150 MGD తేడా ఉంది. లీటర్లలో చూస్తే రోజుకు సుమారు 570 మిలియన్ లీటర్ల లోటు ఉంది. ఈ తేడా ప్రస్తుతం కొంతవరకు వివిధ నీటి వనరుల ద్వారా సర్దుబాటు అవుతోంది. అయితే జనాభా పెరుగుతున్న కొద్దీ ఈ గ్యాప్ మరింత పెరిగే అవకాశం ఉంది.
అనేక వనరులపై ఆధారపడుతున్న నగరం
హైదరాబాద్‌కు ఒకే నీటి వనరు ఆధారం కాదు. కృష్ణా, గోదావరి, సింగూర్, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వంటి పలు వనరుల నుంచి నగరానికి నీరు వస్తోంది. అందుతున్న నీటిలో కృష్ణా ప్రాజెక్టుల నుంచి సుమారు 280 MGD, గోదావరి యెల్లంపల్లి నుంచి సుమారు 165 MGD, సింగూర్ నుంచి సుమారు 70 MGD, మంజీరా నుంచి సుమారు 41 MGD, జంట జలాశయాల నుంచి సుమారు 30 MGD వస్తుందని అధికారులు చెబుతున్నారు. నీటి లభ్యత, పంపింగ్ పరిస్థితులను బట్టి ఈ సంఖ్యల్లో మార్పులు ఉంటాయి. ఈ వ్యవస్థ వల్ల ఒక వనరులో నీరు తగ్గినప్పుడు మరో వనరు నుంచి కొంత మేర భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఏకకాలంలో రెండు, మూడు వనరులు బలహీనపడితే నగరంపై ఒత్తిడి పెరుగుతుంది.
వర్షం పడటం వేరు – రిజర్వాయర్ నిండటం వేరు
హైదరాబాద్‌లో వర్షాలు పడుతున్నా ఆ నీటిలో ప్రతి చుక్క తాగునీటి రిజర్వాయర్లకు చేరదు. నగరంలో ఏ ప్రాంతంలో వర్షం పడింది, ఆ ప్రాంతం ఏ జలాశయ పరిధిలో ఉంది, అక్కడి నుంచి ఎంత నీరు ప్రవహించింది, ఎంత నీరు నేలలోకి ఇంకింది అనే అంశాలపై రిజర్వాయర్లకు వచ్చే నీటి పరిమాణం ఆధారపడి ఉంటుంది. అందుకే నగరంలో భారీ వర్షం పడినంత మాత్రాన అన్ని రిజర్వాయర్లు నిండిపోవు. అదే సమయంలో ఒక రిజర్వాయర్‌లో నీరు తగ్గిందని మొత్తం హైదరాబాద్‌కు నీటి కొరత వచ్చేసిందని కూడా అర్థం కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. వేసవి మొదలైన తర్వాత నీటి కోసం పరుగులు పెట్టడం కంటే వర్షాలు పడుతున్న సమయంలోనే వచ్చే వేసవికి అవసరమైన నీటి లెక్కను సిద్ధం చేసుకోవడం మంచిది.
సింగూర్, మంజీరా నిల్వలపై ఒత్తిడి
హైదరాబాద్‌కు నీరు అందించే ప్రధాన వనరుల్లో సింగూర్, మంజీరా కీలకమైనవి. ప్రస్తుతం ఈ రెండు వనరుల్లో నిల్వల పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. సెప్టెంబర్ 22 నాటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం సింగూర్‌లో నిల్వ దాని సామర్థ్యంలో సుమారు 14 శాతం ఉండగా, మంజీరాలో సుమారు 22 శాతం ఉంది. మరోవైపు ఎల్లంపల్లిలో నిల్వ సుమారు 92 శాతం ఉండటం కొంత ఊరటనిస్తోంది. కృష్ణా ప్రాజెక్టుల్లోనూ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. దీంతో హైదరాబాద్‌లో నీరు పూర్తిగా అయిపోయిన పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. అయితే అన్ని వనరుల్లో ఒకే స్థాయిలో నీరు లేకపోవడం మాత్రం భవిష్యత్తుపై అప్రమత్తత అవసరమని చెబుతోంది. సింగూర్ నుంచి సరఫరా తగ్గితే దాని ప్రభావం పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. అందుకే గోదావరి నుంచి అదనపు నీటిని మళ్లించడం, మిషన్ భగీరథ వ్యవస్థ నుంచి అవసరమైన సమయంలో నీటిని తీసుకురావడం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
రేపటి అవసరం పెరుగుతుంది
హైదరాబాద్ నీటి సమస్యలో మరో ముఖ్యమైన అంశం నగర విస్తరణ. ప్రస్తుతం రోజుకు సుమారు 750 MGD వరకు ఉన్న అవసరం రాబోయే కాలంలో 830 MGD దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే నేటి 600 MGD సరఫరాతో పోలిస్తే భవిష్యత్తులో అవసరం మరింత పెరుగుతుంది. కొత్త ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు పెరిగే కొద్దీ నీటి వినియోగం కూడా పెరుగుతుంది. జనాభా పెరుగుతున్న వేగానికి సరిపడా నీటి వనరులు పెరగకపోతే ప్రస్తుతం ఉన్న లోటు మరింత పెద్దదిగా మారుతుంది. అందుకే నగర నీటి ప్రణాళిక కేవలం వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని కాకుండా వచ్చే పది, ఇరవై ఏళ్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి.
ప్రత్యామ్నాయ నీటి వనరులు
హైదరాబాద్‌కు భవిష్యత్తులో ఒక్క కొత్త నీటి ప్రాజెక్టు సరిపోదు. అనేక వనరులను అనుసంధానం చేసే బలమైన వ్యవస్థ అవసరం. సింగూర్ లేదా మంజీరాలో నీరు తగ్గినప్పుడు గోదావరి నుంచి వెంటనే నీటిని మళ్లించే సామర్థ్యం ఉండాలి. మల్లన్నసాగర్, మిషన్ భగీరథ వంటి వనరులను అవసరమైన సమయంలో నగరానికి ఉపయోగించుకునేలా పైపులైన్లు, పంపింగ్ వ్యవస్థలు సిద్ధంగా ఉండాలి. గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 వంటి ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తి చేయడం దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది. ఒక నీటి వనరులో సమస్య వచ్చినప్పుడు మరో వనరు నుంచి నీటిని మళ్లించేలా ప్రధాన పైపులైన్లను అనుసంధానం చేయాలి. అలా చేస్తే ఒక ప్రాంతంలో నీటి సమస్య వచ్చినా మొత్తం నగరంపై ప్రభావం పడకుండా చూడవచ్చు.
ఏం చేయాలి..?
కొత్త నీరు తెచ్చుకోవడంతో పాటు ఉన్న నీటిని కాపాడాలి. హైదరాబాద్‌కు కొత్త నీటిని తీసుకురావడం ఎంత ముఖ్యమో నగరంలో పడే వర్షపు నీటిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం భారీ వర్షం పడినప్పుడు చాలా నీరు రోడ్లపై నుంచి నాలాల్లోకి వెళ్లిపోతోంది. ఈ నీటిలో కొంత భాగాన్ని భూగర్భంలోకి పంపేలా రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్‌ను విస్తృతంగా అమలు చేయాలి. అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ భవనాలు, వాణిజ్య సముదాయాల్లో వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. చెరువులు, కుంటలు, సహజ నీటి ప్రవాహ మార్గాలను కాపాడాలి. వర్షపు నీరు నేలలోకి ఇంకే అవకాశం పెరిగితే భూగర్భ జలాలు మెరుగవుతాయి. బోర్లపై ఒత్తిడి తగ్గుతుంది. వేసవిలో ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి కూడా కొంత తగ్గుతుంది.
వాడిన నీటిని మళ్లీ ఉపయోగించాలి
హైదరాబాద్ నీటి భద్రతకు మరో ముఖ్యమైన మార్గం శుద్ధి చేసిన మురుగునీటిని తిరిగి ఉపయోగించాలి. పరిశ్రమలు, పార్కులు, నిర్మాణ పనులు వంటి తాగునీరు అవసరం లేని చోట్ల శుద్ధి చేసిన నీటిని ఉపయోగించవచ్చు. దీంతో తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించాల్సిన అవసరం తగ్గుతుంది. ఇళ్లలో కూడా నీటి వృథాను తగ్గించాలి. పైపుల లీకేజీలను వెంటనే అరికట్టాలి. అవసరం లేని చోట నీటిని వృథా చేయకూడదు. కోట్ల మంది ఉన్న నగరంలో ప్రతి ఇంటి పొదుపు కలిస్తే అది పెద్ద మొత్తంలో నీటిని ఆదా చేస్తుంది.
ఇప్పుడే మొదలు పెడితేనే…
హైదరాబాద్ ప్రస్తుతం పూర్తిగా నీటి సంక్షోభంలో ఉందని చెప్పడం సరైంది కాదు. అదే సమయంలో భవిష్యత్తుకు ఎలాంటి సమస్య ఉండదని భావించడం కూడా సరికాదు. రోజుకు సుమారు 600 MGD సరఫరా, 750 MGD అవసరం మధ్య ఉన్న తేడా పరిస్థితిని స్పష్టంగా చూపుతోంది. ఇప్పటి నుంచే గోదావరి, కృష్ణా, సింగూర్, మంజీరా వంటి ప్రధాన వనరులను బలోపేతం చేయాలి. ప్రత్యామ్నాయ నీటి మార్గాలను సిద్ధంగా ఉంచాలి. వర్షపు నీటిని ఒడిసిపట్టాలి. భూగర్భ జలాలను పెంచాలి. శుద్ధి చేసిన మురుగునీటిని మళ్లీ ఉపయోగించాలి. నీటి వృథాను తగ్గించాలి. నీరు ఉంటేనే ఊరు. నీరు లేకుంటే బీడు.
హైదరాబాద్‌లో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇది మంచి అవకాశం. ఈ వర్షాలను వచ్చే వేసవికి ఉపయోగపడే నీటిగా మార్చుకోవాలి. రిజర్వాయర్లలో ఉన్న నీటిని జాగ్రత్తగా నిర్వహించాలి. కొత్త నీటి వనరులను ముందుగానే సిద్ధం చేయాలి. ఎందుకంటే నగరానికి నీటి భద్రత అంటే కేవలం ఈరోజు కుళాయి తిప్పితే నీళ్లు రావడం కాదు. రేపు జనాభా పెరిగినా, ఎండలు పెరిగినా, ఒకటి రెండు ప్రధాన వనరులు బలహీనపడినా నగరానికి నిరంతరంగా నీరు అందే వ్యవస్థ ఉండాలి. వర్షాలు పడుతున్నప్పుడే వేసవిని గుర్తు పెట్టుకోవాలి. నీరు ఉన్నప్పుడే రేపటి నీటి లెక్క సిద్ధం చేసుకోవాలి. అప్పుడే హైదరాబాద్ భవిష్యత్తు దాహం లేకుండా ఉంటుంది.
కొండవీటి శివనాగరాజు
డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9
